Economic Crime: ఆర్థిక నేరస్థులకు శిక్ష ఎప్పుడు
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:55 AM
జనం సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఆర్థిక నేరస్థుల కేసులకు ఏళ్ళు గడుస్తున్నా అతీగతీ ఉండటం లేదు...
జనం సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకున్న ఆర్థిక నేరస్థుల కేసులకు ఏళ్ళు గడుస్తున్నా అతీగతీ ఉండటం లేదు. నేర తీవ్రత కళ్ళకు కడుతున్నా ఆర్థిక నేరస్థుల కేసులపై విచారణ పూర్తికావడానికి, తీర్పు రావడానికి ఏళ్ళకు ఏళ్ళు పట్టడం ఏమిటి? చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో అది ఎక్కడ అమలవుతున్నది? న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలులేకుండా పోయింది. నిందితులు ఒకరి తరువాత ఒకరు డిశ్చార్జి పిటిషన్లు వేసి విచారణను అడ్డుకొంటున్నారు. ఆర్థిక నేరస్థుల కేసుల విచారణను జాప్యం చెయ్యడానికి నిందితులు చేసే ప్రయత్నాలను దర్యాప్తు సంస్థలు అడ్డుకోవడం లేదు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనవడం వల్ల కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం కేసులను వాడుకోవడంతో రాష్ట్రాల్లో భారీ స్కామ్‌లు జరిగినా విచారణ వేగంగా జరగడం లేదు. భయంకరమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు కూడా బెయిల్‌పై ఉండి, వాయిదాలకు వెళ్లకుండా తిరగడంతో న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోతున్నారు.
ఆనాడు అధికారమే పెట్టుబడిగా క్విడ్ ప్రొ కో పద్ధతిలో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ జగన్‌రెడ్డిపై సీబీఐ 11, ఈడీ 9 అభియోగ పత్రాలు దాఖలు చేశాయి. జగన్‌రెడ్డి అవినీతి కేసుల విచారణ పన్నెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందం కావడానికి కారణం ఏమిటని సుప్రీంకోర్టు అనేకసార్లు సీబీఐని నిలదీసింది. ‘‘ఆవేశం అదుపు తప్పినప్పుడు ఒక హత్య జరగవచ్చు. కానీ, ఆర్థిక నేరం అటువంటి కాదు. నీతి తప్పినవారు కొందరు కలిసి కుట్ర పన్ని స్వార్థంతో పనిగట్టుకుని చేసేది ఆర్థిక నేరం. ఖజానాకు తీవ్రమైన నష్టం కలిగించే ఇలాంటి నేరాలను ఉపేక్షించరాదని, దేశ ఆర్థిక ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించాలి’’ అని 2013లో జగన్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని కూడా మరో కేసులో సుప్రీం స్పష్టం చేసింది. కుట్రలు, కుతంత్రాలతో జరిగిన ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటిస్తూనే ఉంది. రూ. 43వేల కోట్ల అక్రమాస్తులను వెనకేసుకున్నారనే నేరాభియోగాలను నెత్తిన పెట్టుకుని నిర్లజ్జగా తిరుగుతున్న జగన్‌రెడ్డి దాదాపు 12 ఏళ్ల నుంచి బెయిల్‌పై ఉన్నారు. ఆయనను అధికారంలోంచి ప్రజలు కిందికి దించినా పోలీసులనే బెదిరిస్తున్నారు. ఆర్థిక నేరగాళ్లను సకాలంలో శిక్షించకుండా ఉపేక్షిస్తే సమాజానికి జరిగే నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు.
ఒక్కో కేసులో ఏడేళ్ల నుంచి యావజ్జీవం దాకా శిక్షపడే తీవ్ర ఆర్థిక నేరాల్లో మొదటి ముద్దాయి అయిన జగన్‌రెడ్డి వాయిదాలకు వెళ్లకుండా కోర్టులకు మొహం చాటేస్తున్నారు. ఎనిమిది ఏళ్లుగా ఆయన మినహాయింపు ఎలా పొందగలుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు చెందాల్సిన జాతి సంపదను దోచుకుతిన్న ఆర్థిక నేరగాళ్లను బోనులో నిలబెట్టి దండించడంలో దర్యాప్తు సంస్థలు కూడా మీన వేషాలు లెక్కిస్తున్నాయి.
– నీరుకొండ ప్రసాద్
Updated Date - Jul 15 , 2025 | 01:55 AM