ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Americas Dominance: అమెరికా ఆధిపత్యం నిలిచేనా

ABN, Publish Date - Sep 05 , 2025 | 12:40 AM

చరిత్ర అనేది ఒక నిరంతర చైతన్య వాహిని. కఠినమైన న్యాయమూర్తి. ఎవరిపైనా పక్షపాతం చూపదు, ఎవరినీ కనికరించదు. ఎంతో గొప్పవారమని ఎవరు భావించినా...

`రిత్ర అనేది ఒక నిరంతర చైతన్య వాహిని. కఠినమైన న్యాయమూర్తి. ఎవరిపైనా పక్షపాతం చూపదు, ఎవరినీ కనికరించదు. ఎంతో గొప్పవారమని ఎవరు భావించినా, తామే శాశ్వత పాలకులమని, ఎప్పటికీ అధినాథులమని ఎవరు అనుకున్నా చరిత్ర ఎప్పుడూ అటువంటి వారికి ఒక గట్టి పాఠం నేర్పింది. అధికారం, సంపదతో పాటు మరేదీ శాశ్వతం కాదని చరిత్రలో పదే పదే రుజువయింది. ఇవి ఎప్పటికీ మరచిపోకూడని పాఠాలు. ఆ సత్యాలు వర్తమాన ప్రపంచానికి, ముఖ్యంగా నేటి అమెరికాకు వర్తిస్తాయి. వంద సంవత్సరాల క్రితం గ్రేట్‌ బ్రిటన్ సమస్త ప్రపంచానికి ఏకైక నాయకి. ప్రపంచ సంపదలో ఆ దేశానికి 20శాతం కంటే ఎక్కువ వాటా ఉండేది. మానవాళిలో నాలుగో వంతుకు పైగా జనాభా బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో ఉండేది. వినూత్న వాణిజ్యాలు, కొత్త పరిశ్రమలు, నవ సాంకేతికతలు సమస్తమూ అన్నీ బ్రిటన్ నుండే ప్రభవించినట్టుండేవి. సప్త సముద్రాలపై బ్రిటిష్ నౌకాదళ సర్వాధిపత్యం తిరుగులేకుండా ఉండేది. లండన్‌లో తీసుకున్న నిర్ణయాలు దేశదేశాల భవిష్యత్తును మార్చేవి. ‘బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు’ అనేది కేవలం మాట కాదు, వాస్తవం. అయితే ఇరవయో శతాబ్ది పూర్వార్ధంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలు బ్రిటన్‌ను గట్టిగా కుదిపేశాయి. ఆ యుద్ధాల వలన బ్రిటన్‌ సిరిసంపదలు అడుగంటిపోయాయి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య పాలకుల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. వలస దేశాల్లో స్వాతంత్ర్య ఉద్యమాలు ఉధృతమయ్యాయి. తొలుత భారత్ విముక్తమయింది. ఆ తరువాత ఆసియా, ఆఫ్రికా దేశాలు క్రమంగా స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. 20వ శతాబ్దం మధ్య నాటికే బ్రిటన్ ఒక సాధారణ యూరోపియన్ దేశంగా మారిపోయింది. ఇప్పటికీ అలాగే మిగిలిపోయి ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన బ్రిటన్, నేడు తన గత చరిత్ర జ్ఞాపకాలతో కాలాన్ని నెట్టుకొస్తున్నది.

