ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Misrepresenting the Movement: త‌ల‌ను వ‌దిలి తోక ద‌గ్గ‌ర విన్యాసం!

ABN, Publish Date - Oct 17 , 2025 | 01:49 AM

శీర్షిక‌తో అక్టోబరు 5న ఆంధ్ర‌జ్యోతిలో దుగ్గ‌రాజు శ్రీ‌నివాస‌రావు రాసిన వ్యాసంలో– 2024 జ‌న‌వ‌రిలో విజ‌య‌వాడలో జ‌రిగిన విప్ల‌వ ర‌చ‌యిత‌ల...

‘వారెక్క‌డ‌.. వీరెక్క‌డ‌?’ శీర్షిక‌తో అక్టోబరు 5న ఆంధ్ర‌జ్యోతిలో దుగ్గ‌రాజు శ్రీ‌నివాస‌రావు రాసిన వ్యాసంలో– 2024 జ‌న‌వ‌రిలో విజ‌య‌వాడలో జ‌రిగిన విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం 29వ మ‌హాస‌భ‌లు; తొలిత‌రం క‌మ్యూనిస్టు నాయ‌కుడు చండ్ర రాజేశ్వ‌ర‌రావులకు సంబంధించి ప్ర‌స్తావ‌నలు చేశారు. ఇంత‌కుమించి ఆయ‌న వ్యాసంలో ఎంత వెతికినా ప‌రిగ‌ణించ‌ద‌గ్గ మూడో అంశం క‌నిపించ‌లేదు. ఆరెస్సెస్‌తో పాటే వందేళ్ల క్రితం ప్ర‌యాణం మొద‌లుపెట్టిన క‌మ్యూనిస్టుల శిబిరంలో ఇప్పుడు నిరాశానిస్పృహ‌లు ఆవ‌రించాయ‌ని చెప్ప‌డం ఆయ‌న ఉద్దేశం.

క‌మ్యూనిస్టు రాజ‌కీయాలు, భావ‌జాల విఫ‌ల‌త గురించి చెబుతూ విర‌సం 29వ మ‌హాస‌భ‌ల ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఆ స‌భ‌ల్లో మా స‌భ్యుడు సంఘ్ భావ‌జాల వ్యాప్తి ప‌ట్ల ఒకింత దిగ్భ్రాంతిని, విప్ల‌వ భావ‌జాల స్థితి ప‌ట్ల కొంత నైరాశ్యాన్ని క‌న‌ప‌రిచిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే, ఇక్క‌డ దుగ్గ‌రాజు సంవాద మ‌ర్యాద‌ను పాటించ‌లేదు. ఒక‌రి వ్యాఖ్య‌ల‌ను విశ్లేష‌ణ‌కు స్వీక‌రించిన‌ప్పుడు ముందుగా ఆ వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా ఉటంకించాలి. అలా కాకుండా మా స‌భ్యుని మొత్తం ప్ర‌సంగంలో త‌న‌కు అనుకూలంగా ఉన్న కొద్ది భాగం తీసుకుని ఈక‌లు పీకే ప‌ని చేశారు. భిన్నాభిప్రాయాన్ని క‌మ్యూనిస్టులు స‌హించ‌బోర‌నేది దుగ్గ‌రాజు నిరూపించాల‌నుకున్న మ‌రో అంశం. ఇందుకు కూడా విర‌సం 29వ మ‌హాస‌భ‌ల‌నే ఆయ‌న ఎంచుకున్నారు. మా భావ‌జాలానికి భిన్నంగా న‌ర్మ‌ద అనే మ‌హిళ స‌భా వేదిక‌పై మాట్లాడ‌బోతే మేం మైక్ క‌ట్ చేశామ‌ట‌! అయితే, ఆ పేరు క‌లిగినవారు ఎవ‌రూ వేదిక మీద మాట్లాడ‌లేదు. మ‌రే మ‌హిళా కార్య‌క‌ర్త కూడా ఆయ‌న చెబుతున్న మాట‌లు వేదిక‌పై మాట్లాడ‌లేదు. అనారోగ్యంతో చ‌నిపోయిన మావోయిస్టు నాయ‌కురాలు, విప్ల‌వ ర‌చ‌యిత్రి న‌ర్మ‌ద పేరిట ఆ స‌భ‌ల్లో మేం పోడియం ఏర్పాటుచేశాం. దుగ్గ‌రాజు వ్యాసం చాలా భాగం ఇలాంటి గంద‌ర‌గోళాల‌తోనే నిండి ఉంది. ఒక భావ‌జాల సంస్థ భిన్నాభిప్రాయాల‌ను ఆహ్వానించ‌కుండా మ‌నుగ‌డ సాగించ‌లేదు. నిజానికి, ఆయ‌న ప్ర‌స్తావించిన రెండు రోజుల మ‌హాస‌భ‌ల్లో రాజ్యాంగ‌వాదంపై క్రిటిక‌ల్ అవ‌గాహ‌న‌ను మేం అందించాం. అదే స‌భ‌ల్లో మా అవ‌గాహ‌న‌తో విభేదిస్తూ, అనుకూలిస్తూ ప‌లువురు వేర్వేరు సెష‌న్ల‌లో స్పందించారు. అందులో కొంద‌రు మ‌హిళా కార్య‌క‌ర్త‌లు కూడా ఉన్నారు. వారిలో ఎవ‌రి మైక్‌ను కూడా మేం క‌ట్ చేయ‌లేదు. ఆయ‌న అన్న‌ట్టు రాజ్యాంగ‌బ‌ద్ధ పోరాటాల గురించి ఎవ‌రూ వేదిక‌పై మాట్లాడ‌లేదు అనేది అబ‌ద్ధం.

