ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Totapalli Gandhi: గాంధీ శకానికి వారసుడు

ABN, Publish Date - Sep 02 , 2025 | 12:23 AM

తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా పేరు గడించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే. బోయినపల్లి వేంకట రామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో సెప్టెంబర్ 2, 1920న రంగమ్మ, కొండల్ రావు పుణ్య దంపతులకు జన్మించారు...

‘తోటపల్లి గాంధీ’గా, ‘కరీంనగర్ గాంధీ’గా పేరు గడించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే. బోయినపల్లి వేంకట రామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో సెప్టెంబర్ 2, 1920న రంగమ్మ, కొండల్ రావు పుణ్య దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి వేంకట రామారావు చురుకైన విద్యార్థి. తండ్రితోను, ఇతర పెద్దలతోను చర్చల ద్వారా రాజకీయ సామాజిక స్థితిగతులను అవగతం చేసుకున్నారు. తోటపల్లిలో ప్రాథమిక విద్య అనంతరం రామారావుని పై చదువులకి కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు మార్పించారు. తర్వాత గోలకొండ పత్రిక సంపాదకులు, ప్రసిద్ధ సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి ప్రేరణతో, ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించే మెట్రిక్యులేషన్ పరీక్షను 1939లో రాసి ఉత్తీర్ణుడైనా ఆ తరువాత చదువులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మొదటి నుంచి చురుకైన, తెలివైన విద్యార్థి అయినందున తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకొన్నారు. ఆర్య సమాజ్ స్థాపకులు దయానంద సరస్వతి రచన ‘సత్యార్థ ప్రకాశం’ చదవడం వలన ఆర్య సమాజ్ భావాల పట్ల ప్రభావితుడైన రామారావు, ఆ భావాలను ప్రజలలో వ్యాప్తి చేయడానికి ‘నాటక సమాజం’, ‘భజనమండలి’ స్థాపించారు. నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. దేవుని పేరు మీద పశుబలులను నిరసించారు. శాకాహారం గురించి ప్రచారం చేశారు. వేదాలలోని లోటుపాట్లను ఎత్తిచూపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. తోటపల్లి గ్రామంలో 1946లోనే హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. రామారావు సారథ్యంలో 40 జంటలకు కులాంతర, మతాంతర వివాహాలు జరిగాయి. 50 మంది వితంతువులకు పునర్వివాహం జరిగింది.

గాంధీజీ ఆత్మకథను చదివి గాంధీజీ ఆశయాలకనుగుణంగా తన జీవిత విధానాన్ని మార్చుకున్నారు రామారావు. శాంతి, అహింస, శాకాహారం, సత్యాగ్రహం, గ్రామ స్వరాజ్యం వంటి అంశాలు రామారావు జీవితంలో ముఖ్య భాగాలయ్యాయి. మూగజీవుల రక్షణార్థం జంతుబలులు వద్దని చెప్తూ ‘జీవ రక్షక ప్రచారమండలి’ స్థాపించారు. 1945లో గాంధీ మద్రాస్ నుంచి వార్ధా వెళుతున్నపుడు కాజీపేట రైల్వే స్టేషన్‌లో దూరం నుంచి గాంధీజీని దర్శించుకోవడం తన జీవితంలో ముఖ్యమైన సంఘటనగా భావించారు రామారావు. కందుకూరి వీరేశలింగం పంతులును ఆదర్శంగా తీసుకొని సమాజంలోని బాల్యవివాహాలు, జోగినీ వ్యవస్థ, కుల వివక్ష, బహు భార్యత్వం మొదలగు దురాచారాల నిర్మూలనకు కృషి చేశారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర రాజ్యంగానే ఉంటుందని నిజాం ప్రభువు ప్రకటించినపుడు జాతీయవాదులైన తెలంగాణవాదులు, యోధులు పోరాటం చేశారు. అప్పుడు రామారావు కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉండవలసి వచ్చింది. నిజాం ప్రభుత్వం ఆయన కుటుంబసభ్యులను, బంధువులను ఇబ్బందులకు గురిచేసింది. వారి తండ్రి కొండల్రావును అరెస్ట్ చేసింది. 1945, అక్టోబర్ 1న, వారు నడుపుతున్న సంస్థలను మూసివేసింది. 1947 డిసెంబర్‌లో జమ్మికుంటలో రైల్వేట్రాక్ తొలగించే సందర్భంలో రామారావు, ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారు. చివరికి 1948, సెప్టెంబర్ 17న భారత సైనిక చర్య వలన హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత జైలు నుంచి ధీరుడిలా విడుదలైనారు రామారావు.

1962లో కరీంనగర్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి, జిల్లాలోని పలువురు కవులు, రచయితలకు పెద్దదిక్కుగా నిలిచారు. ఆయన స్వయంగా రచయితగా– ‘కరీంనగర్ జిల్లా దేవాలయాలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు’, ‘కరీంనగర్ జిల్లా సాహితీ చరిత్ర’, ‘ఆంధ్ర మహాసభల వృత్తాంతం’, ‘బి. వేంకటరామారావు గేయాలు–1’, ‘వేంకట రామారావు గేయాలు–2’, ‘కరీంనగర్ జిల్లా రచయితల పరిచయ గ్రంథం’, ‘బోవేరా వ్యాసాలు’, ‘గాంధీ తత్వాలు’, ‘సారస్వత జ్యోతి గ్రంథమాల–1’, ‘గ్రంథమాల–2’... తదితర పుస్తకాలు రాశారు. ‘సారస్వత జ్యోతి’ అనే మూడు ప్రత్యేక సాహిత్య సంచికలు వారి సంపాదకత్వంలో వచ్చాయి. ఇలా బహుముఖ ప్రజ్ఞతో నాటి తరానికి నేటి ప్రతినిధిలా, గాంధీజీ ఆశయాలు పాటిస్తూ తోటపల్లి గాంధీ, కరీంనగర్ గాంధీగా పేరు గడించిన బోయినపల్లి వేంకట రామారావు తన 95వ ఏట 27 అక్టోబరు 2014న అస్తమించారు. వారి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మానేరు నదీ తీరాన నిర్వహించింది. నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. వారి పేరున మానేరు నది తీరాన ఒక స్మృతివనం ఏర్పాటు చేయవలసి ఉంది. వారి శిలా విగ్రహమును కరీంనగర్ పట్టణంలో ఒక కూడలిలో నెలకొల్పవలసి ఉంది. కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడులా తెలంగాణ నేలలో కరీంనగర్ కేంద్రంగా ఒక సంఘసంస్కర్తలా కార్యక్రమాలు నిర్వర్తించారు బోయినపల్లి వేంకట రామారావు. వారిని ప్రత్యక్షంగా గమనించిన వారికి తెలుస్తుంది వారు గాంధీ శకానికి వారసులు అని.

-సబ్బని లక్ష్మీనారాయణ

(నేడు బోయినపల్లి వేంకట రామారావు 105వ జయంతి)

Updated Date - Sep 02 , 2025 | 12:23 AM