రెండు శతాబ్దాల క్రితం యూరప్ ఖండంలో ఫ్రాన్స్ అత్యంత శక్తిమంతమైన దేశంగా వెలిగింది. నెపోలియన్ చక్రవర్తి సైన్యాలు యూరప్ అంతటినీ జయించాయి. నెపోలియన్‌ అజేయుడని భావించేవారు. ఫ్రెంచ్ సంస్కృతి, కళలు, భాష సమస్త ప్రపంచాన్నీ ఆకర్షించాయి. తన పాలన శాశ్వతమని నెపోలియన్ విశ్వసించాడు. ఆ వివేకరాహిత్యమే అతడిని దెబ్బ తీసింది. నిరంతర యుద్ధాలు ఫ్రాన్స్ ఆర్థిక వనరులను హరించివేశాయి. బ్రిటన్‌, ఇతర యూరోపియన్‌ దేశాలు సమైక్యంగా నెపోలియన్‌పై దండెత్తాయి. చివరికి అతడిని ఓడించి, ఒక సుదూర దీవిలో ఒంటరిగా బంధించాయి. ఫ్రాన్స్ ఆధిపత్యం తగ్గిపోయింది. ఆ తరువాత కూడా ఫ్రాన్స్ సాటిలేని ఒక సాంస్కృతిక, ఆర్థిక శక్తిగా నిలిచినా, సామ్రాజ్యాధిపత్యాన్ని మాత్రం కోల్పోయింది. నాలుగు శతాబ్దాల క్రితం స్పెయిన్ ప్రపంచ సముద్రాలపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఆసియాలోని ఫిలిప్పీన్స్‌లో మనీలా నుంచి ఉత్తర అమెరికాలోని మెక్సికో వరకూ సువిశాల భూభాగాలు స్పెయిన్ పాలనలో ఉండేవి. వెండి, బంగారం, సుగంధ ద్రవ్యాలు, పట్టుతో నిండిన నౌకలు తరలివచ్చేవి. స్పానిష్‌ రాజవంశం తమ పాలన దేవదత్తమని, శాశ్వతమని నమ్మింది. కానీ తన సంపదను సరైన విధంగా ఉపయోగించలేదు. మితిమీరిన ఖర్చులు చేసింది. ప్రబలిపోయిన మత అసహనం, యుద్ధాలు, దోపిడీలు... ఇవన్నీ స్పెయిన్ శక్తి సామర్థ్యాలను క్రమంగా క్షీణింపచేశాయి. 19వ శతాబ్దంలో లాటిన్ అమెరికా దేశాలు స్పెయిన్‌ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించాయి. ఒకప్పుడు బంగారం, వెండి నిల్వలతో మెరిసిన స్పెయిన్ సామ్రాజ్యాన్ని కోల్పోయిన తరువాత యూరప్‌లో ఒక సాధారణ దేశంగా మిగిలిపోయింది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్– ఈ మూడు దేశాల పతనం వెనక ఒకే కారణం ఉన్నది– తాము శాశ్వతమని నమ్మడం. బ్రిటన్ తన పాలనా విధానమే ఉత్తమమని భావించింది. ఫ్రాన్స్ తన సైన్యం ఎప్పటికీ అజేయమని అనుకుంది. స్పెయిన్ తన బంగారం ఎప్పటికీ తరుగదని విశ్వసించింది. అయితే కాలం అన్నది ఎవరి కోసం ఆగదు. చరిత్ర ముందుకు సాగిపోయింది. ప్రతి సామ్రాజ్యం ఎప్పటికైనా కూలిపోతుందనే సత్యాన్ని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చరిత్ర రుజువు చేసింది.

