ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vinoba Bhave Legacy: భూదానోద్యమానికి వజ్రోత్సవం

ABN, Publish Date - Apr 18 , 2025 | 03:36 AM

ఆచార్య వినోబా భావే 1951లో 'భూదాన్' ఉద్యమం ప్రారంభించి, 50 లక్షల ఎకరాలు దానం చేశారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ భూములు అక్రమంగా మారిపోయాయి, చట్టం ప్రకారం ఇవి సర్వ సేవా సంఘ్‌కే చెందవలసినవి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత గాంధీజీ కన్న కలలను నెరవేర్చాలని ఎంతో తాపత్రయపడిన మొట్టమొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి విడిపించుకున్న భారతదేశాన్ని జన సామరస్య దేశంగా, సుసంపన్న, సుస్థిర దేశంగా చూడాలని ఆశించారు. సమాజంలో సామాన్య, సగటు ప్రజా జీవన అభ్యున్నతి కోసం, సామాజిక, ఆర్థిక తారతమ్యాల నిర్మూలన కోసం దేశవ్యాప్త సర్వోదయ వికాసానికి ‘స్వచ్ఛంద భూసేకరణ’, ‘చట్టబద్ధమైన భూవితరణ’ జరగాలని, దానికి మళ్లీ భారతదేశంలో ప్రజలందరినీ కదిలించే ఒక సామరస్య పోరాటం చేయాలని భావే నిర్ణయించుకున్నారు. దేశమంతా పాదయాత్ర చేసి, ‘స్వచ్ఛంద భూదాన్’ ఉద్యమానికి నాంది పలికారు. ఈ ఉద్యమ స్ఫూర్తికి ఈ ఏడాది ఏప్రిల్ 18 నాటికి 74 ఏళ్ళు నిండి, 75వ (వజ్రోత్సవ) సంవత్సరం ఆరంభమైంది. పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చేరుకున్న వినోబా భావే అక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకుని, స్థానిక భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డిని కలిసి మాట్లాడారు.వినోబా భావే భావోద్వేగమైన ప్రసంగానికి మంత్రముగ్ధుడైన జమీందార్‌ రామచంద్రారెడ్డి, తక్షణమే స్పందించి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించి, 1951, ఏప్రిల్ 18న దానపత్రాన్ని భావేకు అందించారు. ఇది దేశంలోనే తొట్ట తొలి స్వచ్ఛంద భూదానం.


అందుకే ఈ రోజును భారతదేశ సామాన్య ప్రజలంతా ‘భూదాన్ డే’గా జరుపుకుంటున్నారు. 1951 నుంచి 1957 వరకూ విడతలు విడతలుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను తన పాదయాత్ర ద్వారా వినోబా భావే సందర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఎకరాల భూమిని దానంగా స్వీకరించి, సామాన్యుడి సర్వోదయానికి బలమైన పునాది వేశారు. ఈ భూదాన్ ఉద్యమం ప్రపంచ దేశాలను ఎంతగానో ప్రభావితం చేసింది. దేశ వ్యాప్తంగా తాను దానంగా స్వీకరించిన భూమిని తానే స్వయంగా ప్రజలకు పంచేస్తే, దానిని ప్రజలు తాను చేసిన సహాయంగానే చూస్తారని, దానికి చట్టబద్ధత ఉండదని, వారు భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి భావే తెలిపారు. అందుకే ఆ భూమిని నిరుపేదలకు పంచడానికి ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించి, తాను భూదానంగా స్వీకరించిన భూములను ఆ చట్ట పరిధిలోకి తీసుకువచ్చి, ప్రభుత్వ ప్రమేయంతో తానే స్వయంగా ప్రజలందరికీ చట్టబద్ధంగా ఆ భూములను పంచేందుకు సహకరించాలని నెహ్రూని కోరారు. 1965లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో దీనిని భారతదేశ సమగ్ర చట్టంగా ఆమోదించారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను మాత్రం ఆయా రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1965, మే 10 నుంచి ఈ ‘భూదాన్–గ్రామదాన్’ చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో సూచించిన ప్రకారంగా ఆయా రాష్ట్రాలలో వినోబా భావే సూచించిన వారికి అధికారాన్ని ప్రకటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 11 మంది సభ్యులతో కూడిన ‘భూదాన్ యజ్ఞ బోర్డు’ను నిర్మాణం చేయాలి. ఆ బోర్డుని ఆ రాష్ట్ర ‘భూదాన్ యజ్ఞ బోర్డు’గా గుర్తిస్తూ, నాలుగేళ్ళ పాటు కాలపరిమితి కలిగిన అధికారాలను కలిగివుండేలా అధికారికంగా గెజిట్ ద్వారా ప్రభుత్వాలు ప్రకటించాలి. సభ్యుల ఎంపికలో ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదు.


