CPI ML Bhargava Sri: దోపిడీ ఉంటే.. పోరాటాలు తప్పవు
ABN, Publish Date - May 31 , 2025 | 12:28 AM
మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెప్పినా, కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా వారిని అణచేందుకు ప్రయత్నిస్తోంది. అడవుల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు చట్టాల మార్పులతో దోపిడీ సాగుతోంది.
శాంతి చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకత్వం పదేపదే ప్రకటించినా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తున్నా మోదీ షా ప్రభుత్వం మే 21వ తేదీన మావోయిస్టుల అగ్రనాయకులను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపింది. కశ్మీర్‌లో మన పౌరులను దారుణంగా చంపించిన పాకిస్థాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన కేంద్రం మావోయిస్టులతో చర్చలు నిరాకరించి నరమేధాన్ని కొనసాగించటం కుటిల నీతి కాదా? బ్రిటిష్ తెల్లదొరలు అధికారాన్ని నల్లదొరలకు బదలాయిస్తూ బూటకపు ఎన్‌కౌంటర్ల విధానాన్ని కూడా బదలాయించారు. నాడు బ్రిటిష్ దొరలపై అల్లూరి సీతారామరాజు నాయకత్వాన సాగిన ప్రజా తిరుగుబాటును అణచివేయటానికి ఆయనను బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. కానీ అల్లూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేటికీ అటవీ ప్రాంతాల సంరక్షణ కోసం, ఆదివాసీల హక్కుల కోసం గిరిజన సంఘాల నాయకత్వాన పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆదివాసీల పోరాటాన్ని బూటకపు ఎన్‌కౌంటర్లతో అణచాలని ఆనాటి పాలకులు చూశారు.
కానీ ఆ పోరాటం దేశవ్యాప్తంగా పాకింది. ఆ ప్రభావంతోనే శ్రీకాకుళంలో సాగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయటానికి బూటకపు ఎన్‌కౌంటర్ల విధానానికి పాల్పడి అనేకమంది పోరాట యోధులను ఆనాటి పాలకులు పొట్టన పెట్టుకున్నారు. పాలకులు కలలుగన్నట్లు ఉద్యమ పోరాటాలు ఆగకపోగా అనేక ప్రాంతాలకు విస్తరించి నేటికీ కొనసాగుతున్నాయి. ఇవి నానాటికీ విస్తరించడానికి ముఖ్య కారణం పాలకులు తమ దోపిడీ విధానాలను సరికొత్త రూపాలలో కొనసాగించటమే. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు గిరిజనులను చైతన్యపరచి అటవీ ప్రాంతంలో అపారంగా ఉన్న సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను ఎదురిస్తున్నారు. దీనికి ప్రతిగా ఈ ‘ఆపరేషన్ కగార్’ మొదలైంది. గతంలో కంటే నేడు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చేపట్టిన నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను మరింత దూకుడుగా అన్ని రంగాల్లో అమలుపరచడానికి ఒక పథకం ప్రకారం ప్రయత్నాలు సాగిస్తున్నది. బడా కార్పొరేట్ శక్తుల దోపిడీ విధానాల ఫలితంగా కోటీశ్వరులు శతకోటీశ్వరులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ఫలితంగా ప్రజలు తమ ప్రాథమిక హక్కుల సాధన కోసం పోరుబాట పట్టక తప్పటం లేదు.
ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నాయకత్వం వహించినట్లు దేశవ్యాప్తంగా అనేక విప్లవ శక్తులు నాయకత్వం వహించడానికి ముందుకు వస్తున్నాయి. మధ్య భారతంలోని అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అంతిమంగా అపారంగా ఉన్న అడవి సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్‌ను కేంద్ర పాలకులు చేపట్టారు. ఈ దోపిడీకి అడ్డుపడుతున్న 2006 అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాస్వామికంగా తీసుకొచ్చారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాల ఫలితంగా సంభవించే సంక్షోభాలను ఎదుర్కోవటానికి ప్రజల పోరాటమార్గం చేపట్టక తప్పదు! ఇది ప్రపంచ చరిత్ర నిరూపించిన సత్యం. అందుకే 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని చేసే ప్రకటనలు చెత్తబుట్ట పాలుకాక తప్పదు. దోపిడీ ఉన్నంతకాలం ప్రజల హక్కుల కోసం పోరాటాలు సాగుతూనే ఉంటాయి. ఇది సమాజ నియమం.
– ముప్పాళ్ళ భార్గవ శ్రీ,
సీపీఐ ఎంఎల్ నాయకులు
Updated Date - May 31 , 2025 | 12:35 AM