వాళ్ళు తమతో ఏం తీసుకుపోయారు
ABN, Publish Date - May 29 , 2025 | 01:24 AM
సమాధి ఫలకాలు రాయడం తేలిక. విషాదగీతాలనూ, మరణానంతర ప్రశంసలనో రాయడం కూడా తేలిక. చనిపోయిన వాళ్ళని శపించి, చరిత్రని ఖననం చేసేయడం ఇంకా తేలిక. నిజంగా అంత తేలికైన విషయమేనా అది?...
సమాధి ఫలకాలు రాయడం తేలిక. విషాదగీతాలనూ, మరణానంతర ప్రశంసలనో రాయడం కూడా తేలిక. చనిపోయిన వాళ్ళని శపించి, చరిత్రని ఖననం చేసేయడం ఇంకా తేలిక. నిజంగా అంత తేలికైన విషయమేనా అది?
ఐదు వందల ఏళ్ళ క్రితం జర్మనీలోని ఫ్రాంకెన్ హౌసెన్ వద్ద ఒక యుద్ధం జరిగింది. అక్కడ కొండమీద ఒక ఇంద్రధనుస్సు కనిపించిందని చెబుతారు. బైబిల్ ద్వారా దైవికమైన ఒడంబడికకి చిహ్నమైన ఇంద్రధనుస్సు తిరగబడిన రైతుల పతాకం కూడా. యుద్ధానికి సన్నద్ధమైన రైతులు ఇంద్రధనుస్సు దర్శనాన్ని తమ విజయానికి దైవిక సంకేతంగా భావించారు. కానీ వాళ్ళు ఓడిపోయారు. ప్రత్యర్థులైన ప్రభు వర్గం వాళ్ళని మోసం చేసింది. నిర్యుద్ధ సంధి చేసుకుని, సంధి కాలం ముగియకముందే రైతులపైన ప్రభువుల సైన్యం దాడి చేసింది. ఒకే ఒక్క రోజు మే 15, 1525న ఏడువేలమందికి పైగా రైతులని ఊచకోత కోశారు. ఫ్రాంకెన్ హౌసెన్ యుద్ధం జర్మనీలో రైతాంగ తిరుగుబాటులో ఒక కీలకమైన ఘట్టం. 1525 నాటి ఈ జర్మనీ రైతుయుద్ధాన్ని 1789 ఫ్రెంచి విప్లవానికి ముందు పశ్చిమ యూరప్‌లో అతిపెద్ద ప్రజా తిరుగుబాటుగా పరిగణిస్తారు. థామస్ మూంత్సర్ జర్మనీ రైతుల తిరుగుబాటుకు నాయకుడు. ఫ్రాంకెన్ హౌసెన్ యుద్ధంలో పట్టుబడిన థామస్ మూంత్సర్‌ని చిత్రహింసలకు గురిచేశారు. థామస్ మూంత్సర్‌తో పాటు మరొక నాయకుడు ఫైఫర్, ఇంకా ఇరవై నాలుగు మంది తిరుగుబాటుదారులని మే 27, 1525న ప్రభువులు చంపివేశారు. వాళ్ళ శరీరాల్ని ఖననం చేయకుండా, శిరచ్ఛేదం చేసిన తలలని బల్లేలకి గుచ్చి ప్రదర్శనకు ఉంచారు. థామస్ మూంత్సర్ తలని మూల్ హౌసెన్ దగ్గర కొండపైనా, ఫైఫర్ తలని బోల్ స్టెడ్ గ్రామానికి వెళ్ళే రహదారి కూడలి దగ్గరా ప్రదర్శనకు పెట్టారు. తమతో పాటు వాళ్ళు మోసుకుపోయిందేమిటి? అతి కొద్ది సంఖ్యలో ఆయుధాలని, వాటితో పాటు ఒక ఇంద్రధనుస్సు జెండాని. ఇది జరిగింది సరిగ్గా ఐదు వందల సంవత్సరాల క్రితం, ఇదే నెల, 1525 మే మాసంలో.
జర్మన్ విప్లవ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్, తాను హత్యకు గురవ్వడానికి ఒక్కరోజు ముందు, జనవరి 14, 1919న ఈ మాటలు రాసింది: ‘‘...ఈ ఓటమి నుంచి భవిష్యత్తు విజయాలు పుట్టుకొస్తాయి. ‘బెర్లిన్ నగరంలో శాంతి, భద్రతలు నెలకొన్నాయి’. తెలివిమాలిన తొత్తులారా! మీ శాంతి, భద్రతలు ఇసుక పునాదుల మీద కట్టిన మేడల లాంటివి. రేపు విప్లవం తిరిగి లేస్తుంది, ఆయుధాలతో తలపడుతుంది. మిమ్మల్ని భయకంపితం చేస్తూ, భేరీ ఘోషతో నినాదాన్ని వినిపిస్తుంది. నేను విప్లవాన్ని, నిన్న వున్నాను, ఈ రోజు నిలబడ్డాను, రేపు కూడా నిలిచే ఉంటాను.’’ రోజా లగ్జెంబర్గ్ తలపై రైఫిళ్ళతో తలపై మోది హింసించారు. కాల్చి చంపి, తన దేహాన్ని బెర్లిన్ నగరంలోని ఒక కాలువలో పడవేశారు. మరొక విప్లవ నాయకుడు కార్ల్ లీబ్‌నెఖ్ట్‌ని కూడా కాల్చి చంపి బెర్లిన్ జంతు ప్రదర్శనశాల కంచెల దగ్గర గుర్తు తెలియని శవంగా పడవేశారు. ఇంతకూ వాళ్ళు తమతోపాటు తీసుకుపోయినవేమిటి? రోజా లగ్జెంబర్గ్ ఖైదులో ఉన్న ఒకానొక సాయంత్రపు వేళ గురించి ఈ మాటలు రాసింది: ‘‘నీలి రంగులో మెరిసిపోతున్న ఆకాశంలో తెల్లటి మబ్బులు రెండు ఎంతో ఎత్తున తారాడుతున్నాయి. ...పక్షుల గుంపులు రోజూలాగే సాయంత్రం తమ గూళ్లకు చేరే ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. పట్టులా మెరిసే ఆ నీలి ఆకాశాన్ని మొనదేలిన తమ రెక్కలతో కొంచెం, కొంచెంగా కత్తిరిస్తూ, ముందుకూ, వెనక్కూ ఎగురుతూ, ఒకదానినొకటి దాటిపోతూ గోలగోలగా అరుస్తున్నాయి. అంతలోనే ఆకాశంలో కనిపించకుండా పైపైకి ఎగిరిపోతున్నాయి. నీటిబిందువులు జారిపడుతున్న ఆ పాత్రని చేతులలో పట్టుకుని, తల వెనక్కి తిప్పి చూస్తాను నేను. తడి, తడిగా మెరిసే ఆ నీలిమలోకి ఎగిరి దూకి ఈదులాడాలనీ, ఆ తుషార బిందువులలో కలిసి, కరిగిపోవాలనీ గాఢమైన కోరిక నన్ను కమ్ముకుంటుంది.’’ వాళ్ళు మేఘాలనీ, ఆకాశాన్నీ, బహుశా పక్షులనీ తమతో మోసుకుపోయారు.
