ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Reservations: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నదెవరు

ABN, Publish Date - Aug 26 , 2025 | 04:55 AM

దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితిని అంచనా వేయడానికి 1978 80లో నాటి ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది....

దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితిని అంచనా వేయడానికి 1978–80లో నాటి ప్రభుత్వం మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సిఫారసులను వ్యతిరేకిస్తూ అడ్వానీ కమండల్ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్ర వెనుక ఉన్నదెవరో బీసీలకు తెలియదనుకోవడం బీజేపీ భ్రమ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు (1.విద్యా, ఉద్యోగాలలో, 2. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు) బీసీ బిల్లులకు అసెంబ్లీలో బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ పార్లమెంటులో మాత్రం మద్దతు ఇవ్వకుండా, 9వ షెడ్యూల్‌ను సవరించడానికి అవకాశం లేదంటూ ద్వంద్వ నాటకాలు ఆడుతోంది. ఇది అమిత్ షా ఆడిస్తున్న డ్రామా. నిజంగా బీసీలపై బీజేపీ సానుకూలంగా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో 9వ షెడ్యూల్‌ను సవరించే అవకాశం ఆ పార్టీయే తీసుకోవాలి. అది కుదరనప్పుడు బీజేపీ నియమించిన గవర్నర్ చేత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్సును తీసుకురావాలి. ఇప్పటికే ఈ అంశమై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఒక విప్లవ జ్యోతిని రగిలించారు.

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానికి, బీజేపీకి లేదు. మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలు గురించి చెబుతూ 7, ఆగస్టు 1990లో నాటి ప్రధాని వీపీ సింగ్ పార్లమెంట్‌లో ఒక చరిత్రాత్మక ప్రకటన చేశారు. ఇది అగ్రకులాలకు, బీజేపీకి మింగుడుపడలేదు. ఈ వ్యతిరేకతతో మూడు నెలల్లోనే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టింది. తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలందర్నీ కాంగ్రెస్‌ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ‘హిందూ బీసీలు, మైనార్టీ బీసీలు వేరు వేరు’ అంటూ కులాన్ని, మతాన్ని బీజేపీ వేరు చేసి చూపిస్తున్నది. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లలో మాత్రమే కులాలు, మతాలు వేరు కనిపిస్తున్నాయా? ముస్లింలు మనుషులు కారా! మరి హిందూ మతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి, క్రిస్టియన్ మతంలో చేరిన అవే కులాలకు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు, ముస్లింలలో ఉన్న పేదలకు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి?

రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నోసార్లు దాన్ని సవరించారు. ప్రతి ప్రభుత్వమూ ఓట్ల కోసం ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. 50 శాతం పరిమితి దాటి 60 శాతం రిజర్వేషన్లు దేశంలో అమలవుతాయని 2019లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు తెలియదనుకోవాలా? ఓబీసీలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయం ఉంటుందా? ఇదెక్కడి ప్రజాస్వామ్య తీర్పు? ప్రధాని మోదీ మాత్రం తన కులాన్ని ఓసీ నుంచి బీసీగా మార్చుకోవచ్చు కానీ, అసలైన హిందూ ఓబీసీలకు మాత్రం విద్యా, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వరా?! బీసీ, ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీజేపీ చిత్తశుద్ధితో సహకరించాలి. లేదంటే మున్ముందు ఆ పార్టీకి రాష్ట్రంలో రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

– మండ్ల రవి

Updated Date - Aug 26 , 2025 | 04:55 AM