ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Rajyam: ఇందిరమ్మ రాజ్యం రాలేదేమి?

ABN, Publish Date - Oct 11 , 2025 | 01:54 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణను ఆవిష్కరిస్తానని వందమార్లు నమ్మబలికిన కేసీఆర్‌ పాలనలో అన్ని రంగాలూ మరింత నిర్వీర్యమై...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణను ఆవిష్కరిస్తానని వందమార్లు నమ్మబలికిన కేసీఆర్‌ పాలనలో అన్ని రంగాలూ మరింత నిర్వీర్యమై శిథిలావస్థకు చేరాయి. కుటుంబ నిరంకుశ పాలనలో అధికారిక అనధికారిక దోపిడీ, అవినీతి అనేక రెట్లు పెరిగిపోయింది. అవినీతిమయ పాలనను జీర్ణించుకోలేని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాహుల్‌గాంధీ సమక్షంలో పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ పాలన (1967–77)లో పేదల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాల అమలు జరిగింది. ఇందిరాగాంధీ నేతృత్వంలో 1975లో తెలంగాణలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. అనేక డిగ్రీ జూనియర్ కళాశాలలు మొదలయ్యాయి. మారుమూల గ్రామాలలో వందలాది ఉన్నత పాఠశాలలు అవతరించాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విస్తరణ జరిగింది. ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయడం, సంస్థానాధీశులకు ఇచ్చే కోట్లాది రూపాయల రాజభరణాలను రద్దు చేయడం, భూగరిష్ఠ పరిమితి చట్టం తేవటం వంటి ఎన్నో మంచి పనులు జరిగాయి. ఇరవై సూత్రాల పథకం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. మొట్టమొదటిసారి బీసీలకు విద్య, ఉద్యోగాలలో 25శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. నిష్ణాతులైన మేధావి వర్గం సలహాలతో ఏర్పడిన ప్రణాళికా సంఘం ద్వారా ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు, పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. అందుకే పేద ప్రజలు ఇప్పటికీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఇష్టంగా తలుచుకుంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు పాలనలో గుణాత్మకమైన మార్పు కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణలో గత పాలనలో విధ్వంసానికి గురైన ప్రభుత్వ విద్యాసంస్థలు ఇప్పటికీ సంక్షోభంలోనే కూరుకొని ఉన్నాయి.

ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థలు రకరకాల బలహీనతలతో ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నాయి. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్, నీటిపారుదల మున్సిపాలిటీ శాఖలలో అవినీతి విలయతాండవం చేస్తున్నది. కేవలం వ్యవసాయ, సేవల రంగంపై ఆధారపడిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక అభివృద్ధి నామమాత్రంగా మిగిలిపోయింది. ఎదుగుతున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుకావడం లేదు. లాభసాటి వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల ఊసే లేదు. ప్రజలు తమ ఆదాయంలో అత్యధిక భాగం ప్రైవేటు విద్య, వైద్య సేవల కొనుగోలు కోసం, అధికారులకు అవినీతి చెల్లింపుల కోసం కోల్పోతున్నారని క్షేత్రస్థాయి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పరిపాలనలో గుణాత్మకమైన మార్పు రావడంలేదని బాధిత ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం అప్పులు చేయకపోతే పూట గడవడం లేదు. ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, గత ప్రభుత్వం చేసిన బాకీలు, బకాయిల చెల్లింపులకే సరిపోవడం లేదనీ నిత్యం వార్తా కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధే అన్నట్టుగా అక్కడే కార్పొరేట్ సంస్థల అభివృద్ధి, విస్తరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో వెనుకబడిన ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వ పెట్టుబడులు లేక, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించలేక ఆ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత రాష్ట్ర రాజధానికి వలస పోతున్నది. ఇందిరమ్మ రాజ్యంలో వలె వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికల ఊసే లేదు. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం అమలుకు ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ళ వ్యవధి మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా పేద ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలనలో గుణాత్మకమైన మార్పులను అమలు చేయాలి. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో నూతన ఒరవడితో రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి.

-ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

Updated Date - Oct 11 , 2025 | 01:54 AM