ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధారవాలు నదీబంధనాలు

ABN, Publish Date - Jun 10 , 2025 | 03:57 AM

మధ్యతరగతి ప్రజల్లో వారుణాస్త్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రాచీన సాహిత్యంతో పరిచయం లేకపోయినా పౌరాణిక సినిమాలు కొన్నైనా చూసి ఉంటే దాని మహిమ కొంతైనా అర్థం అవుతుంది. ప్రత్యర్థులను అన్నివైపుల నుంచి...

మధ్యతరగతి ప్రజల్లో వారుణాస్త్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రాచీన సాహిత్యంతో పరిచయం లేకపోయినా పౌరాణిక సినిమాలు కొన్నైనా చూసి ఉంటే దాని మహిమ కొంతైనా అర్థం అవుతుంది. ప్రత్యర్థులను అన్నివైపుల నుంచి నీటి ఉధృతిలో ముంచి ఆయుధాలు ప్రయోగించకుండా కట్టడిచేసి యుద్ధంలో పైచేయి సాధించటం వారుణాస్త్ర ప్రయోగ లక్ష్యంగా ఉండేది. కల్పిత కథల్లో ఊహాస్త్రంగా దాన్ని భావించినప్పటికీ, నీటిని ఆయుధంగా ఉపయోగించుకుని శత్రువును దెబ్బతీయటం అన్ని దేశాల చరిత్రల్లో కనపడుతుంది. కాలువలకు గండికొట్టటం, వంతెనలను కూల్చటం, చెరువులను విషతుల్యం చేయటం, డ్యాంల్లో నీటిని ఒక్కపెట్టున వదలటం యుద్ధాల్లో ఎన్నో సార్లు జరిగింది. యుద్ధనీతులు, ధర్మాల పాటింపు గురించి గొప్పగా చెప్పుకొన్నా ఆచరణలో వాటికి విరుద్ధంగా జరిగిన దారుణాలే ఎక్కువ. పహల్గాంలో తీవ్రవాదుల కిరాతం తర్వాత మళ్లీ నీటి యుద్ధాల ప్రస్తావనలు ఎక్కువయ్యాయి. ఆ దారుణానికి ప్రతీకార చర్యగా సింధూ జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పాకిస్థాన్‌ పాదాక్రాంతం అవ్వక తప్పదనే వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. సింధూ జలాలను కట్టడి చేస్తే పాకిస్థాన్‌ నవనాడులూ కుంగిపోతాయని ప్రభుత్వవర్గాల అంచనాలతో ఏకీభవించే వారందరూ ప్రకటనలతో హోరెత్తించారు.

సింధూ జలాల ఒప్పందాన్నీ అది కుదరటానికి జరిగిన 10 ఏళ్ల కసరత్తునీ లోతుగా పరిశీలించిన వారు.. దాన్నుంచి వైదొలగటం అంతతేలిక కాదనే విషయాన్ని పదేపదే చెబుతున్నా దాన్ని పట్టించుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఒప్పందం కుదిరి 65 ఏళ్లు అవుతున్నా భారత్‌ తనకు కేటాయించిన జలాలనే ఇంకా పూర్తిగా ఉపయోగించుకోలేదు. అనుకున్న విధంగా జలవిద్యుత్తు ప్రాజెక్టులనూ సకాలంలో కట్టలేకపోయింది. లభించిన నీటిని పూర్తిగా ఉపయోగించుకోటానికి ఇంకా పదేళ్లు పట్టొచ్చు. కనీవినీ ఎరగనంత వేగంతో ఇప్పుడు ప్రాజెక్టులను కట్టి నీటిని నిలువరించినంత మాత్రాన పాక్‌ నుంచి తీవ్రవాదం ముప్పు ఆగుతుందన్న భరోసా లేదు! మత భావజాలం ఆధారంగా తలెత్తే తీవ్రవాదాలు ప్రభుత్వాలను సైతం ఖాతరుచేయని పరిస్థితులే చాలా చోట్ల ఉన్నాయి. ఒకనాటి రష్యాని దెబ్బతీయటానికీ, కమ్యూనిస్టు భావజాలం విస్తరించకుండా ఉండటానికీ ఇస్లామిక్‌ తీవ్రవాదానికి అమెరికా అండదండలు అందించింది. గల్ఫ్‌, అరబ్బు దేశాల్లో రాచరిక, మత రాజ్యాలకు దశాబ్దాలపాటు చేదోడు వాదోడుగా నిలబడింది. ఇప్పటికీ నిలుస్తోంది. ఇస్లామిక్‌ తీవ్రవాద శక్తులు తనకు ముప్పుగా పరిణమించే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ‘వార్‌ ఆన్‌ టెర్రర్‌’ అంటూ యుద్ధాలు మొదలుపెట్టి వాటిని సైతం మధ్యలో వదలివేసింది. ఆఫ్గానిస్థాన్‌ను మళ్లీ తాలిబన్లకు అప్పగించటమే ఇందుకు నిదర్శనం. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష ఆశీస్సులు లేని నిరంకుశ, అప్రజాస్వామిక దేశాలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించొచ్చు.

