O.V. Ramana Former Member of TTD: ఆవు కతలు ఆపండి భూమనా
ABN, Publish Date - Apr 23 , 2025 | 05:13 AM
తిరుపతి టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై రాజకీయాలు వేడెక్కిన పరిస్థితిని వివరిస్తూ, అవాస్తవ ఆరోపణల వెనుక ఉన్న నిజాలను మాజీ పాలకమండలి సభ్యుడు ఓ.వి. రమణ వివరించారు. గోవుల సహజ మరణాలను రాజకీయ అవసరాల కోసం వక్రీకరించడం అనైతికమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలన్నీ గోవు చుట్టూ తిరుగుతున్నాయి. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, వివరణలు, మీడియా సమావేశాలతో అంతా సందడిగా ఉంది. దేవుడిని రాజకీయాల్లోకి దిగలాగుతున్న తీరు చూసి శ్రీవేంకటేశ్వరుని భక్తులు నివ్వెరపోతున్నారు. ఏది నిజమో, ఏది అసత్యమో అర్థం కాని అయోమయం నెలకొని ఉంది. తిరుపతివాసిగా, తిరుమల శ్రీవేంకటేశ్వరుని భక్తుడిగా, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడిగా నాకు తెలిసిన సంగతులను వివరిస్తాను. తిరుపతిలోని టీటీడీ గోశాలలో ఆవుల మరణం వాస్తవమే. కాకపోతే ఈ మరణాలు హఠాత్తుగా ఇప్పుడు మాత్రమే సంభవించినవి కాదు. అనేక సంవత్సరాలుగా గోశాలలో ఆవులు చనిపోతూనే ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా సరైన పోషణ లేకపోవడంగానీ, తగినంత గడ్డీ, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంగానీ, వైద్యం అందకపోవడంగానీ దీనికి కారణాలు కాదు. టీటీడీ గోశాలలో గోసంరక్షణ ఎలా ఉంటుందో అందరికన్నా ఎక్కువగా ఈ ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకరరెడ్డికే తెలుసు. ఎందుకంటే తొమ్మిదేళ్ళ పాటు టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగానూ, అధ్యక్షుడుగానూ ఉన్న ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే. పశుదాణా, గడ్డి కొనుగోలు, నాణ్యత విషయంలో గతంలో ఎన్నో సందర్భాల్లో చర్చ జరిగింది. అవే మార్గదర్శకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. ఈ విషయం కూడా కరుణాకరరెడ్డికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. మనం నిత్యం పూజించే దేవత గోవు.
అటువంటి గోవులకు తిండి పెట్టకుండా, సరైన పోషణ చేయకుండా చనిపోయే స్థితి ఎవరైనా కల్పిస్తారని మనిషి అయిన వారెవరూ అనలేరు. టీటీడీతో ఇంత అనుభవమూ అనుబంధమూ ఉన్న భూమన కరుణాకరరెడ్డి కేవలం శుష్క రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని అబద్ధాలు చెప్పడం అన్యాయం. ఏ సంస్థ మీ ఉనికికి గౌరవాన్ని కల్పించిందో, ఆ సంస్థ మీదే నిత్యం బురద చల్లుతూ ఉండడం అంటే తల్లి పాలు తాగి ఆమెనే తూలనాడడం కాదా భూమనా? గోవుల సహజమరణాలను అసహజమంటూ పదేపదే చెప్పడం ఏమి రాజకీయం? అసలు టీటీడీ గోశాలలో గోవుల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. సాధారణంగా గోవులు కాస్త చల్లదనం ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువకాలం జీవిస్తాయి. అత్యంత వేడి ప్రదేశాల్లో తిరుపతి ఒకటి. ఇక్కడ వేసవిలో 47, 48 డిగ్రీల దాకా నమోదవుతూ ఉంటుంది. అందుకే వేసవిలోనే గోవుల మరణాలు అధికం. ఈ విషయం గోశాల రికార్డులు పరిశీలిస్తే అర్థం అవుతుంది. అప్పటికీ గోశాలలో ఎయిర్ కూలర్లతో వేడి తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినా ఎండాకాలం గోవులు సరిగా తిండి కూడా తినవు. బక్కచిక్కి చనిపోతూ ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. రోజూ లక్షమంది యాత్రికులు వచ్చిపోయే తిరుమల వంటి చోట ఒకటో, అరో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.
వాటిని భూతద్దంలో చూపించి తిరుమల పవిత్రతను మంటగలపాలనే ఆలోచనా, ప్రయత్నం మొన్నటిదాకా స్వామి ప్రథమ భక్తుడనని చెప్పుకుంటూ, పాలకమండలి పదవిలో ఉన్నన్నాళ్లూ నుదుట తిరునామంతో కనిపించిన భూమన కరుణాకరరెడ్డి చేయడం తగునా? టీటీడీ కొలువులో ఉన్నకాలంలో ఆయన చెప్పిన మాటలన్నీ ఉత్తవే అనీ, మానవీయ విలువల గురించి భూమన వల్లెవేసిన మాటలన్నీ అబద్ధాలే అనీ, ఆయన కూడా ఫక్తు రాజకీయ నాయకుడే అనీ ఈ పరిణామాలతో అందరూ గ్రహిస్తున్నారు. పాలకమండలి అధ్యక్షుడికి కావాల్సింది స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు, ధార్మిక సంస్థ సంరక్షణ విషయంలో చిత్తశుద్ధి, భక్తుల మనోభావాల పట్ల గౌరవం, అవినీతి రహితంగా ఉండడం.. ఇంతేతప్ప రెండు పద్యాలు చెప్పగలగడం కాదు. ప్రస్తుత పాలకమండలి అధ్యక్షుడికి భూమన విసిరిన సవాలు వింటే నవ్వు వస్తుంది. అలా అయితే, టీటీడీ పాలకమండలి మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి గారికి ఎన్ని పద్యాలు తెలుసు? మీకంటే నాటక అనుభవం ఉంది గనుక, పద్యాలు చెప్పగలరు. తెలుగు భాష ఉత్సవాల పేరుతో, జాతర పేరుతో ఎంతెంత వసూళ్లు చేశారో, స్వామి సొమ్మును ఎలా కరిగించారో చెప్పుకుంటూ పోతే చాంతాడంత వస్తుంది. పబ్లిసిటీ కోసం పాకులాట మానేసి కాస్త హుందాగా వ్యవహరించండి. నిజంగా తప్పు జరిగితే విమర్శలు చేయండి. టీటీడీ వంటి సంస్థ పరువు బజారులో మాత్రం పెట్టకండి.
– ఓ.వి. రమణ టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు
Updated Date - Apr 23 , 2025 | 05:13 AM