ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Trade War: గెలుపోటములు

ABN, Publish Date - May 31 , 2025 | 12:39 AM

అత్యవసర ఆర్థిక చట్టం ఆధారంగా ట్రంప్ చేపట్టిన వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ట్రేడ్ కోర్టు కొట్టివేసింది. అధ్యక్ష అధికారం పరిధిని మించకూడదని తేల్చి చెప్పింది.

తాత్కాలికమే కావచ్చును కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సత్వర ఉపశమనం దక్కింది. నీకేమీ విశేషాధికారాలు లేవు విదేశీవాణిజ్యంతో చిత్తంవచ్చినట్టు ఆడుకోవడానికి అంటూ అమెరికా వాణిజ్య న్యాయస్థానం ట్రంప్‌ దూకుడుకు అడ్డుకట్టవేసిన మరునాడే అప్పీల్‌ కోర్టులో ఆయనకు ఉపశమనం లభించింది. జిమ్మీకార్టర్‌ కాలంలో తయారైన, అనంతరం ఏ అమెరికా అధ్యక్షుడూ వినియోగించని ఓ ఆర్థిక అత్యయిక చట్టాన్ని ఆయుధంగా వాడి, ఏకంగా 180దేశాలతో సుంకాల యుద్ధం చేసిన, చేస్తున్న అమెరికా అధ్యక్షుడికి తన అధికారాల పరిమితులేమిటో తెలియదని అనుకోలేం. న్యాయకోవిదులు, వాణిజ్య నిపుణులు ఆయనకు మంచిచెడ్డలు చెప్పి, దేశానికి కీడు చేస్తున్నావని హెచ్చరించేవుంటారు. కానీ, అమెరికాను దోచుకుంటున్న మిగతా ప్రపంచం మెడలు వంచిన యోధుడుగా, రక్షకుడుగా తన ప్రజలకు కనిపించడం ప్రధానం కనుక, ఆయన ఎంతవరకైనా పోతాడు. రాజ్యాంగంతో సహా సమస్తవ్యవస్థలనూ కాదంటాడు. అధ్యక్షుడుగా ఎన్నికల్లో ఓడినాకూడా ప్రజాతీర్పును తప్పుబట్టి, తన అభిమానులను చట్టసభలమీదకు ఉసిగొల్పిన ఉదంతం అంతసులభంగా మరిచిపోయేది కాదు. మిగతా ప్రపంచంతో పోరాడుతున్నానంటున్న తమ అధ్యక్షుడిమీద అమెరికాలోని చిన్నాచితకా వాణిజ్య సంస్థలు, వేదికలు, వ్యక్తులు, రాష్ట్రాలు న్యాయపోరాటానికి నడుంబిగించాయి కనుక, ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేది కాదు. అప్పీల్‌ కోర్టు ఆదేశాలు ట్రంప్‌కు ఉపశమనం ఇస్తే, ట్రేడ్‌కోర్టు తీర్పు మిగతా ప్రపంచానికి ఉత్సాహాన్నిచ్చింది. ట్రేడ్‌కోర్టు తీర్పులో ట్రంప్‌కు కుట్రలూ, రాజకీయాలు, తనపట్ల ద్వేషం కనిపించాయి. కానీ, వైట్‌హౌస్‌ అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చిన ఆ చట్టం అధ్యక్షుడికి అమెరికన్‌ కాంగ్రెస్‌ను అతిక్రమించి వాణిజ్యనిర్ణయాలు తీసుకొనే విశేషాధికారాలనేమీ ఇవ్వలేదని ట్రేడ్‌కోర్టు తేల్చింది. ‘లిబరేషన్‌ డే’ పేరిట ఆయన అక్షరక్రమంలో ఒక్కోదేశం పేరూ చదువుతూ వాటిమీద విధించిన సుంకాలశాతాన్ని ఏప్రిల్‌ 2న ప్రకటించిన ఆ దృశ్యం ఎన్నటికీ మరిచిపోగలిగేది కాదు.


