ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Future: బీఆర్‌ఎస్‌ భవితవ్యం ఏమిటి

ABN, Publish Date - Sep 03 , 2025 | 05:55 AM

భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉన్నదా తెలంగాణలో ఒకప్పుడు ఉజ్వలమైన పాత్రను పోషించిన భారత రాష్ట్ర సమితి దుస్థితి చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు...

భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉన్నదా? తెలంగాణలో ఒకప్పుడు ఉజ్వలమైన పాత్రను పోషించిన భారత రాష్ట్ర సమితి దుస్థితి చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అన్ని ప్రాంతీయ పార్టీలకూ వస్తుందని చెప్పలేము కాని బీఆర్ఎస్ దుస్థితి నుంచి మాత్రం ప్రాంతీయ పార్టీలు, వాటి నేతలు ఎలా వ్యవహరించకూడదో తెలుసుకునే అవకాశం ఉన్నది, తెలుసుకోవాలి కూడా. గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేవలం 240 సీట్లు మాత్రమే లభించాయి. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ సంఖ్యాబలం కంటే రెట్టింపుకు పైగా సంఖ్యాబలం ప్రాంతీయ పార్టీలదే. అంత మాత్రాన ప్రాంతీయ పార్టీల పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. ఇందుకు 2024 జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే తార్కాణం. కాని బీజేపీకి మద్దతునిచ్చిన ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం, జేడీ(యు) ప్రధాన పార్టీలు కాగా మిగతావన్నీ చిన్నా చితక పార్టీలు. ఎన్డీఏలో ఉన్నామని చెప్పుకుంటున్న దాదాపు 20 పార్టీలకు ఒక్క సీటూ లేదు. ఇండియా కూటమిలో కూడా సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్ మాత్రమే ప్రధాన పార్టీలు. దాదాపు 30కి పైగా పార్టీలు రెండు కూటముల్లోనూ అయిదు స్థానాలలోపే సాధించగా, వాటిలో మెజారిటీ పార్టీలకు కేవలం ఒక్కొక్క సీటే లభించింది. బీజేడీ, బీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీలు అదృశ్యం కాగా, శివసేన, లోక్ జనశక్తి, ఎన్‌సీపీ, జేఎంఎం వంటి పార్టీలు నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీల్లో కెల్లా జూనియర్ పార్టీ. డీఎంకే 1949లోనూ, ఆ పార్టీ నుంచి చీలిన అన్నాడీఎంకే 1972లోనూ జన్మించాయి. శివసేన 1966 నుంచీ ఉనికిలో ఉన్నది. జార్ఖండ్ ముక్తి మోర్చా 1972లో ఆవిర్భవించింది. తెలుగుదేశం 1982లో ఏర్పడితే, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ 1990వ దశకంలో జన్మించాయి. ఈ పార్టీలన్నీ ఇవాళ్టికీ అస్తిత్వంలో ఉండగా అవి ఏర్పడిన ఎంతో కాలానికి జన్మించిన బీఆర్ఎస్ మాత్రం ఎందుకు అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నది? ఈ వి‌షయమై ఆ పార్టీ ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.

