US Russia Relations: యుద్ధం సశేషం
ABN, Publish Date - Aug 20 , 2025 | 05:40 AM
అటు రష్యా అధ్యక్షుడు, ఇటు అమెరికా అధ్యక్షుడు భారీ భద్రత మధ్య ఆర్భాటంగా తరలివెళ్ళిన అలాస్కా..
అటు రష్యా అధ్యక్షుడు, ఇటు అమెరికా అధ్యక్షుడు భారీ భద్రత మధ్య ఆర్భాటంగా తరలివెళ్ళిన అలాస్కా సమావేశం హిట్టయిందా లేదా అన్నది వేరే సంగతి, కానీ, వీరిద్దరి కలయికే చూడముచ్చటైన దృశ్యం. వందలేళ్ళక్రితం రష్యా చక్రవర్తులనుంచి అమెరికా చవుకగా కొనేసిన అలస్కాను ఎంపిక చేయడంలో ట్రంప్ తెలివి తేటలున్నాయో, ఏ దేశమేగినా అరెస్టయ్యే ప్రమాదం ఉన్న పుతిన్ తనదేశ సరిహద్దులకు దూరంగా పోదల్చుకోక అలాస్కా కోసం ఒత్తిడిచేశారో తెలియదు. పుతిన్‌కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచినా, అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్–35 విమానాలు, ఒక బీటూ బాంబర్ రష్యా అధ్యక్షుడి దిశగా ఎగురుతున్న ఆ దృశ్యాలు ఎన్నటికీ మరిచిపోలేనివి. ఓ నాలుగు విమానం బొమ్మలతో సాక్షాత్తూ రష్యా అధ్యక్షుడినే బెదిరించి దారికి తెచ్చుకోగలవా ట్రంప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎగతాళి చేసినవారికి, ఈ విమానవిన్యాసాల్లో ముఖస్తుతి ఉన్నది తప్ప, బెదిరింపులు లేవని తెలియకపోదు.
దీనికి కొనసాగింపుగా, మరో దృశ్యం కూడా ప్రపంచం చూసింది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని బయటకు గెంటేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఆలింగనాల స్థాయిలో ఎక్కడలేని ఆప్యాయతలూ కనబరిచారు. ఆర్నెల్ల క్రితం జెలెన్‌స్కీ దుస్తులు పరమచెత్తగా ఉన్నాయని మొఖం మీదే చెప్పేసిన అమెరికా పాత్రికేయుడికి కూడా ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడూ, ఆయన సూటూ తెగ నచ్చేశాయి. అవును, నాకూ అలాగే అనిపించింది, నేనూ అదే చెప్పాను అన్నారు ట్రంప్ ఆనందంగా. జెలెన్‌స్కీకి దక్కిన స్వాగతసత్కారాలు, మర్యాదలు, భేటీలో పూచిన నవ్వులపువ్వులు చూసినవారికి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ఇదే వ్యక్తిని ఛీత్కరించి బయటకు పంపేసిన దృశ్యాలు గుర్తుకు రాకతప్పవు. మహాబలుడైన పుతిన్‌ముందు నువ్వెంత, నీకున్న ఆయుధ బలమెంత అంటూ అవమానించి, కయ్యానికి కాలుదువ్వింది నువ్వేనంటూ అచ్చం పుతిన్ పరిభాషలో చెడామడా ఏకేయడం విస్మరించలేనివి. ఆ తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు ఖరీదైన కప్పం సమర్పించుకోవడానికి సిద్ధపడిన ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తున్న మార్పుకు ఒక కారణం కావచ్చు.
పుతిన్‌తో భేటీ తరువాత, జెలెన్‌స్కీ మీద అమెరికా అధ్యక్షుడికి ఇలా ఎక్కడలేని ప్రేమాభిమానాలు పొంగుకొచ్చే ప్రమాదం ఉన్నదని తెలుసు కాబట్టే, ఏడు యూరప్ దేశాల నాయకులూ వెంట పరిగెత్తుకొచ్చారు. జెలెన్‌స్కీ మీద ఒత్తిడితెచ్చి పుతిన్ కోరుతున్న ఉక్రెయిన్ భూభాగాలను ట్రంప్ ఎక్కడ ధారపోస్తాడోనని వీరి అనుమానం. వీరితో కరచాలనాలు, ఫోటోసెషన్లు, ఇతరత్రా మర్యాదలకు లోటేమీ చేయలేదు కానీ, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి వీరందరినీ నలభైనిముషాలపాటు ట్రంప్ నిరీక్షణలో ఉంచారని మాత్రం వార్తలు వచ్చాయి. మళ్లీ కలుద్దాం అంటూ, ఈమారు మాస్కోలో అని పుతిన్ అలాస్కాలోనే ట్రంప్‌తో ఓ మాటన్నారు. మాస్కోలో భేటీకి జెలెన్‌స్కీ అంగీకరించడని అమెరికా, రష్యా అధ్యక్షులకు తెలియదనుకోలేం. పుతిన్ రమ్మనడం, జెలెన్‌స్కీ సహా ఆయన పక్షాన ఉన్నవాళ్ళంతా దానిని కాదనడం జరిగిపోయాయి. ఏదో ఒకరోజు, అందరికీ అంగీకారమైన చోట పుతిన్–జెలెన్‌స్కీ కలిసికూర్చొని మాట్లాడుకుంటారని ట్రంప్ నమ్ముతున్నప్పటికీ, అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చును. కాల్పుల విరమణ తరువాతే ఇటువంటి భేటీలకు సార్థకత ఉంటుందని యూరప్ నాయకుల వాదన. భూదానం సహా తన డిమాండ్లన్నింటికీ ఒప్పుకుంటే నేరుగా శాంతి ఒప్పందం మీదే సంతకాలు చేసుకోవచ్చునన్న పుతిన్ ప్రతిపాదన ట్రంప్‌కు కూడా ఇంపుగా ఉంది. కాల్పుల విరమణకు ఒప్పుకోనిపక్షంలో పుతిన్ చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అలాస్కా బయలుదేరే ముందు హెచ్చరించిన ట్రంప్, వెనక్కు వచ్చిన తరువాత పుతిన్ పక్షానే మాట్లాడుతున్నట్టు యూరప్ దేశాధినేతలకు అనిపిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ అదేపనిగా కష్టపడుతున్నారు. అధికారంలోకి రాగానే ఆప్తమిత్రుడు పుతిన్‌కు ఓ మాటచెబితే యుద్ధం ఆగిపోతుందనుకున్నారు ఆయన. అది జరగకపోగా, ఆయుధాలకు, ఆంక్షలకు, హెచ్చరికలకూ కూడా బెదరకపోవడంతో మిత్రదేశాలమీద ఆర్థిక ఒత్తిడి పెంచి రష్యాను దారికి తెచ్చే ప్రయత్నం సాగిస్తున్నారు. యుద్ధం ఆపడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నప్పటికీ, పుతిన్ ఆవహించి ఉన్నంతకాలం అది సాధ్యపడదని యూరప్ దేశాధినేతల నమ్మకం.
Updated Date - Aug 20 , 2025 | 05:40 AM