ప్రస్తుత ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా పేరుబడిన అమెరికా కూడా నెమ్మదిగా గతించిన సామ్రాజ్యాల బాటలో నడుస్తున్నది. ఇరవయో శతాబ్దం తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు అమెరికా తిరుగులేని ఆర్థిక, సైనిక శక్తిగా, సాంకేతిక ఆవిష్కరణలలో అగ్రగామిగా వెలుగొందింది. డాలర్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన కరెన్సీగా మార్చి, ఇతర దేశాలపై తన ప్రభావాన్ని చూపుతున్నది. అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రతిభావంతులను ఆకర్షించే అవకాశాలు అన్నీ అమెరికాలోనే కేంద్రీకృతమయ్యాయి. అంతేకాదు, అనేక దేశాల్లో సైనిక స్థావరాలను నెలకొల్పి తన కుయుక్తిని ప్రదర్శిస్తున్నది. ప్రపంచ నాయకత్వం తనకు మాత్రమే సొంతం అనే అహంభావాన్ని సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తున్నది. అయితే కాలం మారింది. అంతర్గతంగా, బాహ్యంగా అమెరికా ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. దేశీయంగా రాజకీయ అస్థిరత పెరిగిపోతున్నది. పార్టీ విభేదాలు, విధానాల్లో అస్పష్టత, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నాయి. ధనిక–పేదల మధ్య అసమానతలు ఆందోళనకర స్థాయికి చేరాయి. జాత్యహంకారం, వర్ణ వివక్ష ఇంకా పూర్తిగా అంతరించలేదు. ఫలితంగా, అమెరికా ప్రజలు ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోతున్నారు. విదేశీ సంబంధాలలో కూడా అమెరికా పరిస్థితి మునుపటిలా లేదు. చైనా, భారత్, బ్రెజిల్, టర్కీ మొదలైన దేశాలు వేగంగా ఎదుగుతున్నాయి. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కూడా జరుగుతున్నాయి. ఒకప్పుడు అమెరికా చెప్పిన మాటే తుది నిర్ణయంగా ఉండేది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అమెరికా మాట అంతగా చెల్లడం లేదు. అగ్ర రాజ్య ఆధిపత్యం తగ్గిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చరిత్ర మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతున్నది. ప్రపంచంలో ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు. రోమన్ సామ్రాజ్యం, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్– ఒకప్పుడు శక్తిమంతమైన దేశాలే, సందేహం లేదు. అయితే అహంకారం, నిర్లక్ష్యం, అంతర్గత విభేదాల వల్ల అవి క్రమంగా బలహీనపడి చరిత్రలో కనుమరుగయ్యాయి. నేడు అమెరికా కూడా అదే మార్గంలో నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

నిజమైన నాయకత్వం అనేది సైనిక బలంపై కాకుండా, న్యాయం, సమానత్వం, మానవతా విలువలపై ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు ఒక దేశాన్ని గొప్ప నాగరికతా శక్తిగా నిలుపుతాయి. ఆ విలువలను విస్మరించిన రోజు ఆ దేశం ప్రాబల్య ప్రభావాలు క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది చారిత్రక సత్యం. అమెరికా దీనిని మరవకూడదు. అమెరికా లేకపోయినా ప్రపంచం ముందుకు సాగుతుంది. రోమ్ కూలిపోయినా యూరప్ పురోగమనం ఆగలేదు. బ్రిటన్, ఫ్రాన్స్‌ ప్రభావం తగ్గినా కొత్త శక్తులు ప్రభవించాయి. అలాగే అమెరికా కూడా సమర్థమైన, సమంజసమైన నాయకత్వం అందించక పోతే ప్రపంచం దానిని దాటి ముందుకు వెళ్తుంది. ఇప్పటికే అనేక దేశాలు కొత్త కూటములుగా సంఘటితమవుతున్నాయి. అమెరికాతో నిమిత్తం లేకుండా ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెరుగుతున్నది. ఏ సామ్రాజ్య పతనం ఒక్కసారిగా సంభవించదు. అది నెమ్మదిగా, క్రమంగా జరుగుతుంది. అంతర్గత సమస్యలు, రాజకీయ విభజనలు, అహంకారం పెరిగితే ఎంత బలమైన దేశమైనా కూలిపోతుంది. అమెరికా కూడా ఈ సత్యాన్ని అంగీకరించి, తన మార్గాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది–చరిత్ర పాఠాలు గుర్తు పెట్టుకుని వినయం, న్యాయం, ఆవిష్కరణల ఆధారంగా కొత్త శతాబ్దానికి తగిన నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం; రెండోది–‘మేమే శాశ్వత అగ్రగాములు’ అనే భ్రమలో మునిగి, మెల్లగా తన ప్రభావాన్ని కోల్పోవడం. కాలం ఎవరిని విడిచిపెట్టదు. ఆర్థిక కలిమి, సైనిక బలం, రాజకీయ దురహంకారం ఆధారంగా నడిచే సామ్రాజ్యాలు ఎప్పటికీ నిలవవు. కాలమే వాటిని కనుమరుగు చేస్తుంది. అమెరికా భవిష్యత్తును నిర్ణయించేది ఇప్పుడు ఆ పాలకులు తీసుకునే నిర్ణయాలే.

-పి. వేణుగోపాల్‌రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్‌ సంస్థాపకుడు

Updated Date - Sep 05 , 2025 | 12:40 AM