ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Javed Akhtar: జావెద్‌ అక్తర్‌ తప్పేంటి

ABN, Publish Date - Sep 09 , 2025 | 04:55 AM

షోలే సినిమా విడుదలై 50 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకుంటున్నాం. అయితే ఆ ల్యాండ్‌ మార్క్ సినిమాకు రచనా..

షోలే’ సినిమా విడుదలై 50 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకుంటున్నాం. అయితే ఆ ల్యాండ్‌ మార్క్ సినిమాకు రచనా సహకారం అందించినవారిలో ఒకరైన జావెద్‌ అక్తర్‌కు జరిగిన అవమానం గురించి మాత్రం పట్టించుకోవడం మానేశాం. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, ఉర్దూ అకాడెమి ఆధ్వర్యంలో ‘Urdu in Cinema’ పేరుతో చేపట్టిన మూడు రోజుల సాహితీ ఉత్సవం సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకూ కలకత్తాలో జరగాల్సి ఉన్నది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జావెద్‌ అక్తర్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, కవి అయిన ముజఫర్‌ అలీని కూడా పిలిచారు. వీళ్లిద్దరి పేర్లతో పోస్టర్లు వెలిశాయి. ముషాయిరా, సెమినార్లు, ప్రసంగాలు, ఉర్దూ నాటకాలు, సినిమా సంభాషణలు వంటి అనేక అంశాలు ఈ కార్యక్రమంలో అలరిస్తాయని షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే ప్రారంభానికి కొన్ని గంటల ముందు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఎప్పుడు నిర్వహిస్తారో కూడా చెప్పలేదు, సరైన కారణాలు కూడా సదరు సాహితీవేత్తలకు తెలుపలేదు. అసలు విషయం ఏంటంటే జావెద్‌ అక్తర్‌ని ప్రముఖంగా ఉర్దూ అకాడెమి పిలవడాన్ని బెంగాల్‌లోని కొన్ని మత సంస్థలు అభ్యంతరం తెలిపాయి. జావెద్‌ ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడారని, నాస్తికత్వం ముసుగులో తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని అలాంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి పిలవడం తమకు నచ్చలేదని జమాతే ఉలేమా హింద్‌ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోకపోతే తాము తీసుకునే తీవ్ర చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించింది. అంతేకాకుండా గతంలో బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు వ్యతిరేకంగా తాము చేసిన ఉద్యమాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని భయపెట్టింది. ఈ సంస్థకు వాయహిన్‌ (Wahya Hin) అనే సంస్థ కూడా మద్దతు తెలిపింది. దీంతో తర్జన భర్జన పడ్డ బెంగాల్‌ ప్రభుత్వం చివరికి వివాదం ముదురుతుండటంతో మొత్తం కార్యక్రమాన్నే రద్దు చేసుకుని పారిపోయింది.

జావెద్‌ అక్తర్‌ మొదటి నుంచి తనను తాను నాస్తికుడిగానే ప్రకటించుకున్నారు. చివరికి తన పేరుకు ఇస్లాంకు కూడా సంబంధం లేదని అది పర్షియన్‌ పేరు అని ఒక సందర్భంలో చెప్పారు. ఆయన గతంలో షరియత్‌ చట్టాల మీద విమర్శ చేశారు. ముస్లిం మత సంఘాలు ఏకపక్షంగా ఫత్వాలు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. మత మూఢత్వం ముస్లింలకు మేలు చేయదని చెప్పారు. ఈ దేశంలో మత సామరస్యం పరిఢవిల్లాలనేది ఆయన ఆకాంక్ష. దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ ఆయన బహిరంగంగా టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. లౌకిక పునాదుల మీద తాను నడుస్తానని ప్రకటించారు. అయితే అంతకుముందు హిందూ మత సంస్థల ఆగ్రహానికి కూడా జావెద్‌ అక్తర్‌ గురయ్యారు. మైనార్టీల మీద మెజార్టీ మతవాదులు చేస్తున్న దాడులు తాలిబన్ల దుశ్చర్యలను తలపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆరెస్సెస్‌ని, భజరంగదళ్‌ని, వీహెచ్‌పీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. దీంతో హిందుత్వ సంఘాలు ఆయనను తీవ్రంగా విమర్శించాయి. ఒక దశలో చంపేస్తామని కూడా బెదిరించాయి. అయినా ఆయన తన ధోరణి మార్చుకోలేదు. అయితే తాజా వివాదంలో మాత్రం సహజంగానే హిందూ సంఘాలు జావెద్‌ అక్తర్‌ వైపు నిలిచాయి. ఈ సంఘటనను ఆధారం చేసుకుని బెంగాల్‌ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి బెదిరింపుల పాలనను కొనసాగిస్తారా? అంటూ బహిరంగంగానే నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా బీజేపీ ప్రయోగిస్తుండటంతో మరోవైపు జావెద్‌ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మత సంఘాలు కూడా రంగంలోకి దిగి రాజకీయ విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.