చాలా ప్రాంతీయ పార్టీలకు ఒక సిద్ధాంతం, చరిత్ర, లక్ష్యాలు ఉన్నాయి. అవి రాజ్యాంగంలో పీఠిక లాంటివి. ఇటీవల మరణించిన జేఎంఎం అధినేత శిబూసోరెన్ కేవలం రాజకీయ నాయకుడు కాడు. భూస్వాములు, వడ్డీ వ్యాపారులు ఉపాధ్యాయుడైన తన తండ్రిని 1957లో హత్య చేస్తే వారికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడుతూ ఎదిగిన ప్రజా నాయకుడు. ఆదివాసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం, వారిని కట్టుబానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాడినవాడు. డీఎంకేకు 1916 నుంచే ద్రవిడ ఉద్యమం నిర్వహించిన చరిత్ర ఉన్నది. పెరియార్, అన్నాదురైలు నిర్మించిన వారసత్వం ఉన్నది. ఇవాళ స్టాలిన్ ఆ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన పోరాట క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ ఉద్భవించాయి. ములాయం తర్వాత అఖిలేశ్‌, లాలూ తర్వాత తేజస్వి తమ తండ్రుల దారిలో రాష్ట్రాల్లో బీజేపీని ఢీకొంటున్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా 85 ఏళ్ల వయస్సులో శరద్ పవార్ మరాఠా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పోరాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కూడా బెంగాలీల ఆత్మగౌరవానికి తానే ప్రతీకగా భావిస్తూ బీజేపీని శాయశక్తులా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు వారి ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన తెలుగుదేశం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, రాష్ట్ర విభజన జరిగినా అస్త్ర సన్యాసం చేయకుండా నిలదొక్కుకుని ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌కు కీలక మద్దతునిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా మూడు దశాబ్దాల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు ఇంకా అదే ఉత్సాహంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఏ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నాయన్నది ప్రధానం కాదు. చంద్రబాబు లాగా కరుణానిధి, మమతా బెనర్జీ, జయలలిత కూడా బీజేపీతోనూ కాంగ్రెస్‌తోనూ సంబంధాలు ఏర్పర్చుకున్నవారే. అయినా వారు తమ అస్తిత్వాన్ని పణంగా పెట్టినవారు కాదు. ఏది జరిగినా ఓటమిని అంత సులభంగా అంగీకరించేవారు కారు. మరి కేసీఆర్‌కు ఏమైంది? ఆయన పార్టీ ఎందుకు లుకలుకలకు గురవుతోంది? కారణం ఏమంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ లక్ష్యాలకు, ఆశయాలకూ కేసీఆర్ దూరం కావడమే. నేల విడిచి సాము చేయడమే. చాలా మంది ప్రాంతీయ నాయకులకున్న స్థిరత్వం, లక్ష్యశుద్ధి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్‌కు లేవు. తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా సామాజికంగా బలహీనవర్గాల్లో ఆకాంక్షలు పెరిగిపోయిన క్రమంలో జయశంకర్, కోదండరాం వంటి అనేక మంది నేతలు నిర్మించిన ఉద్యమం ఆయన రాజకీయంగా బలపడేందుకు తోడ్పడింది.

కేసీఆర్ పార్టీ ప్రారంభించిన ఏడేళ్ల వరకూ కేటీఆర్, కవిత దరిదాపుల్లో ఉండేవారు కాదు. ‘మా రాము అమెరికాలో ఉంటాడు. నెలకు 300 డాలర్లు పంపుతాడు. తెలంగాణ ఏర్పడకపోయినా నా మనుగడకేమీ ఢోకా లేదు’ అని ఆయన తుగ్లక్ రోడ్‌లో కేటీఆర్‌ను పరిచయం చేసిన రోజులున్నాయి. చాలా పార్టీల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో వారసులు ఉండడం సహజం. కాని ఆ పార్టీలేవీ వారసుల మూలంగా అంతర్గత సంక్షోభంలో చిక్కుకోలేదు. ములాయం, లాలూ, కరుణానిధి, శిబూ సోరెన్‌ల వారసులే ఆ తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. పైగా వారి బంధువులు కూడా పార్టీల్లో, పదవుల్లో కీలక స్థానాలు పోషించారు. అన్నీ సజావుగా జరిగాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో కూడా రాహుల్, ప్రియాంక ఎంత సన్నిహితంగా, ఎవరి బాధ్యతలు వారు నెరవేరుస్తూ ఉంటారో స్పష్టంగా కనపడుతుంది. బీఆర్ఎస్ కుటుంబసభ్యుల వల్ల దెబ్బతిన్నదని చెప్పడానికి వీల్లేదు. కేసీఆర్ వారి విషయంలో అప్రమత్తంగా, జాగరూకతతో లేకపోవడం వల్ల, సరైన మార్గదర్శకత్వం అందించపోవడం వల్ల, వారి పాత్రను నిర్దేశించకపోవడం వల్ల, కొన్ని విషయాల్లో అదుపులో పెట్టకపోవడం వల్ల దుష్పరిణామాలు జరిగాయనడానికి ఆస్కారం ఉన్నది. కేసీఆర్ చాలా పుస్తకాలు చదివి ఉండొచ్చు కాని ఆ పుస్తకాల వల్ల ఆయన ఏమి నేర్చుకున్నారనేది ప్రధానం. ‘ఎవరైనా ఏమైనా చెబితే అర్థం చేసుకునేందుకు వినరు. జవాబిచ్చేందుకు వింటారు..’ అని భారతీయుల గురించి ప్రముఖ అమెరికన్ విద్యావేత్త స్టీఫెన్ రిచర్డ్స్ కోవే రాశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఫోన్ చేసేవారు. ఆయన పాలన గురించి వస్తున్న విమర్శలను చెప్పేందుకు ప్రయత్నిస్తే కొట్టి పారేసేవారు. ‘కాళేశ్వరం అన్ని విమర్శలకూ సమాధానమిస్తుంది.. దానితో రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయి’ అని ఒకరోజు చెప్పారు. ఎంతసేపూ ఢిల్లీ రాజకీయాల గురించి, ముఖ్యంగా బీజేపీ గురించే ఆయన మాట్లాడేవారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలనని ఆశించేవారు. ఫాంహౌజ్‌లో ఉన్నదే పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం కోసమే. ఢిల్లీలో బిల్డింగ్ కట్టి యజ్ఞం చేస్తే తమ పార్టీ జాతీయ పార్టీ అయిపోతుందని నమ్మిన వ్యక్తి కేసీఆర్‌. కాళేశ్వరం విషయంలో ఆయన తాను అనుకున్నదే సరైనదని, ఇంజనీర్లకు కూడా ఏమీ తెలియదని భావించేవారని అనేకమంది చెప్పేవారు. ఆ వ్యక్తి తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లని భావిస్తుంటే విద్యాసాగర్‌రావుతో సహా అనేకమంది మేధావులు ఆయనకు చెప్పేందుకు సాహసించేవారు కాదు. ఆ ప్రాజెక్టుకు అయిన ఖర్చులో భారీ అవినీతి జరిగిందని చెప్పేందుకు ఇంజనీర్ల ఇళ్లలో భారీ మొత్తంలో దొరికిన డబ్బే నిదర్శనం.

