మిత్రభేదం
ABN, Publish Date - Jun 10 , 2025 | 03:37 AM
ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఘర్షణ మిగతావారికి చూడముచ్చటగానే ఉంటుంది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌కూ, అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కూ మధ్యన అలనాటి ఆత్మీయతలూ ఆలింగనాలు చెరిగిపోయి, అపహాస్యాలు, అవహేళనల దశ కూడా దాటిపోయి, ఇప్పుడు అనుమానాలూ హెచ్చరికల వరకూ పరిస్థితి...
ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఘర్షణ మిగతావారికి చూడముచ్చటగానే ఉంటుంది. అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌కూ, అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కూ మధ్యన అలనాటి ఆత్మీయతలూ ఆలింగనాలు చెరిగిపోయి, అపహాస్యాలు, అవహేళనల దశ కూడా దాటిపోయి, ఇప్పుడు అనుమానాలూ హెచ్చరికల వరకూ పరిస్థితి వచ్చేసింది. అంతిమంగా ఎవరిది పైచేయి కావచ్చునన్న విశ్లేషణలను అటుంచితే, స్వప్రయోజనాలను రక్షించుకొనే విషయంలోనే వీరిద్దరి మధ్యా ఘర్షణ ఏర్పడిన మాట వాస్తవం. ట్రంప్‌ను గెలిపించింది తానేనన్న అహంకారం మస్క్‌కు ఉన్నా తప్పేమీలేదు. అధికారికంగా ఓ మూడువందల మిలియన్ డాలర్ల ఎన్నికల ఖర్చు భరించి, తన గుప్పిట్లో ఉన్న సోషల్‌మీడియాద్వారా ట్రంప్‌ను అమెరికా రక్షకుడుగా ప్రచారం చేసి మరీ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టాడు మస్క్. అధికారంలోకి రాకముందునుంచే మస్క్‌ను మించిన మేధావి ఈ భూప్రపంచంలోనే లేడంటూ ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్, కుర్చీలో కూచోగానే, తన తరువాత తనంతటివాడు ఆయనేనని స్పష్టంచేస్తూ సమస్తవ్యవస్థలనూ ప్రక్షాళించే బాధ్యతలను అప్పగించాడు. అమెరికా ఒక్కటే కాదు, మిగతా ప్రపంచం కూడా ఏనాడూ ట్రంప్‌వేరు, మస్క్ వేరు అనుకోలేదు. ఎలాన్ ఎలా అంటే అలా చెల్లుబాటయ్యేలా సమస్త శక్తినీ, సర్వాధికారాలనూ అతడికి ధారపోసి తనను అధికారంలోకి తెచ్చిన ఆ రుణం తీర్చుకోవడానికి ట్రంప్ సిద్ధపడ్డాడు. ఖర్చులు తగ్గించేపేరిట అన్నిరంగాల్లోనూ వేలుపెడుతున్నాడని, సైనిక రహస్యాలనూ, గూఢచర్యం గుట్టునూ తెలుసుకుంటున్నాడని ఎన్నో విమర్శలు వచ్చాయి, న్యాయస్థానాల్లో కేసులూ పడ్డాయి. ఇలా మస్క్ మంచి జోరుమీద ఉండగా, ఖర్చు తగ్గించే ఎజెండాకు పూర్తిభిన్నంగా ట్రంప్ తెరమీదకు తెచ్చిన సదరు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇద్దరి మధ్యా వివాదానికి కారణమైంది. చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు పన్నుల్లో కోతనూ, భారీ వ్యయాన్ని ప్రతిపాదిస్తున్న ఈ బిల్లుమీద మస్క్ తన మనసులో ఉన్న ఆగ్రహాన్ని పూర్తిగా కక్కేశారు. ఒకపక్క వేలాదిమంది ఉద్యోగాలు పీకేస్తూ, విదేశీనిధులను నిలిపివేస్తూ తాను ప్రతీ డాలర్ కూడబెడుతూంటే ఈ నికృష్టపు బిల్లు ఏమిటన్నది మస్క్ వాదన. ఈ ఘర్షణ మధ్యనే, ఒక పదవిని భర్తీచేసే విషయంలో ఆర్థికమంత్రికి అనుకూలంగా ట్రంప్ వ్యవహరించినందున మస్క్ మనసు నొచ్చుకుందని, తనతో అవమానకరంగా వ్యవహరించిన ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్‌తో ముష్టిఘాతాలకు దిగాడని ఇటీవలే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. యావత్ ప్రపంచంలో మస్క్‌ను మించిన మేథావి తనకు కనబడనేలేదని ఒకప్పుడు ప్రశంసించిన ట్రంప్ అదేనోటితో చివరకు పిచ్చోడని తీసిపారేశారు. మస్క్‌కు వీడ్కోలు చెప్పడానికి కూడా ట్రంప్‌కు మనసురాలేదని అంటారు. ఒక విధానపరమైన అసమ్మతిగా మొదలైన ఈ వ్యవహారానికి శ్రుతిమించిన అహంకారాలు తోడై విస్తృత రాజకీయ యుద్ధంగా మారింది.
