America in Decline: అమెరికా... అమెరికా.. ఎక్కడ నుంచి ఎక్కడకు
ABN, Publish Date - Sep 12 , 2025 | 06:16 AM
ప్రాభవం కోల్పోతున్నప్పుడు, దానికి విరుగుడుగా ప్రత్యామ్నాయ మార్గమూ దొరకనప్పుడు విపరీత ప్రవర్తన కనపడుతుంది. వ్యక్తికైనా దేశానికైనా ఇదే వర్తిస్తుంది. ప్రపంచ...
ప్రాభవం కోల్పోతున్నప్పుడు, దానికి విరుగుడుగా ప్రత్యామ్నాయ మార్గమూ దొరకనప్పుడు విపరీత ప్రవర్తన కనపడుతుంది. వ్యక్తికైనా దేశానికైనా ఇదే వర్తిస్తుంది. ప్రపంచ దేశాల మీద ఎడాపెడా సుంకాలు విధిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చర్యల్లో మనకు కనపడేది ఇదే. ఆధిపత్యానికి కావాల్సిన హంగులు, ఏర్పాట్లు, మేధో విశిష్టతలు ఒక్కొక్కటిగా కోల్పోతున్నప్పుడు మర్యాదలూ, సంయమనాలూ మట్టికల్సిపోతాయి. దౌత్యనీతులు మంటగలుస్తాయి. చుట్టూ శత్రు సమూహాలు కమ్ముకొస్తున్నట్లుగా హడావుడులు హోరెత్తుతాయి. పైపైన చూస్తే ట్రంప్ లాంటి నాయకులు తమ ప్రవర్తనతో, లోతులేని ఆలోచనలతో కోరికోరి అమెరికాకు నష్టాలు తెచ్చిపెడుతున్నట్లుగా కనిపిస్తుంది. వ్యక్తుల ప్రవర్తన, వ్యక్తిత్వమే అన్నిటికీ కీలకం అనుకుంటే అసలు పరిస్థితులు అర్థంకావు. నాయకుల ప్రభావం చరిత్రగతి మీద ఉంటుంది. దాన్ని కాదనలేం. కానీ ఒక సమాజం, ఒక దేశం సంక్లిష్ట ప్రయాణాన్నీ, ఆటుపోట్లనూ అర్థం చేసుకోటానికి ఎన్నో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆ పరిస్థితుల్లో నుంచే విపరీత పోకడల నేతలు పుట్టుకొస్తారు.
వాణిజ్య సుంకాలను అస్త్రాలుగా ఉపయోగించి, వివిధ దేశాల ఎగుమతులపై అనిశ్చితిని సృష్టించి, అమెరికాకు నచ్చినట్లు ఆయా దేశాల ఆర్థిక వ్యవహారాలను మార్చటానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను సునిశితంగా పరిశీలిస్తే ఒక సంక్షోభమే కనపడుతుంది. ఆధిపత్యం కోల్పోతున్న క్రమం వెల్లడవుతుంది. ఎగుమతులు తగ్గి దిగుమతులు విపరీతంగా పెరగటం అమెరికాకు నిన్నోమొన్నో మొదలవ్వలేదు. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ ఉంటే ఏ దేశమైనా వాణిజ్యపరంగా మిగులును (ట్రేడ్ సర్ఫలస్) కలిగి ఉంటుంది. అమెరికా ఆ స్థానాన్ని ఎప్పుడో కోల్పోయింది. 1976 నుంచి ఇప్పటివరకూ ఏ ఏడాదిలోనూ వాణిజ్య మిగులును సాధించలేదు. రకరకాల వస్తువులు, పరికరాలు, పదార్థాలు, యంత్రాల కోసం విదేశాలపై ఆధారపడటం 50 ఏళ్లుగా కొనసాగుతోంది. ముడిసరుకులు, శ్రమశక్తి చవకగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులను ప్రోత్సహించటం ఒకనాడు విధానంగా పెట్టుకుంది. అక్కడికి పెట్టుబడులనూ తరలించింది. అటువంటి దేశాలను అన్ని విధాలా వెన్నుతట్టింది. తనకు చౌకగా వస్తువులను ఎగుమతి చేసే దేశాలను స్వేచ్ఛా వాణిజ్యానికి అసలుసిసలైన ప్రతినిధులుగా కీర్తించింది. ప్రపంచీకరణ బాగా ఊపందుకున్న 1990ల తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఐటీ ఆధారిత, విమాన ప్రయాణం, పర్యాటక, విద్యా, మేధోహక్కుల రంగాలకు సంబంధించిన వాణిజ్యసేవల లావాదేవీల్లో అమెరికా మిగులును సాధిస్తూ వస్తున్నా, వస్తూత్పత్తి రంగాల్లో వెనుకబడి పోయింది. కిందటి ఏడాదిలో వస్తూత్పత్తి లావాదేవీల్లో 1.21 ట్రిలియన్ డాలర్ల లోటు ఉంది. సర్వీసు రంగాల్లో వచ్చిన మిగులు 293 బిలియన్ డాలర్లు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే దాదాపు 918 బిలియన్ డాలర్ల లోటు ఏర్పడింది. ఇదొక విపత్కర పరిస్థితి. అగ్రగామి దేశానికి వాణిజ్య మిగులు ఉండటం సహజం.
మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేవరకూ దాదాపు వందేళ్లపాటు వాణిజ్యంలో బ్రిటన్ మిగులును సాధించింది. ఆ తర్వాత దాన్ని కోల్పోయింది. దాంతో ప్రపంచంలో ఒకటో స్థానాన్నీ కోల్పోయింది. ఆ తర్వాత ఆర్థికపరంగా చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. వస్తు, యంత్ర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నంతవరకూ బ్రిటన్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అమెరికా కూడా ఒకప్పుడు ఆ రకంగానే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 1980ల తర్వాత ఆసియా దేశాలు బాగా ముందంజ వేస్తున్న పరిస్థితుల్లో ఆ స్థానాన్ని అమెరికా తిరిగిపొందే అవకాశం కనపడటంలేదు. మాగా, మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగెన్) అనే నినాదంపై ఎంతగా గొంతెత్తినా ఆశించిన ఫలితాన్ని సాధించటం అంత తేలికకాదు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి బడా టెక్ కంపెనీలపై విపరీత ఒత్తిళ్లు వస్తున్నా అవి ఎంతమేరకు నెరవేరతాయో ఇప్పుడే చెప్పలేం. రాజకీయ పరిస్థితులు మారిపోతే ఆ ఒత్తిళ్లూ తగ్గుతాయి. లాభాలు, ఇతరత్రా ఉండే సానుకూలతలకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయి. వాటి ముందు దేశభక్తి నిలబడటం కష్టం!
అమెరికాతో పోల్చితే చైనా ట్రిలియన్ డాలర్ల మిగులు వాణిజ్యంలో ఉండటానికి కారణం వస్తూత్పత్తిలోనూ, శాస్త్రసాంకేతిక రంగాల్లో సాధించిన అనూహ్య అభివృద్ధే. ఆధునిక చరిత్రలోనే ఇది అపూర్వం. గ్లోబలైజేషన్ గురించి ఎన్నో పొగడ్తలతోనూ, పోటీ పునాదిగా ఆర్థిక వ్యవస్థలు మారటానికి అదెలా కారణమవుతుందో వివరిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత థామస్ ఫ్రీడ్‌మన్ 2005లో ‘ద వల్డ్ ఈజ్ ఫ్లాట్’ పుస్తకాన్ని రాశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, ఐటీ ఆధారిత సర్వీసులు ప్రపంచాన్ని ఎట్లా మార్చి వేయబోతున్నాయో అప్పుడే చెప్పారు. ప్రపంచీకరణతో అన్ని దేశాలకూ సమాన అవకాశాలు దక్కుతాయని చెప్పటమే కాకుండా అందుకు ఉదాహరణలుగా బెంగళూరులో ఐటీ కంపెనీల గురించి ఘనంగా వివరించారు. అసలు ‘వల్డ్ ఈజ్ ఫ్లాట్’ అన్న భావననే తాను ఇన్ఫోసిస్ ఛీఫ్‌గా ఉన్న నందన్ నిలేకని నుంచి స్వీకరించానని కూడా తెలిపారు. ఫ్రీడ్‌మన్ ఒక విషయాన్ని ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో అమెరికన్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటం ప్రమాదకరంగా మారుతోందనీ దాన్ని అరికట్టకపోతే తీవ్ర ప్రమాదం పొంచివుందనీ హెచ్చరించారు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లోని స్టెమ్ కోర్సులో ఆసియా విద్యార్థుల ఆధిపత్యం పెరిగిపోతోందనీ, అది అలాగే కొనసాగితే కొత్త టెక్నాలజీలకు అమెరికా నాయకత్వం వహించే పరిస్థితి ఉండదనీ చెప్పారు. 