కేసీఆర్‌ వ్యవహార శైలి విచిత్రమైనది. ఒక థింక్ టాంక్ అన్నది ఏర్పర్చుకోకపోగా, తన చుట్టూ ఉన్న ఆలోచనాపరుల్ని విస్మరించారు. ‘కేసీఆర్ గొప్ప మేధావి. ఆయన చేతితో ముక్కు రుద్దుకున్నారంటే చాలు ఏదో కీలకమైన వ్యూహం వేశారన్నమాటే..’ అని ఒక రోజు మజ్లిస్ నేత ఒవైసీ సెంట్రల్ హాలులో చెప్పారు. ఇలాంటివన్నీ నడిచినన్ని రోజులే నడుస్తాయి. ఒక రోజు తుగ్లక్ రోడ్ నివాసంలో కేసీఆర్, జయశంకర్‌లతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ వచ్చారు. మధ్యలో జయశంకర్ మాట్లాడబోగా కేసీఆర్ ఆయనను ‘మీకేం తెలుసు. ఆగండి’ అని అడ్డుకున్నారు. ఇలాంటి అవమానాలు ఆయన చుట్టూ ఉన్న మేధావులు చాలా మంది ఎదుర్కొన్నారు. ‘కేసీఆర్‌తో ఎలా వేగుతున్నారు సార్’ అని జయశంకర్‌ను అడిగితే ‘కనీసం భౌగోళిక తెలంగాణ రావడం ప్రధానం. అందుకు రాజకీయ సాధనం కేసీఆరే. ఆయనను విస్మరించలేం..’ అని చెప్పేవారు. భౌగోళిక తెలంగాణ వచ్చినా జయశంకర్ ఆశించిన సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడలేదు. వ్యవహారశైలి మాత్రమే కాదు. దేశంలో కొన్ని దశాబ్దాలుగా మనుగడలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీల నేతల్లో లేని అనేక అప్రజాస్వామిక, నియంతృత్వ దుర్లక్షణాలు కేసీఆర్‌లో ఉండడం వల్లే ఇవాళ అధికారం కోల్పోయిన ఏడాదిన్నరలోనే ఆయన మనుగడకోసం తండ్లాడవలసి వస్తోంది. ‘మనం వ్యవస్థలతో చెలగాటమాడితే అవి తర్వాత మనతో చెలగాటమాడతాయి..’ అని చంద్రబాబు ఒక సందర్భంలో అన్నారు. కేసీఆర్ విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. కేసీఆర్‌ తదుపరి అడుగులెలా ఉంటాయన్నదే భారత రాష్ట్ర సమితి మనుగడను నిర్ణయిస్తుంది.

-ఎ. కృష్ణారావు (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Sep 03 , 2025 | 05:55 AM