తీవ్రవాద, మతతత్వ భావజాలాలను ఓడించటంలో హింస, అణచివేత, ఆయుధ ప్రయోగాల పాత్ర ఉన్నా వాటితోనే అవి సమసిపోయిన సంఘటనలు ఆధునిక చరిత్రలో కనపడవు. తీవ్రవాదం పట్ల ఆకర్షితంకాని రీతిలో ఆర్థిక ఫలాలనూ భద్రమైన జీవితాన్నీ ప్రజలకు అందించటమే అసలు పరిష్కారం అన్నది కాదనలేని సత్యం. తీవ్రవాద సంస్థలకూ బృందాలకూ నాయకత్వం వహించే వారు పైవర్గాల నుంచి వచ్చినా ఆయుధధారులై ముందుండే వాళ్లలో అట్టడుగువర్గాలే ఎక్కువ. ఆర్థికంగా ఫలాలు దక్కని అసంతృప్తులే తీవ్రవాదానికి అసలుసిసలైన పదాతిదళాలుగా వ్యవహరిస్తున్నారు. భారత ఉపఖండంలో నదీ వ్యవస్థలు చాలా సంక్లిష్టమైనవి. కోట్లమందిని ప్రభావితంచేసే ఆ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదాన్ని కట్టడి చేయాలనుకోవటం వ్యూహాత్మకంగా ప్రమాదాలూ సవాళ్లతో కూడుకున్నది. వాతావరణ మార్పులతో నదీ వ్యవస్థలు ఇప్పటికే అల్లకల్లోలం అవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న కొన్ని దశాబ్దాల్లో పంటల దిగుబడుల్లో 10 నుంచి 40 శాతం లోపు కోతలుపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను పర్యావరణ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. 2010 జులైలో పడిన భారీ వర్షాలతో సింధూనది పరివాహక ప్రాంతం కకావికలైంది. పాకిస్థాన్‌లో అయిదో వంతు భూభాగం వరద తాకిడికి గురైంది. రెండు కోట్ల మంది తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 140 లక్షల మంది ఇళ్లను పోగొట్టుకున్నారు. వేలమంది చనిపోయారు. ఆర్థిక వృద్ధిలో 2 శాతం కోతపడింది. నదుల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోకుండా డ్యాంలు కట్టుకుంటూ పోయి, వాటిని రాజకీయ కారణాలతో నియంత్రించటం మొదలుపెడితే 2010 నాటి తరహా బీభత్సాలను ఎదుర్కోవటం ఇంకా కష్టమవుతుంది. మానవ ధనదాహ కార్యకలాపాల ప్రమేయంతో హిమాలయ నదుల ప్రవాహా ప్రకోపం ఊహించని రీతిలో వ్యక్తమవుతోంది. పాక్‌తో పాటు భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఆ ప్రమాదం ఏదోరకంగా ఎదురవుతూనే ఉంది. గంగ, బ్రహ్మపుత్ర నదులకు తరచూ వస్తున్న వరదలే ఇందుకు నిదర్శనం. సముద్రమట్టాల పెరుగుదలకూ అదే ప్రధాన కారణం. సింధూ దాని ఉపనదుల కింద ఈనాటి వ్యవసాయానికి ఉన్న చరిత్ర కొంత విశిష్టమైంది.

బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటైన కాలువ కాలనీలతో అది మొదలైంది. ఈ కాలనీల కింద 60 లక్షల ఎకరాల పైచిలుకే సాగవుతోంది. 1885 నుంచి 1940 వరకూ తొమ్మిది కాలువ కాలనీలను సృష్టించారు. కాలువలు ప్రవహించే ప్రాంతాలకు తరలి వెళ్లటం ఉమ్మడి పంజాబు చరిత్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్రిటిషు పాలకులు అక్కడికి వలసలను విపరీతంగా ప్రోత్సహించారు. ముఖ్యంగా మాజీ సైనికులకు పెద్ద ఎత్తున భూములను పంపిణీ చేశారు. జాట్‌ సిక్కులు, ముస్లిం రాజ్‌పుత్‌లు మాజీ సైనికుల్లో ప్రధానంగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే నాటికి భారత్‌లోని మొత్తం సైన్యంలో 60 శాతం మంది ఉమ్మడి పంజాబు రాష్ట్రం నుంచే ఎంపికయ్యారు. వీరోచిత జాతులుగా కొన్ని కులాలనే బ్రిటిషు పాలకులు పరిగణించేవారు. సైన్యంలో చేర్చుకునేటప్పుడే ప్రతి వ్యక్తి కులాన్నీ, వారి వంశ వీరోచిత చరిత్రనూ విపులంగా నమోదు చేసేవారు. దేశ విభజన సందర్భంగా కాలువ భూములను వీడాల్సిన పరిస్థితి పంజాబులో లక్షల కుటుంబాల జీవితాలను తలకిందులను చేసింది. సైనిక నేపథ్యం ఉండి, ఆయుధ ప్రయోగ సామర్థ్యం ఉన్న ప్రజల మధ్య మత వైషమ్యాలు రాజుకోవటం.. లక్షలాది ప్రాణాలను కోల్పోయేలా చేశాయి. పంజాబు కాలువల కాలనీ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇప్పటికీ పాక్‌ సైన్యాన్ని శాసిస్తున్నారు. అక్కడి ఉన్నతోద్యోగులూ అధికంగా ఆ ప్రాంతం వారే. పాక్‌లో ‘పంజాబు సామ్రాజ్యవాదం’ రాజ్యమేలుతోందన్న భావం ఏర్పడటానికి ఈ ఆధిపత్యమే కారణం. బ్రిటిషు పాలకులు సృష్టించిన కృత్రిమ సరిహద్దుల పరిధుల్లో నదుల వ్యవస్థలను సక్రమంగా, పర్యావరణ హితంగా ఉపయోగించుకోవటం భారత ఉపఖండం ముందున్న పెద్ద సవాలుగా ప్రముఖ దక్షిణాసియా చరిత్రకారుడు ఇయన్‌ టాల్‌బట్‌ వ్యాఖ్యానించారు. ఆ సరిహద్దుల పరిధులు దాటే విధంగా దేశాలు ఆలోచనలు చేసి సరైన పర్యావరణ వ్యూహంతో ఆచరించకపోతే విపరిణామాలనే ఎదుర్కోవల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఉదాహరణకు బంగ్లాదేశ్‌ ఉపరితలంపై ప్రవహించే నీటిలో 90 శాతం టిబెట్‌, భారత్‌లో ఉన్న నదీవ్యవస్థల నుంచే వస్తుంది. అంటే బయటి దేశాల్లో కట్టే డ్యాంలు, రిజర్వాయర్లు, కాలువలు, అడవుల నిర్వహణ బంగ్లాదేశ్‌ నీటి లభ్యతను, వరదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సింధు, బ్రహ్మపుత్ర నదులు టిబెట్‌ భూభాగం నుంచే మొదలవుతాయి. నదుల ఆరంభ పరిసర ప్రాంతాలపై ఆధిపత్యం ఉన్న దేశాలు అనుసరించే విధానాలు ప్రవాహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. పాక్‌, బంగ్లాదేశ్‌లను భారత్‌ అలా ప్రభావితం చేస్తే భారత్‌ విషయంలో చైనా కూడా అదే దారితొక్కే అవకాశం ఉంటుంది. నదీ ప్రవాహాల సమస్య దక్షిణాసియా దేశాల సంబంధాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని 2016లో టాల్‌బట్‌ ఊహించినదే నిజమైతే నిరంతర ఉద్రిక్తతలతో ఆర్థిక వ్యవస్థలూ ప్రజలూ సతమవ్వక తప్పదు. ఇంకో ఆసక్తికరమైన విషయాన్నీ ఇక్కడ చెప్పుకోవచ్చు. భారత్‌–బంగ్లా సరిహద్దు 2500 మైళ్లు ఉంటే అందులో నాలుగోవంతు నదులే సరిహద్దులుగా ఉన్నాయి. వీటి ప్రవాహమార్గాలు మారిపోవటంతో రెండు దేశాల మధ్య ఎన్నో పేచీలు తలెత్తుతున్నాయి. నదుల ప్రవాహాలు మారటంతో ఏర్పడే ఇసుక దిబ్బల హక్కులు కూడా వివాదాలకు దారితీస్తున్నాయి. లక్షలమంది ఈ దిబ్బలపై ఆధారపడి మనుగడ సాగించటం అక్కడ సర్వసాధారణం. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సింధూజలాల ఒప్పందం నుంచి వైదొలగి నచ్చిన రీతిలో డ్యాంలు కట్టుకుని, విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవటం అనేది ఏటికి ఎదురీదటం లాంటిది. దానికి చెల్లించాల్సిన మూల్యమూ ఎక్కువగానే ఉండొచ్చు! ప్రపంచబ్యాంకు చొరవతో 1960లో భారత్‌–పాక్‌ మధ్య ఆ ఒప్పందం జరిగినా దానికి ముందు పదేళ్లపాటు చర్చలు సాగాయి. అమెరికా తెరవెనుక నుంచీ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది.

