India US relations: అమృత కాలానికి అమెరికా అడ్డంకి
ABN, Publish Date - Aug 05 , 2025 | 05:57 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వాణిజ్యంపై విరుచుకుపడ్డారు. భారత్ నుంచి తమకు వస్తున్న దిగుమతులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించడంతో బాటు అదనంగా పెనాల్టీ కూడా వేస్తానంటున్నారు. అది కూడా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వాణిజ్యంపై విరుచుకుపడ్డారు. భారత్ నుంచి తమకు వస్తున్న దిగుమతులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించడంతో బాటు అదనంగా పెనాల్టీ కూడా వేస్తానంటున్నారు. అది కూడా తక్షణమే అమలులోకి తీసుకు వచ్చారు. అమెరికా ప్రయోజనాలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా రష్యా, ఇరాన్‌లతో భారత్ వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఈ నిర్ణయాలకు కారణాలుగా చెప్తున్నా, అంతకు మించిన కడుపు మంట, కంటగింపు ఉన్నట్టున్నాయి. అందుకనే పన్నులు పెంచడంతో బాటు మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రాణం లేనిదిగా అభివర్ణించారు. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధి ఆరు శాతం పైగా కొనసాగుతున్న వేళ అలా అభివర్ణించడం పిచ్చితనమే. వీటి వెనుక అసలు కారణం భారత్ తన దేశ ప్రయోజనాల కోణంలో స్వతంత్రంగా వ్యవహరించడమే.
అమెరికా కోరుకున్నట్లు వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులకు సుంకాలు తగ్గిస్తే, అవి వెల్లువెత్తి మన దేశవాళీ పంటలు, పాలు నష్టపోతాయి. రక్షణ కొరవడుతుంది. అక్కడ ఆ దేశం వాటికి భారీ రాయితీలు సమకూర్చి ప్రోత్సహించడం వల్ల, అంత చౌకగా ఇక్కడ రైతు పోటీకి నిలువలేడు. ఒకసారి వాళ్లు మార్కెట్ ఆక్రమించుకున్నాక, గుత్తాధిపత్యం సాధించి తర్వాత తన ప్రతాపం చూపిస్తారు. అప్పటికి ఇక్కడి స్వయం సమృద్ధి ధ్వంసం అవుతుంది. అందుకనే ఈ విషయంలో బేరసారాలకు తావుండకూడదు. ఇక అమెరికా రెండో అభ్యంతరం.. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చెయ్యడం. అది భారత్ ఇష్టం. పైగా ఒకప్పటి కన్నా ఇప్పుడు ఆ దేశం నుంచి కొనుగోళ్లు కూడా తగ్గాయి. పోనీ అమెరికా చెప్పినట్టు మన లాభం వదులుకొని అమెరికాతోనే అంటకాగితే ఫలితం ఏమైనా ఉందా? నాస్తి. అమెరికాలో భారతీయుల ఉద్యోగాలతో సహా అన్నింట్లో కోత. పక్కన శత్రువుగా తయారైన పాకిస్తాన్‌ని పెంచి పోషించడం, దాని భారత వ్యతిరేక విధానాన్ని సమర్థించడం.
ఏదేమైనా అమెరికా సుంకాలు, ఆంక్షలు భారత్‌ని కలవరపెట్టరాదు. మరింత బలం పొందడానికి, ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోడానికి కారణం కావాలి. ఈ మధ్య బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రీతిలో మిగతా దేశాలతో ప్రయత్నించాలి. దేశంలోని వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వతంత్ర భారతానికి అమృత కాలం అని భావిస్తున్న 2047 లోగా అభివృద్ధి యాత్రలో, రాగల అడ్డంకుల్ని ఊహించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్యంలో సమాన స్థాయిలో బేరసారాలు సాగించాలి. బెదిరింపులకు, వడ్డింపులకు సై అంటే సై అనాలి. ఎందుకంటే ట్రంప్‌దంతా మేకపోతు గాంభీర్యమే. చైనాని ఇలాగే బెదిరించి వెనక్కు తగ్గలేదా! ఈ విధంగా ముందుకు పోతే అమెరికా ఆర్థిక వ్యవస్థకూ నష్టమే కదా!
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
Updated Date - Aug 05 , 2025 | 05:57 AM