Global War Impact: యుద్ధంతో సర్వనాశనం
ABN, Publish Date - Jun 20 , 2025 | 02:03 AM
ఏ చట్టాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేని ఒక విధ్వంసకర రూపం యుద్ధం. విచ్చలవిడిగా ఒకరినొకరు చంపుకోవడం, ఆస్తులను ధ్వంసం చేసుకోవడం, ఎవరు ఎక్కువ ఈ విధంగా చేస్తే, వారే గెలిచినట్లు సంబరపడతారు.
ఏ చట్టాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేని ఒక విధ్వంసకర రూపం యుద్ధం. విచ్చలవిడిగా ఒకరినొకరు చంపుకోవడం, ఆస్తులను ధ్వంసం చేసుకోవడం, ఎవరు ఎక్కువ ఈ విధంగా చేస్తే, వారే గెలిచినట్లు సంబరపడతారు. ఓడినవారే కాదు, గెలిచినవారు కూడా ఎన్నో ప్రాణాలు, సంపదను కోల్పోతారు. కానీ, అంతిమ గెలుపు తమదే అన్నట్టు సంబరాలు చేసుకుంటారు. వారు చేసిన విధ్వంసం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుత ఉక్రెయిన్ రాజధాని కీవ్, సోవియట్ యూనియన్‌లో ఉన్నప్పుడు, అద్భుతమైన కట్టడాలతో ప్రపంచ పర్యాటక కేంద్రం. యుద్ధం చేసిన ఏ దేశమైనా, యుద్ధానంతరం అభివృద్ధి పనులు, ఆలోచనలు కనుమరుగై, యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని సరిచేసుకోవడంలో ఉండిపోతాయి. అంటే... కొన్ని దశాబ్దాలపాటు నష్ట నివారణకే పరిమితమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆకలిచావులకు గురైనా ఆశ్చర్యం లేదు. మూడేళ్లకు పైగా జరుగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కొత్తగా మొదలైన ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతూ, ప్రపంచాన్ని భయపెడుతోంది. సంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లింది, దౌత్యపరమైన పద్ధతిలోనే దేశాల మధ్య వివాదాలు తీర్చుకునే కొత్త సంప్రదాయం మొదలైందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధాలు జరుగుతుండడం బాధాకరం. ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్నది అణు బాంబులు. ఇవి ప్రపంచంలో కేవలం 9 దేశాలలోనే ఉన్నా, వాటని వినియోగిస్తే, భూమండలాన్ని వందసార్లు పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. మరో భయం కలిగించే విషయం... ఉత్తర కొరియా, పాకిస్థాన్ వంటి ఉన్మాదుల వద్ద అణ్వాయుధాలు ఉండడం. ఇరాన్ వాటికి తోడు కాకుండా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య జరుగుతున్నది యుద్ధంలా కాకుండా, హమాస్ తీవ్రవాద సంస్థను నిర్మూలించడానికి చేస్తున్న దాడులుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోంది. భారత్–పాకిస్తాన్ మధ్య దాడులు మూడు రోజులకే ముగియడం సంతోషించదగ్గ విషయం. అవి కొనసాగితే ఇరుదేశాలూ ఎంతో కొంత నష్టపోయేవి. ఈ యుద్ధాలు త్వరగా ముగిసి, ప్రజలు సుఖంగా జీవించే రోజులు రావాలని ఆశిద్దాం.
– ✍️మాదివాడ రామబ్రహ్మం, జన విజ్ఞాన వేదిక
Updated Date - Jun 20 , 2025 | 02:12 AM