వినాశనబాటలో విశ్వవిద్యాలయాలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:45 AM
‘హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్ర్యాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కులు వదులుకోబోదు... ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను...
‘హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్ర్యాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కులు వదులుకోబోదు... ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి, ఏ సిబ్బందిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు జరపాలి అనే విషయాలు ఆదేశించజాలదు’... విశ్వవిద్యాలయ వ్యవహారాల నిర్వహణలో పాలకుల జోక్యానికి ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఉంటారు? సమాధానం ‘ఎవ్వరూ కారు’ అని మాత్రమే.
ఈ కాలమ్ ప్రారంభ మాటలు హార్వర్డ్ విశ్వవిద్యాలయ (అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే పురాతన సంస్థ) అధ్యక్షుడు అలాన్ గార్బర్‌వి. ఈ ధరిత్రిపై తన కంటే శక్తిమంతుడు అయిన వ్యక్తి మరొకడు లేడని విశ్వసిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలను గార్బర్ ధిక్కరించారు. అందుకు ఆగ్రహించిన ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధుల విడుదలను నిలిపివేశారు. అయినప్పటికీ శ్వేత సౌధ ఆసామీ ఆదేశాలను పాటించేందుకు హార్వర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గత నెలలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలంబియాకు 400మిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన షరతులకు కొలంబియా సమ్మతించింది.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెబ్‌సైట్ ప్రకారం జనవరి 25, 2023 నాటికి భారత్‌లో 1074 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 460; డీమ్డ్ విశ్వవిద్యాలయాలు 128, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 56, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 430 వెరసి మొత్తం 1074. స్వాతంత్ర్య సాధనకు చాలా పూర్వమే 1857లో ప్రారంభమైన కలకత్తా, మద్రాస్, బాంబే విశ్వవిద్యాలయాలు కూడా వీటిలో ఉన్నాయి. యూజీసీ గవర్నర్–ఛాన్సలర్ మధ్య అభిప్రాయ విభేదాలు కారణంగా మద్రాసు విశ్వవిద్యాలయానికి ఆగస్టు 2023 నుంచి వీసీ నియామకం జరగనేలేదు.
పార్లమెంటు చేసిన చట్టాలు, యూజీసీ చట్టం–1956ను యూజీసీ అమలుపరుస్తున్న తీరుతెన్నుల పుణ్యమా అని భారతీయ విశ్వవిద్యాలయాలు స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతున్నాయి. యూజీసీ చట్టంలోని 12వ సెక్షన్ ప్రకారం బోధనా ప్రమాణాలను నిర్ణయించడం, పరీక్షలు, పరిశోధనల నిర్వహణకు విశ్వవిద్యాలయాలకు యూజీసీ నిధులు ఇస్తుంది. 1984లో సెక్షన్ 12ఎ ను చేర్చి సెక్షన్ 14ను సవరించడం ద్వారా యూజీసీ అధికారాలను విస్తృతపరిచారు. నిధుల పంపిణీ అధికారాలు ఉన్న కారణంగా యూజీసీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతి వ్యవహారంలోను నియమ విరుద్ధంగా జోక్యం చేసుకోవడం అధికమయింది. సదరు నిబంధనలు ఇచ్చిన అధికారాలతో ఒక విశ్వవిద్యాలయం స్వతంత్ర ప్రతి పత్తిని యూజీసీ పూర్తిగా హరించి వేయగలుగుతోంది.
యూజీసీపై నియంత్రణ ద్వారా భావజాల పక్షపాతంతో వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకాలు, పాఠ్య ప్రణాళికల రూపకల్పన, పరిశోధనా రంగాలు, పరీక్షల నిర్వహణను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. యూజీసీ నిర్దేశిస్తున్న కొన్ని అనుచిత నిబంధనలు: అధ్యాపకులు, ఇతర బోధనా సిబ్బంది విద్యార్హతలు, నియామకాలకు సంబంధించిన నిబంధనలు; నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్); నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నీట్); జాయిట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ); కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్; ది లెర్నింగ్ అవుట్ కమ్స్ –బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ (ఎల్‌ఓసీఎఫ్); చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్), నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్). వైస్ ఛాన్సలర్లు ‘అవశిష్ట’ అధికారాలను ఉపయోగించుకుంటున్న కారణంగా వీసీల ఎంపిక, నియామకం వ్యవహారాలను యూజీసీ తన నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. నా అభిప్రాయంలో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది, ముఖ్యంగా వీసీల ఎంపిక, నియామకాలలో యూజీసీకి పాత్ర లేదు, ఉండకూడదు. మరి యూజీసీ అటువంటి పాత్ర నిర్వహించేందుకు అనుమతిస్తే అది విశ్వవిద్యాలయాల జాతీయీకరణకు రంగాన్ని సిద్ధం చేయడమే అవుతుంది.
విశ్వవిద్యాలయాపై విస్తృత నియంత్రణ ఉన్నత విద్యారంగంలో పరిస్థితుల మెరుగుదలకు దోహదం చేస్తుందా? ఏ భారతీయ విశ్వవిద్యాలయానికి ప్రపంచ అగ్రగామి 100 విశ్వవిద్యాలయాలలో స్థానం లభించడం లేదు. అత్యున్నత ర్యాంక్ పొందిన భారతీయ ఉన్నత విద్యాసంస్థ బాంబే ఐఐటి. ఈ సంస్థకు లభించిన ర్యాంక్ 118. అక్టోబర్ 21, 2024 నాటికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల సంఖ్య 5182 అని ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఐఐటీ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ నియామకాలు (ప్లేస్‌మెంట్స్) తగ్గి పోయాయని విద్యాశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. 2021–22 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య ఈ నియాకాలు పది శాతానికి పైగా తగ్గి పోయాయి. ఎన్‌ఐటీ గ్రాడ్యుయేట్ల ప్లేస్‌మెంట్‌లు కూడా 10.77 శాతం మేరకు తగ్గిపోయాయి. భారతీయ విశ్వవిద్యాలయాలలో శిక్షణపొంది నోబెల్ పురస్కారం పొందిన ఒకే ఒక్క భారతీయ శాస్త్రవేత్త సి.వి. రామన్ మాత్రమే.
విద్యావిషయక స్వేచ్ఛ కుదించుకుపోతోంది. ఇదొక ఆందోళనకరమైన పరిణామం. అసహన సమూహాలు జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జమియా మిలియా, ఏఎమ్‌యూ, జాదవపూర్, జమ్ము సెంట్రల్ వర్శిటీలతో సహా పలు విశ్వవిద్యాలయాలు (వాటి అధ్యాపకులు, విద్యార్థులు)పై విమర్శానాస్త్రాలను సంధిస్తున్నాయి. భౌతిక దాడులకూ పాల్పడుతున్నాయి. యూజీసీ చట్టాన్ని రద్దు చేసి, పునః రూపొందించి, అమలుపరచనిపక్షంలో విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తి ఒక సుదూర లక్ష్యంగా మాత్రమే ఉండిపోతుంది. పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోతే విద్యావిషయక స్వేచ్ఛ ఒక ఎండమావి అవుతుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు బదులు సంపన్న కుటుంబాలు, కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూర్చి ప్రమోట్ చేసే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పెరిగిపోతాయి. వితరణశీలతే ఆ భాగ్యవంతుల సంకల్పం కావచ్చు కానీ ఫలితం మాత్రమే పక్కా వ్యాపారమే సుమా!
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 19 , 2025 | 05:45 AM