రాజ్యాంగబద్ధంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఆదివాసీలు మొదటిసారి విజయవాడ వచ్చి, వారి ప్రాంతాలలో జరుగుతున్న రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అతిక్రమణ, ఫారెస్ట్ యాక్ట్ అమలుకాకపోవడం గురించి మాట్లాడారు. రాజ్యాంగ‌వాద చ‌ర్చ‌లో భాగంగా వ‌చ్చిన అన్ని అభిప్రాయాల‌నూ మ‌హాస‌భ‌ల ప్ర‌త్యేక సంచిక‌లో య‌థాత‌థంగా ప్ర‌చురించాం. తొలిత‌రం క‌మ్యూనిస్టు నాయకులు ఎంద‌రో ఉన్నారు. అయినా, చండ్ర రాజేశ్వ‌ర‌రావు ప్ర‌స్తావ‌ననే దుగ్గ‌రాజు ఎందుకు తెచ్చారు? తిరోగ‌మ‌న‌ శ‌క్తుల‌ ఆధిక్య‌త‌ను రాజేశ్వ‌ర‌రావు అంగీక‌రించార‌ని చెప్ప‌డానికి ఆయ‌నవి అని చెబుతున్న వాక్యాల‌ను, ఆయ‌న కుమారుడి మాట‌ల‌ను మాత్ర‌మే ఎందుకు తీసుకున్నారు? ఇది అర్థం కావాలంటే తెలుగు స‌మాజంలో జ‌రిగిన ఫాసిస్టు వ్య‌తిరేక ఉద్య‌మాల చ‌రిత్ర కొంతైనా మ‌న‌కు తెలియాలి. అప్పుడే దుగ్గ‌రాజు ఉద్దేశం మ‌న‌కు తెలుస్తుంది. 1940ల్లో చండ్ర రాజేశ్వ‌ర‌రావు నాయ‌క‌త్వంలో క‌మ్యూనిస్టు కార్య‌క‌ర్త‌లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరెస్సెస్ విస్త‌ర‌ణ ప్ర‌య‌త్నాల‌ను నిలువ‌రించారు. బెజ‌వాడ వీధుల్లో సంఘ్ త‌ల‌పెట్టిన సాయుధ ప్ర‌ద‌ర్శన‌ను వీరోచితంగా ఎదుర్కొని భ‌గ్నం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఆరెస్సెస్ నిజస్వ‌రూపం అనే పుస్త‌కం కూడా రాశారు. అలాంటి రాజేశ్వ‌ర‌రావే క‌మ్యూనిస్టుల విఫ‌ల‌త‌ను, ఆరెస్సెస్ ఆధిక్య‌త‌ను గుర్తించార‌ని చెప్ప‌డానికి దుగ్గ‌రాజు త‌న వ్యాసంలో తెగ తాప‌త్రయ‌ప‌డిపోయారు. చండ్ర రాజేశ్వ‌ర‌రావుకు సంబంధించి ఆయ‌న కుమారుడు ఇచ్చిన‌ట్టు చెబుతున్న నోట్బుక్ మా దృష్టిలో లేదు. ఈ బుక్‌ను బ‌ట్టి చివ‌రి రోజుల్లో రాజేశ్వ‌ర‌రావు అవ‌గాహ‌న అలా ఉంద‌ని మాత్ర‌మే తెలుసుకోగ‌లం. ఎన్నేళ్లు గ‌డిచినా త‌న సైద్ధాంతిక‌, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని ఏమ‌రుపాటున కూడా విరుద్ధ భావ‌జాలశ‌క్తులు మ‌రిచిపోబోవ‌నేది మాత్రం రాజేశ్వ‌ర‌రావు సంద‌ర్భంలో సుస్ప‌ష్ట‌మైంది. ఆ క్ర‌మంలోనే విప్ల‌వ శిబిరంపైనా, ప్ర‌త్యేకించి విర‌సంపైనా కుతూహ‌లం కొద్దీ దాడికి దుగ్గ‌రాజు ప్ర‌య‌త్నించారు. అయితే, క‌నీసం త‌న వాద‌న‌ను కూడా చెప్పుకోలేక కిందా మీద అయి.. చివ‌ర‌కు గంద‌ర‌గోళంగానే త‌న వ్యాసం ముగించారు.

-అర‌స‌విల్లి కృష్ణ‌, అధ్య‌క్షుడు రివేరా, కార్య‌ద‌ర్శి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం

Updated Date - Oct 17 , 2025 | 01:49 AM