వినోబా భావేకు గాని, ఆయన ధృవీకరించిన గాంధేయవాద సంస్థ ‘సర్వ సేవా సంఘ్‌’కు గాని భూదాన్ భూములన్నీ పేద ప్రజలకు పంపిణీ జరిగే వరకూ ఈ చట్టం యథావిధిగా అమలులో ఉండాలి. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాటు అనేక రాష్ట్రాలలో 1969లో మొదటగా ‘భూదాన్ యజ్ఞ బోర్డు’లు ఏర్పడి, పని ప్రారంభించాయి. భూములను దానం పొందిన గ్రహీతలు సక్రమంగా వాటిని వినియోగించుకుంటున్నారా? లేదా? అనే సమీక్ష కూడా తరచూ జరుపుతూ, తదనుగుణ చర్యలు కూడా తీసుకోవాలి. ఇదీ, ఆయా ‘భూదాన్ యజ్ఞ బోర్డు’ సభ్యులు పారదర్శకంగా చేయవలసిన పని. అయితే 1982, నవంబరు 15న ఆచార్య వినోబా భావే హఠాన్మరణం తరువాత ‘భూదాన్–గ్రామదాన్’ చట్టం అమలు విధానాలు అనేక రాష్ట్రాలలో మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం దురదృష్టకరం. మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ‘భూదాన్–గ్రామదాన్’ చట్టం ఎంతో పటిష్ఠంగా అమలు జరుగుతోంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టాన్ని కొన్ని పరిస్థితులు మరుగున పడేశాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చట్టానికి ఎన్నో తూట్లు పడ్డాయన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వినోబా భావే తన మరణానికి ముందు ఒక వీలునామా రాశారు.


దాని ద్వారా తన మరణానంతరం భూదాన్ భూములపైనా, భూదాన్ యజ్ఞ బోర్డు నియామకంపైనా సర్వాధికారాలు ‘సర్వ సేవా సంఘ్’ అనగా వార్ధాలోని ‘అఖిల భారత సర్వోదయ మండల్‌’కు చెందుతాయని నిర్ధారించారు. ఈ వీలునామాను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, పాటిస్తున్నాయి. కానీ ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సర్వ సేవా సంఘ్‌కు సంబంధం లేకుండా దొడ్డిదారిన 1988, 2012లలో అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వాల సొంత నిర్ణయాలతో భూదాన్ యజ్ఞ బోర్డులను నియమించాయి. సర్వ సేవా సంఘ్ న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని పొందే లోపు ఆయా బోర్డుల కాలపరిమితి ముగిసిపోయింది. ఈ బోర్డుల పదవీ కాలాలలోనే అనేక వేల ఎకరాలు అక్రమంగా చేతులు మారాయి. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు భూదాన్ భూములు– సుమారు 80 వేల ఎకరాల ఆంధ్రప్రదేశ్‌లోనూ, సుమారు 1 లక్షా 30 వేల ఎకరాలు తెలంగాణలోనూ ఉన్నట్లు లెక్కలు చూపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటివరకూ భూదాన్ యజ్ఞ బోర్డుల నిర్మాణం జరగలేదు. అయితే 2023లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వ సేవా సంఘ్ సిఫారసు లేకుండా తమ పార్టీకి చెందిన ఒక వ్యక్తిని భూదాన్ యజ్ఞ బోర్డుకు ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రత్యేక గెజిట్‌ను తీసుకొచ్చింది. దీనిని సవాలు చేస్తూ సర్వ సేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం ఆ గెజిట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాది ఎకరాల భూదాన్ భూములు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకుని ఉన్నాయి. ఈ భూములు చట్ట ప్రకారం ఎవ్వరికీ బదలాయించబడవని తెలిసినా, ఆ భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు వాటిని దక్కించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందరూ గ్రహించాల్సిన విషయమేమిటంటే భూదాన్ భూములు గెజిట్‌ ప్రకారం ఎప్పటికైనా సర్వ సేవా సంఘ్‌కు చెందవలసినవే గాని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ బదలాయించబడవు. సర్వ సేవా సంఘ్... భూదాన్ యజ్ఞ బోర్డు ద్వారా చట్ట ప్రకారంగా స్వచ్ఛందంగా ఎవరికైనా వితరణ చేయాలి లేదా వితరణకు సమ్మతించాలి. ఒక మహోన్నత ఆశయంతో, దృఢ సంకల్పంతో ఆచార్య వినోబా భావే యజ్ఞంగా భావించి కొనసాగించిన ‘భూదాన్’ ఉద్యమ స్ఫూర్తిని పరిరక్షించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

నీలం రాంబాబు నాయుడు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్

Updated Date - Apr 18 , 2025 | 03:38 AM