స్పానిష్ నియంతృత్వ సైన్యం, ప్రఖ్యాత కవి ఫెడరికో గార్షియా లోర్కాని ఆగస్టు 19, 1936న నిర్బంధంలోకి తీసుకున్నది. గవర్నర్ వాల్డెస్, లోర్కాని ఏం చేయాలనే విషయంలో ఆదేశాలకోసం సైనిక అధికారులని అడిగాడు. ఫోన్ అందుకున్న సైనిక జనరల్ చుట్టూ ఆర్డర్లీ సిబ్బంది. మౌఖిక ఆదేశాలు ఇచ్చే ఆ గొంతులో అధికార గర్వంతో నిండిన నిశ్చితత్వం వినపడింది. ‘‘ఏం చేయాలని అడుగుతున్నావేమిటి? తనకి కాఫీ ఇవ్వు, సరిపోయేంత వరకూ చాలా చాలా కాఫీ ఇవ్వు.’’ సందేశాన్ని అందుకున్న అధికారులు, గొప్ప కవి లోర్కాని కాల్చి చంపేశారు. లోర్కా తనతో పాటు ఏం తీసుకువెళ్లాడు? వెళుతూ వెళుతూ తనతో పాటు ఒక కవితని తీసుకుపోయాడు: ‘‘వాళ్ళు నన్ను హత్య చేశారని అప్పుడు నాకు అర్ధం అయింది/ నా కోసం వాళ్ళు కాఫీ దుకాణాలలో, స్మశానాలలో, చర్చిలలో వెదికారు/ కానీ వాళ్ళకి నేను దొరకలేదు/ నేనెన్నడూ వాళ్ళ చేతికి చిక్కలేదు/ లేదు, వాళ్ళకి నేనెన్నడూ దొరకలేదు.’’
వాళ్ళు తమతో పాటు దేన్ని మోసుకుపోయారు? యుద్ధాన్ని, బహుశా బలహీనమైన గొంతుతో శాంతిని, క్రూరమైన యుద్ధంలో హననమై, ఖననమైన శాంతిని తమతోపాటు మోసుకుపోయారు. తీవ్రమైన వాద, వివాదాలనీ, భిన్నాభిప్రాయాలనీ, తాము పూర్తిచేయాలనుకుని పూర్తి చేసిన వాటినీ, చేయలేక అసంపూర్ణంగా మిగిలిన వాటినీ, చేయలేని వాటినీ తమతో పాటే తీసుకుపోయారు. తమ తప్పులనీ, పొరపాట్లనీ, సరిదిద్దుకునే ప్రయత్నాలనీ తీసుకుపోయారు. వాళ్ళు ప్రయాస పడుతూ విప్లవ భారాన్ని తమతోపాటు మోసుకు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఇక లేరు. ఓటమి కళ్ళు విప్పార్చుకుని వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ వుంది. భూమీ, భూమిలోని సంపదా మిగిలే ఉన్నాయి. యుద్ధం ఇంకా మనముందు నిలబడే ఉంది.
వాళ్ళు భూమినీ, ఆకాశాన్నీ తమతో తీసుకుపోయారు. భూమిలోపల, అడవులలోపల అపారమైన సంపదలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ సంపదలని బయటికి తీయాలి. దురదృష్టవశాత్తూ, భూమి మీదా, అడవుల లోపలా, కొండలపైనా మనుషులు ఉన్నారు. వాళ్ళు తమతో పాటు ఏం మోసుకుపోయారు? లేదూ, భూమి వాళ్ళని మోసిందా? ఇప్పుడు భూమి వాళ్ళని కప్పివేసింది. కవి టి.ఎస్ ఇలియట్ రాశాడు, ‘‘ఏప్రిల్ నెల అత్యంత క్రూరమైనది/ మృత భూమిలో లైలాక్ పూలు వికసిస్తున్నాయి/ జ్ఞాపకాలనీ, కోరికలనీ కలగలుపుతూ/ వసంత కాలపు వర్షం కృశించిపోయిన వేర్లకి ప్రాణం పోస్తూ’’. బహుశా, మే మాసం కూడా క్రూరమైనదేనేమో.
సుధాకిరణ్
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 03:09 PM