ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Israel-Iran War: యుద్ధపిపాసి

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:16 AM

ప్రపంచం తనను శాంతిదూతగా గుర్తించడం లేదని, భారత్‌–పాకిస్థాన్‌ మధ్య సయోధ్య కుదిర్చినా పిలిచి నోబెల్‌ ఇవ్వడం లేదని తెగవాపోతున్న అమెరికా అధ్యక్షుడు నేరుగా యుద్ధరంగంలోకి ప్రవేశించారు. పదిరోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంలో...

ప్రపంచం తనను శాంతిదూతగా గుర్తించడం లేదని, భారత్‌–పాకిస్థాన్‌ మధ్య సయోధ్య కుదిర్చినా పిలిచి నోబెల్‌ ఇవ్వడం లేదని తెగవాపోతున్న అమెరికా అధ్యక్షుడు నేరుగా యుద్ధరంగంలోకి ప్రవేశించారు. పదిరోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంలో, పరోక్షంగా అన్నీతానై ఇజ్రాయెల్‌తో కథనడిపిస్తున్న అమెరికా, ప్రత్యక్షంగా దిగాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఓ రెండువారాల్లో తీసుకుంటానని చెప్పిన ట్రంప్‌, రెండురోజుల్లోనే ఆ ముసుగుతీసేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనను తాను యుద్ధవ్యతిరేకిగా ప్రచారం చేసుకున్న ట్రంప్‌, అమెరికా నిరంతరయుద్ధాల్లో మునిగితేలుతున్నదంటూ తనముందువారిని తీవ్రంగా తప్పుబట్టాడు. తాను అధికారంలోకి రాగానే అన్ని యుద్ధాలనీ ఆపేసి ప్రపంచానికి శాంతినిస్తానన్నాడు. ఆర్నెల్లకాలంలోనే ఆయన తన అసలు అవతారాన్ని ప్రపంచానికి ప్రదర్శించాడు. ఆదివారం తెల్లవారుజామున ఏడు బి2 స్పిరిట్‌ బాంబర్లు ఇరాన్‌లోకి ప్రవేశించి, మూడు అణుస్థావరాలమీద బంకర్‌ బస్టర్‌ బాంబులు కురిపించాయి. ఇజ్రాయెల్‌కు చేతగానిపనిని తాను స్వయంగా మారణాయుధాలు చేబూని ట్రంప్‌ పూర్తిచేశారు. ఫర్దో, నతాంజ్‌ పాటు, శుద్ధిచేసిన యురేనియంను భారీ ఎత్తున నిల్వచేసిన ఇసఫహాన్‌ అణుకేంద్రాన్ని నాశనం చేయడానికి అదనంగా సబ్‌మెరైన్లనుంచి ప్రయోగించిన టామాహాక్‌ క్రూయిజ్‌మిసైళ్ళను ఉపయోగించారని వార్తలు వచ్చాయి. బీటూ బాంబర్లు, వందలాది యుద్ధవిమానాలు, సబ్‌మెరైన్లతో సహా సర్వశక్తులనూ వాడి అమెరికా జరిపిన ఈ దాడిలో ట్రంప్‌ పరిభాషలో చెప్పాలంటే, ఇరాన్‌ అణుస్థావరాలు దుంపనాశనమైపోయాయి. పూర్తిగా, సమూలంగా వాటిని తుడిచిపెట్టేసినట్టు ఆయన ఘనంగా ప్రకటించాడు.

అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటీ)లో భాగస్వామి కాకుండా, భారీగా అణ్వాయుధాలు పోగేసుకున్న ఇజ్రాయెల్‌, ఆ ఒప్పందంమీద సంతకం చేసిన ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలుపోగుబడివున్నాయన్న ఆరోపణతో, ఇరాన్‌ను నిరాయుధం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించి జూన్‌ 13న ఈ యుద్ధంలోకి దిగింది. కదనరంగంలోకి అమెరికా ప్రత్యక్షప్రవేశంతో ఆ మూడు అణుకేంద్రాలను నాశనం చేయడమనే లక్ష్యం పరిపూర్ణమైంది కనుక నిజానికి వెంటనే యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం ఇక కంటినిండా నిద్రపోవచ్చునని ప్రకటించి మిత్రులిద్దరూ యుద్ధరంగం నుంచి తప్పుకోవాలి మరి. కానీ, అది సమీపకాలంలో జరగకపోగా, అమెరికా రాకతో ఈ యుద్ధం అన్ని హద్దులూ దాటి, ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. అణుస్థావరాల నాశనంతో ఇరాన్‌ కాళ్ళబేరానికి వస్తుందని ట్రంప్‌ నమ్ముతున్నారు. శాంతిచర్చలకు, ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఇక ప్రతీకారమే మిగిలిందని ప్రకటించిన ఇరాన్‌ ఆ పని ఎప్పుడు చేస్తుందో తెలియదు. అంతశక్తి దానికి ఉన్నదా, నిజంగానే ఆ పనిచేస్తుందా అన్నకంటే, ఇరాన్‌కు అత్యంత సమీపంలోనే అది గట్టిగాదెబ్బతీయగల దూరంలోనే అమెరికా స్థావరాలు అనేకం ఉన్నమాటైతే నిజం. ఏలికలను మార్చే లక్ష్యం తమకు లేదని ప్రకటించిన కొద్దిగంటల్లోనే అమెరికా వెనక్కుతగ్గి, మళ్ళీ ఇజ్రాయెల్‌ భాషలోనే మాట్లాడుతోంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏలుతున్న ఖమేనీలను కూల్చడం సులభం కాదని, అధికారంకోసం ఊచకోతలు కోస్తున్నవీరు అంతసులభంగా దానిని వదులుకోరని, తలకాయలెన్ని కూలినా, ఆ వారసత్వాన్ని తుంచడం కష్టమని అమెరికా–ఇజ్రాయెల్‌ గుర్తించాలి. నిజానికి, ఈ రెండుదేశాల కారణంగానే, ఖమేనీలు ఇరాన్ను చిరకాలంగా ఏలుకోగలుగుతున్నారు. పదిరోజుల ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధప్రభావమే అధికంగా ఉంటున్న తరుణంలో, అమెరికా చొచ్చుకొచ్చి ప్రపంచాన్ని అష్టకష్టాల్లోకి నెట్టేస్తోంది. హోర్ముజ్‌ జలసంధి మూతబడే ప్రమాదానికి స్టాక్‌మార్కెట్లు తలకిందులవుతున్నాయి, చమురుధరలు ఎగబాకుతున్నాయి. ఇరాన్‌కు మాటసాయం చేస్తున్న దేశాలు ఆయుధాలతో ఎంత ఆదుకుంటాయో, స్వయంగా కదనరంగంలోకి దిగుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ, యుద్ధకాలం పెరుగుతున్నకొద్దీ, దాని విస్తరణ ప్రమాదం సహజంగానే అధికమవుతుంది. ఇరాన్‌మీద దాడులు ఆగినపక్షంలోనే, అది చర్చలకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచానికి ఇంధనాన్ని సమకూర్చే ఈ కీలకమైన ప్రాంతం యుద్ధజ్వాలల్లో కొనసాగడం సరికాదు.

Updated Date - Jun 24 , 2025 | 03:20 AM