ఈ మొత్తం గందరగోళం మధ్య జావెద్ అక్తర్‌ స్పందించి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై సంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి. రెండు వర్గాల మతమౌఢ్యుల దగ్గర నుంచి తరచూ తనకు బెదిరింపులు వస్తున్నాయంటే తాను సరైన దారిలోనే నడుస్తున్నట్టు భావిస్తున్నానని తెలిపారు. ఉర్దూ అకాడెమికి మత సంస్థలకు సంబంధం ఏంటి? -అని ప్రశ్నించారు. ‘ఉర్దూ అనేది మత భాష కాదు, ప్రజల భాష’ అని అన్నారు. మతానికి ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమంలో పలు మత సంస్థల మాటలకు విలువనిచ్చి కార్యక్రమాన్ని రద్దు చేయడం సమంజసంగా లేదని చెప్పారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుసరించిన తీరు- మొదటి నుంచి ప్రజాస్వామ్య విధానాలకు, విభిన్న గొంతులకు నిలయంగా ఉన్న కోల్‌కతా నగర ప్రతిష్ఠకు భంగం కలిగించేదిగా ఉందని చెప్పారు. ప్రభుత్వం పారిపోకుండా ఈ విషయంలో జోక్యం చేసుకుని కవులు, కళాకారుల గొంతును, మాట్లాడే స్వేచ్ఛను కాపాడితే బావుండేదన్నారు. జరిగిన పరిణామాలతో తాను తీవ్ర నిరాశకు గురైనట్టు చెప్పారు. జావెద్‌ అక్తర్‌కి మద్దతుగా పలువురు హిందీ, ఉర్దూ రచయితలు స్పందించి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉత్తరం రాశారు. బెంగాల్‌లో వాక్‌ స్వాతంత్ర్యాన్ని కాపాడలేకపోయారని ఆ లేఖలో విమర్శించారు. జావెద్‌ అక్తర్‌ సాదా సీదా కవి కాదు. ఎందరి హృదయాలనో కదిలించే బలమైన కవిత్వం, పాటలు రాసినవారు. ఉర్దూ, హిందీ రెండు భాషల్లోనూ రచనలు చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ అవార్డులు పొందారు. హైదరాబాద్‌లో సైతం ఆయన ప్రముఖ కవి సినారె పేరు మీద ఇచ్చే విశ్వంభర పురస్కారం అందుకున్నారు. తన చలన చిత్ర జీవితంలో షోలే, జంజీర్‌, దీవార్‌ తోపాటు ఎన్నో మైలురాళ్ల వంటి సినిమాలకు రచనా సహకారం అందించారు. జావెద్‌ అక్తర్‌ మొదటి నుంచి హేతువాద దృక్పథం ఉన్నవాడని తెలిసి కూడా బెంగాల్‌ ప్రభుత్వం ఆయన వాక్‌ స్వేచ్ఛను కాపాడలేకపోయింది. మతతత్వ పార్టీగా పేరున్న బీజేపీకి ఒక దశలో కాంగ్రెస్‌ కన్నా ఎక్కువగా ఎదురొడ్డి నిలిచి, గెలిచి చివరికి బెంగాల్‌లో దీదీ సాధించిందేంటో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకుని ఈ కార్యక్రమాన్ని తిరిగి ఇదే సాహితీవేత్తలతో నిర్వహించి పరువు కాపాడుకోవాల్సి ఉంది.

-డా. వేంపల్లె షరీఫ్‌ జర్నలిస్టు, కథా రచయిత

Updated Date - Sep 09 , 2025 | 04:55 AM