2005 నాటికే చైనా, జపాన్‌ల్లో అమెరికా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా స్టెమ్ సబ్జెక్టుల్లో చదివే విద్యార్థులు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో చైనాలో స్టెమ్ కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసే పరిశోధక విద్యార్థులు 77,000 మంది ఉంటే అమెరికాలో ఆ సంఖ్య 40,000 మాత్రమే. ఇందులోనూ ఆసియా విద్యార్థుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. వీసాల ఆంక్షలతో, సవాలక్ష శల్యపరీక్షలతో ఆసియా పరిశోధకులకు అడ్డంకులు సృష్టిస్తే స్టెమ్ కోర్సుల్లో చేరే ప్రతిభావంతుల సంఖ్య ఇంకా తగ్గుతుంది. పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం ఖర్చుపెట్టే నిధుల విషయంలో కూడా చైనా అమెరికాను ఈ ఏడాది దాటేయబోతోంది. అమెరికా ఆధిపత్యానికి గండిపడటానికి ఇవన్నీ గట్టి సూచికలు.
సుంకాల యుద్ధంలో తాను ఇప్పటికే విజయం సాధించాననే భావనతోనే ట్రంప్ ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలానికి దిగుమతి సుంకాల ద్వారా 183.6 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2024లో వచ్చిన 77 బిలియన్లతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. 2023 నాటి 93 బిలియన్ డాలర్లతో పోల్చినా దాదాపు రెట్టింపు అయినట్లు లెక్క. అయినా అమెరికాను విపరీతంగా కుంగదీస్తోన్న బడ్జెట్ లోటును అది ఆర్చేది తీర్చేది కాదు. ఆ లోటును పూడ్చటానికి అదనపు సుంకాల విధింపును సాధనంగా ఎంచుకున్నా దక్కే ఫలితం మాత్రం కొంతే. 1900 బిలియన్ డాలర్ల బడ్జెట్ లోటులో (2025 అంచనాలు) సుంకాల ద్వారా లభించే మొత్తం ఆదాయం 10 శాతానికి కాస్త అటూఇటూగానే ఉంటుంది. లోటుని పూడ్చటానికి సుంకాలు పెంపు పరిష్కారం కాదనేది ఈ అంకెలే చెబుతాయి. దిగుమతి సుంకాల పెంపు ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని రేటింగ్ సంస్థలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా ట్రంప్ బృందం పట్టించుకోవటంలేదు.
ఒకప్పుడు అభివృద్ధి చెందుతోన్న దేశాలు తమ దుస్థితికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ధనిక దేశాలే కారణమని విమర్శించేవి. ధనిక దేశాల సామ్రాజ్యవాదానికి దాదాపుగా ఆసియాలో అన్ని దేశాలూ బాధలు పడినవే. దోపిడీకి లోనైనవే. ఇప్పుడు అత్యంత ధనికదేశం తన దుస్థితికి అభివృద్ధి చెందుతున్న దేశాలే కారణమని నిందిస్తోంది. ఒక కోణం నుంచి చూస్తే సరైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోలేని దుస్థితి, అశక్తతే ఇందులో కనపడుతుంది. ఫెడరల్ ప్రభుత్వ అప్పులను ఎలా తీర్చాలో తెలియదు. ఏటా పెరిగిపోయే వడ్డీలు కట్టే విషయంలో పరిష్కారం కనుక్కోరు. సంపన్నులపై పన్నులు పెంచకుండా తగ్గించుకుని పోవటమే ఇందుకు నిదర్శనం. అప్పులు 37 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏటా కట్టే వడ్డీ ట్రిలియన్ డాలర్లు దాటుతోంది. వాణిజ్య మిగులు (147 బిలియన్ డాలర్లు) విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) పరిస్థితి కూడా అమెరికాతో పోల్చితే కొంతలో కొంత మెరుగ్గా ఉంది.