ట్రంప్ గతాన్ని తవ్వుతూ, ప్రత్యేకించి జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ప్రస్తావన చేస్తూ, అధ్యక్షుడిని అభిశంసించాలంటూ పోస్టులు పెట్టడం వరకూ మస్క్ పోయారు. తాను వ్యతిరేకిస్తున్న బిల్లుకు అనుకూలంగా ఓటేసిన రిపబ్లికన్లను వచ్చే ఏడాది ఎన్నికల్లో ఓడిస్తానని కూడా శపథం చేశారు. డెమోక్రాట్లకు ఆర్థికసాయం చేస్తే నిన్ను ఇక క్షమించేది లేదని ట్రంప్ మరోపక్క బెదిరిస్తున్నారు. మస్క్, టెస్లాలమీద ట్రంప్ మనసు విరిగిపోయిన కారణంగా ఆ సంస్థ లక్షలాదికోట్లు కోల్పోయింది. గతంలో స్పేస్ ఎక్స్‌ను అమితంగా శ్లాఘించిన ట్రంప్ ఇప్పుడు దానితో ఫెడరల్ ప్రభుత్వానికి ఉన్న కాంట్రాక్టులన్నీ రద్దుచేస్తానని బెదిరిస్తూ, నాసా ప్రాజెక్టుల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు. తనకు హామీ ఇచ్చినదానికి భిన్నంగా చమురులాబీ పక్షాన ట్రంప్ నిర్ణయాలు కొనసాగుతూండటంతో, ఈ విద్యుత్ వాహనాల తయారీదారుడు తట్టుకోలేకపోతున్నారని అంటారు. నాసా అధినేత నియామకం కూడా ఇరువురి మధ్యా వైషమ్యాలు పెంచిందట. ట్రంప్–మస్క్ వివాదం రాజకీయాల్లో వ్యాపారవేత్తల ప్రత్యక్షపాత్రమీద తీవ్ర చర్చను లేవనెత్తుతోంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయనాయకులకు మధ్య ఉన్న సంబంధం తెలియనిదేమీ కాదు. ఎన్నికల ఖర్చుకోసం వారినుంచి నిధులు అందుకోవడం, అధికారంలోకి వచ్చిన తరువాత వారికి కొన్ని మేళ్ళు చేసిపెట్టడం అనాదిగా ఉన్నదే. కానీ, అమెరికాను మళ్ళీ మహోన్నత దేశంగా నిలబెడతానన్న ట్రంప్ తనకు ఎన్నికల నిధులు సమకూర్చిన మస్క్‌కు ప్రభుత్వంలో కీలకబాధ్యతలు అప్పగించి చిట్టచివరకు తనకూ, దేశానికీ కూడా అప్రదిష్ఠ మిగిల్చారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 10 , 2025 | 03:37 AM