ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hate Over Healing: విద్వేషాలకు ఆజ్యం

ABN, Publish Date - Aug 23 , 2025 | 05:02 AM

ఉత్తరాఖండ్‌ వరదలతో వొణికిపోతోంది. మరింత కుంభవృష్టికి సిద్ధంకమ్మంటూ వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంది...

త్తరాఖండ్‌ వరదలతో వొణికిపోతోంది. మరింత కుంభవృష్టికి సిద్ధంకమ్మంటూ వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో 150కు పైగా దారులు మూసుకుపోయాయనీ, ఆఖరుకు చార్‌ధామ్‌ యాత్రకు కూడా ఆటంకం కలిగిందనీ వింటున్నాం. ఈ నెలారంభంలో క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి, ధరాలీ సహా కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు మన కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. వందమందికి పైగా స్థానికులూ పర్యాటకులూ ఆ భయానకమైన బురదలో ప్రాణాలు వదిలేశారు. 2013 కేదార్‌నాథ్‌ వరదలు రాష్ట్రానికి భారీ ఆస్తి నష్టాన్నీ, మౌలిక సదుపాయాల విధ్వంసాన్ని కలిగించినస్థాయిలో రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు దెబ్బతిన్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రకృతి ఆగ్రహానికి అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడం, రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టడం ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ప్రధమ కర్తవ్యం కావాలి. ఈనెల 19న ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలను ఆందుకు వినియోగించాల్సిన ముఖ్యమంత్రి, మైనారిటీలపై దాడికీ, మతరాజకీయాలకు దానిని వాడుకున్నారు. మదర్సాల నియంత్రణ, మతమార్పిడి నిరోధం సహా మొత్తం తొమ్మిది బిల్లులు బుధవారం సభలో నెగ్గాయి.

రాష్ట్రాన్ని రక్షించగల ప్రణాళికలను సిద్ధంచేయాల్సిన ముఖ్యమంత్రి విద్వేషవ్యూహాలమీద శ్రద్ధపెడుతున్నారు. రాష్ట్రంలో రమారమి 14శాతం ముస్లిం జనాభా ఉంది. ఇప్పటికే, మదర్సా బోర్డును రద్దుచేసి, వివిధ ఆరోపణలతో మదర్సాలను మూసివేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తచట్టంతో మరిన్ని ఆంక్షలు ప్రయోగించింది. అత్యంత స్వల్పసంఖ్యలో ఉన్న సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు మైనారిటీ విద్యాసంస్థల లబ్ధిని విస్తరింపచేస్తూ, రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషన్‌ విభాగానికి సర్వాధికారాలనూ ప్రభుత్వం దఖలుపరిచింది. మదర్సాలో చదువులను నిర్ణయించి, నియంత్రించడంతో పాటు, నిర్వహణలో అక్రమాలు, పారదర్శకత లేకపోవడం, సామాజిక అశాంతి, మతవిద్వేషం ఇత్యాది ఆరోపణలతో ఏ చిన్న కారణంతోనైనా మైనారిటీ హోదాను రద్దుచేయగల, ఆస్తిని స్వాధీనపరచుకోగల అధికారాన్ని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. ఈ చట్టం ద్వారా మదర్సాలను స్వల్పసంఖ్యలో అనుమతించి, మిగతావన్నీ మూసివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దేశం మొత్తంమీద ఇంతటి ప్రగతిశీలచట్టం ఎక్కడాలేదని ముఖ్యమంత్రి చెబుతూంటే, లవ్‌జిహాద్‌, లాండ్‌ జిహాద్‌లు ఎదుర్కొంటున్న తమమీద ఇదో కొత్త జిహాద్‌ అని ముస్లింలు అంటున్నారు. ఇక, మతమార్పిడి నిరోధక చట్టం కూడా మరిన్ని కఠినమైన సవరణలతో మరింత బలపడింది. ‘బలవంతం’గా మతం మార్చినవారికి యావజ్జీవం తప్పదు. బూటకపు ప్రేమలు, పెళ్ళి హామీలకు పదేళ్ళశిక్షలు, లక్షల్లో జరిమానాలు పడతాయి. ఒక బహుమతి, మంచిజీవితం, విద్య, వైద్యం, ఉద్యోగం, దైవానుగ్రహం ఇత్యాది హామీలన్నీ తీవ్ర శిక్షలకు దారితీస్తాయి. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీల మతమార్పిడుల విషయంలో మరింత కఠినమైన నియంత్రణలు, నిబంధనలు ఉన్నాయి. డిజిటల్‌, ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియాల్లో ఒక మతాన్ని దూషించి, మరో మతాన్ని కీర్తించినా, ప్రచారం చేసినా మతమార్పిడికి సాయపడినట్టే. నిందితులను వారెంట్‌ లేకుండా అరెస్టుచేయవచ్చు, సదరు వ్యక్తుల, సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు, 20ఏళ్ళ వరకూ శిక్షలు పడవచ్చు. పొరుగునే ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌సహా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ఇంతటి కఠినమైన మతమార్పిడి వ్యతిరేక చట్టం లేదని నిపుణులు అంటున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించడం లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ పేరిట ముస్లింలను మరింత వేధించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. దేశంలో ఉమ్మడిపౌరస్మృతి అమలుచేసిన తొలిరాష్ట్రం ఉత్తరాఖండ్‌. ఈ ఏడాది జనవరిలో అది అమలులోకి వచ్చింది. గిరిజనతెగలకు మినహా మిగతావారందరికీ ఇది సమానంగా వర్తిస్తూ, వివాహం, విడాకులు, వారసత్వం సహా సమస్త అంశాలనూ నిర్దేశిస్తోంది. సహజీవనాన్ని నియంత్రించే నిబంధనలమీద విమర్శలు, కేసులు ఉన్నప్పటికీ, ధామీ ప్రభుత్వం వెనుకంజవేయకుండా, ఇప్పుడు మరిన్ని సవరణలతో దానిని మరింత కఠినతరం చేసింది. బంధాన్ని విధిగా బహిరంగపరచాల్సిన నిబంధనలకు తోడుగా, అనధికార, అక్రమ బంధాలకు శిక్షలు తీవ్రమైనాయి. వివాహితులు సహజీవనంలోకి ప్రవేశించినా, బలవంతంగా లేదా మోసపూరితంగా ఈ బంధంలో ఉన్నా ఏడేళ్ళ జైలు తప్పదు. ఈ బిల్లులు, వాటికి చేసిన సవరణలు సామాజిక శాంతిని కాక, విద్వేషాలను పెంచి, కొత్త సమస్యలను సృష్టిస్తాయన్నది సుస్పష్టం.

Updated Date - Aug 23 , 2025 | 05:02 AM