ఇప్పటి అమెరికా పరిస్థితి చూస్తే 1987లో పాల్ కెనడీ తన పుస్తకం ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద గ్రేట్ పవర్స్’లో చెప్పిన విషయాలు గుర్తుకు రాకుండా ఉండవు. ఆర్థిక బలం, సైనికశక్తి, ప్రాబల్య విస్తరణ.. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయనీ.. ఒకనాడు ఆధిపత్యం నెరపి, ఆ తర్వాత దాన్ని కోల్పోయిన రాజ్యాలన్నిటినీ ఈ కోణం నుంచే చూడాలని చెప్పారు. ఆసియా ఖండం నుంచి అమెరికాకు సవాల్ ఎదురుకానుందని కూడా అప్పుడే హెచ్చరించారు. ఆ తర్వాత పరిణామాలన్నీ దాన్ని ధ్రువపరచే విధంగానే ఉన్నాయి. ఆసియాఖండ ఆర్థిక ఆధిపత్యం 2050 నాటికి ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే చాలా వచ్చాయి. దీన్ని మరో దృష్టి నుంచి చూస్తే 1820 నాటికి ప్రపంచ జీడీపీలో ఆసియా ఖండానికి ఉన్న స్థానం (56శాతం) తిరిగి లభిస్తున్నట్లుగా పరిగణించొచ్చు. అప్పట్లో ఆసియా ఖండానికి ముఖ్యంగా చైనా, భారత్‌లకు ఆర్థిక సంపదలో, వస్తూత్పత్తుల్లో సగభాగం ఉండేది. ఆర్థిక బలం సైనిక శక్తిని, ప్రాబల్య విస్తరణను నిర్ణయించటం నిజమైతే అమెరికా ఆ బలాన్ని కోల్పోయే రీతిలోనే అక్కడి వ్యవహారాలు సాగుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఉన్న ప్రాబల్యాన్ని కాపాడుకోటానికి మోహరించిన సైనికశక్తిని భరించగలిగే స్థాయిలో కూడా అమెరికా ఆర్థికశక్తి పుంజుకోవటం లేదు. 70కి పైగా దేశాల్లో 800 దాకా సైనిక కేంద్రాలను నిర్వహిస్తున్నప్పటికీ వాటిని ఆర్థికంగా భరించలేని స్థాయికి వెళుతోంది. నాటో కూటమికి నిధులను తామే అధికంగా ఎందుకు సమకూర్చాలని ట్రంప్ అప్పుడప్పుడూ చేసే వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదే.
సోవియట్ రష్యా కూటమితో అమెరికా 45 ఏళ్లపాటు ప్రచ్ఛన్నయుద్ధం సాగించినా అది సైనిక రంగానికే పరిమితం. ఆర్థికంగా సోవియట్ రష్యా అమెరికాకు ఇచ్చిన పోటీ అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు చైనాతోపాటు యువరక్తంతో ఉరకలేస్తున్న ఆసియా దేశాలు పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక బలాన్ని అతి వేగంగా సమకూర్చుకుంటూ ఆర్థికంగా విసురుతున్న సవాళ్లు సాధారణమైనవి కావు. వాటిని ఎదుర్కొనే సత్తాని సంతరించుకోటానికి అమెరికా తనది తిరుగులేని అగ్రరాజ్యమన్న భావనను వీడి తగు వ్యూహాలు రూపొందించుకోగలగాలి. ఏక దేశ ఆధిపత్యానికి రోజులు చెల్లిపోయాయని గుర్తించాలి. అలాంటి ఆలోచనలు రాజకీయరంగాన అక్కడ కనపడటం లేదు. అమెరికాకు అదే విషాదం! తగ్గుతున్న ఆర్థిక బలంతో ఇప్పటిదాకా ప్రపంచానికి బోధించిన సిద్ధాంతాలన్నీ అక్కడ బోర్లాపడుతుండటమే నిజం!
-రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Updated Date - Sep 12 , 2025 | 06:16 AM