చైనా, కెనడా, మెగ్జికో వంటి దేశాలను మాదకద్రవ్యాల అక్రమ రవాణాపేరిట మరింత శిక్షించడమే కాక, చివరకు మనుషులు లేని ద్వీపాలను కూడా ఆయన వదల్లేదు. ఈ క్రమంలో ప్రపంచవాణిజ్యాన్ని, గొలుసుకట్టు వ్యవస్థలను తుత్తునియలు చేశాడు. ప్రపంచమార్కెట్లన్నీ తలకిందులై లక్షలాదికోట్లు హరించుకుపోయేందుకు కారణమైనాడు. ఈ సుంకాలు, ప్రతీకార సుంకాల యుద్ధం సాగుతూండగానే, తన దెబ్బకు మిగతా ప్రపంచమంతా లొంగివచ్చిందని, దేశాలన్నీ ఒప్పందాలకు దిగివస్తున్నాయని ఆయన చెప్పాడు. కానీ, ట్రంప్‌ నిర్ణయాల పర్యవసానాలను తాము ఎదుర్కోవాల్సివస్తున్నదని, తమకు అవి భారంగా పరిణమించాయని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. సరఫరాలు నిలిచిపోయి ఆర్థికంగా అపారనష్టం కలుగుతోందని, ఉత్పత్తులు అందక వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని అంటున్నాయి. బడుగులను కొట్టి బిలీనియర్లకు దోచిపెట్టేందుకే ట్రంప్‌ ఈ ఎత్తుగడ వేశారని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, వాణిజ్యానికి సంబంధించి ట్రంప్‌కు చిత్తంవచ్చిన నిర్ణయాలు తీసుకొనే అధికారం లేదని, అమెరికన్‌ కాంగ్రెస్‌ను దాటిపోవడం శుద్ధతప్పని ట్రేడ్‌కోర్టు చెప్పడం బాగుంది. అమెరికా యాభైయేళ్ళుగా వాణిజ్యలోటు ఎదుర్కొంటున్నదనీ, విశేషాధికారాలు ప్రయోగించాల్సినంత అత్యవసర స్థితి ఏమీ లేదనడం మరీ బాగుంది. మిగతా ప్రపంచంతో వాణిజ్యయుద్ధాన్ని ఆరంభించి, ఉద్రిక్తతలు పెంచిన ట్రంప్‌ ప్రభుత్వం న్యాయస్థానంలో మాత్రం తాను వాణిజ్యాన్ని వాడి యుద్ధాలు ఆపుతున్నానని, సుంకాలను సంధించి శాంతిని సాధిస్తున్నానని విచిత్రమైన వాదనలు చేసింది. భారత్‌–పాక్‌ ఘర్షణలను కూడా అందుకు నిస్సిగ్గుగా వాడుకుంది. దేశ అత్యయిక స్థితిని ఎలా ఎదుర్కోవాలో ఎన్నికకాని న్యాయమూర్తులకు ఏమి తెలుసంటూ ట్రంప్‌ బృందం అహంకారంతో వ్యాఖ్యానిస్తోంది. లేని అధికారాలను దఖలుపరచుకొని, అమెరికా ఆర్థిక, వాణిజ్య భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన నిర్ణయాలను వీసమెత్తు చర్చలేకుండా ఓవల్‌ ఆఫీసులో కూర్చుని ఏకపక్షంగా తీసుకుంటున్న ట్రంప్‌కు ఏ అనుభవం ఉన్నదో మరి. ఇప్పటివరకూ నోరుమెదపని అమెరికన్‌ కాంగ్రెస్‌ ఇప్పటికైనా చొరవచూపి తన ఉనికిని కాపాడుకుంటే బాగుంటుంది.

Updated Date - May 31 , 2025 | 12:41 AM