సింధూ, దాని ఉపనదుల జలాలపై పాక్‌లో 15 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో భారత్‌ కొత్త ప్రాజెక్టులు కడితే అమెరికా ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. గతంలో లాగా పాక్‌ అవసరం అమెరికాకు ఇప్పుడు లేదు. పావు శతాబ్దం నుంచి భారత్‌కు దగ్గర అవ్వటానికే అమెరికా ప్రయత్నిస్తోంది. మరోవైపున టిబెట్‌ నుంచి పెద్దఎత్తున నీటిని తరలించటానికి చైనా భారీ ప్రణాళికలే రచిస్తోంది. బ్రహ్మపుత్ర నుంచి హోయాంగ్‌ హో (యల్లో రివర్‌) నదిలోకి అనేక మార్గాల ద్వారా నీటిని మళ్లించి ఉత్తర చైనా నీటి, విద్యుత్తు సమస్యలను తీర్చనుంది. చైనా సగం జనాభా ఉత్తరభాగంలోనే ఉంది. బ్రహ్మపుత్రపై 60000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే మహా భారీ ప్రాజెక్టుకు కిందటి డిసెంబరులో అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే పాక్‌కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మారిన చైనా.. సింధూ జలాల ఒప్పందంపై మౌనంగా ఉంటుందనీ చెప్పలేం. భూటాన్‌, ఆఫ్గానిస్థాన్‌ మినహా భారత్‌ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లోనూ చైనా ప్రాబల్యాన్ని విపరీతంగా పెంచుకుంటోంది. ఒకరకంగా ఇది చైనా చక్రబంధం. దీని నుంచి చాకచక్యంగా బయటపడటమే ఇప్పుడు అత్యవసరం. యుద్ధారవాలతో దీన్ని తొలగించుకోలేం. ఉన్మత్త ప్రలాపాలు దౌత్యనీతికి ప్రత్యామ్నాయాలు కాలేవు!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 03:57 AM