ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Children Vaccination: బాల్య టీకాలు

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:20 AM

ఒక మహా విపత్తు (కోవిడ్‌ మహమ్మారి) నుంచి అష్టకష్టాలతో బయటపడిన తరువాత కూడా నవజాత శిశువులు, బాల్యంలో ఉన్న పిల్లలు అందరికీ వ్యాధినిరోధక టీకాలు వేయడంలో సంపూర్ణ శ్రద్ధ చూపకపోవడాన్ని ఎలా గర్హించాలి?

క మహా విపత్తు (కోవిడ్‌ మహమ్మారి) నుంచి అష్టకష్టాలతో బయటపడిన తరువాత కూడా నవజాత శిశువులు, బాల్యంలో ఉన్న పిల్లలు అందరికీ వ్యాధినిరోధక టీకాలు వేయడంలో సంపూర్ణ శ్రద్ధ చూపకపోవడాన్ని ఎలా గర్హించాలి? భారత్‌లో పిల్లల టీకా కవరేజీ తగ్గుతోందని ‘ది లాన్సెట్‌ ’ జర్నల్‌ తాజాగా వెల్లడించింది. ఏడాది వయస్సులోగా విధిగా వేయవలసిన టీకా మొదటి డోసుకు కూడా నోచుకోని పిల్లల (జీరో–డోస్‌ చిల్డ్రన్‌) సంఖ్యలో భారత్‌ ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉన్నదని, అంతేకాకుండా పలు రాష్ట్రాలలోని అనేక జిల్లాలలో టీకా కవరేజీలో స్థానిక అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వ్యాధుల నుంచి మనలను కాపాడుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఐదు సంవత్సరాల దాకా ఆ రోగ నిరోధక శక్తి పూర్తి స్థాయిలో ఉండదు. ఈ దశలో విధిగా టీకాలు వేయవలసిన అవసరమున్నది. టీకాలతో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తిమంతమై అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. బాల్యంలో వేసిన టీకాల కారణంగానే మశూచికం, పోలియో మొదలైన వ్యాధుల నుంచి మానవాళి విముక్తమయింది. గత యాభై సంవత్సరాలలో 400 కోట్లకు పైగా బాలలకు టీకాలు వేయడం ద్వారా 15 కోట్లకు పైగా చిన్నారుల మరణాలను నివారించడం సాధ్యమయింది. వ్యాధులను వాటి వాటి హద్దుల్లో ఉంచుతున్న టీకాలను చిన్నపిల్లలకు సకాలంలో వేయడం తప్పనిసరి.

కారణాలు ఏవైనా ఈ విషయంలో 2010 నుంచి జరుగుతోన్న జాప్యం ఆ వ్యాధుల పునర్‌ విజృంభణకు దారితీస్తోంది. ఆ ప్రమాదఘంటికలనే ‘ది లాన్సెట్‌’ మోగించింది. 2023లో భారత్‌లో రెండు కోట్ల మందికి పై కొత్త శిశువులు జన్మించగా వారిలో జీరో–డోస్‌ పిల్లలు 6.2 శాతం మేరకు ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం 1992లో 33.4 శాతంగా ఉన్న జీరో–డోస్‌ బాలల శాతాన్ని 2016లో 10.1 శాతానికి తగ్గించడంలో భారత్‌ సఫలమయింది. కోవిడ్‌ విపత్తు పూర్వం 2019లో జీరో–డోస్‌ పిల్లల సంఖ్య 14 లక్షలుగా ఉన్నది. 2021లో ఈ సంఖ్య 27 లక్షలకు పెరిగి 2022లో 11 లక్షలకు తగ్గింది. 2023లో 14 లక్షలకు పైగా పెరిగింది. దీన్ని బట్టి పిల్లలకు సకాలంలో టీకాలు వేయడంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఎటువంటి మినహాయింపు లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు టీకా వేయడమనే లక్ష్యసాధన అసంపూర్ణంగానే ఉండిపోయిందని స్పష్టమవుతోంది. సకాలంలో టీకా పొందలేకపోతున్న చిన్నారులు పేద, అణగారిన వర్గాలకు చెందినవారై ఉండడం ఒక కఠోర సత్యం.

మారుమూల గ్రామీణ ప్రాంతాలు, అందుబాటులో లేని అటవీ ప్రాంతాల నివాసితులు అయిన ఎంతో మంది టీకాను సకాలంలో వేయించుకోలేకపోతున్నారు. మాతృమూర్తుల అవగాహనారాహిత్యం వారి బిడ్డలకు శాపంగా పరిణమిస్తోంది. కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా ముస్లింలలో టీకాల పట్ల సంకోచం కూడా జీరో–డోస్‌ పిల్లల సంఖ్య గణనీయంగా ఉండేందుకు కారణమవుతోంది. పౌర సమాజం ఓర్పు, నేర్పుతో ఈ టీకా సంకోచాన్ని తొలగించేందుకు, టీకాల పట్ల నిరక్షరాస్యులైన తల్లులలో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలి. ఒక జిల్లాలోనే ఇరుగు పొరుగు ప్రాంతాల మధ్య వ్యాక్సినేషన్‌ అసమానతలను తొలగించేందుకు, పుట్టిన ప్రతి బిడ్డకు సకాలంలో టీకా సదుపాయం లభించేందుకు గ్రామ సర్పంచ్‌లు, మునిసిపల్‌ చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహానుభూతితో కృషిచేయాలి. భారత్‌లో పిల్లలకు టీకా కవరేజీపై ది లాన్సెట్‌ వెల్లడించిన గణాంకాలు వాస్తవమైనవి కావని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. జీరో–డోస్‌ పిల్లల శాతం 2023లో 0.11 శాతం నుంచి 2024లో 0.06 శాతానికి తగ్గినట్టు చెప్పింది. గణాంకాలు ఎలా ఉన్నప్పటికీ టీకా సౌకర్యం పొందలేకపోతోన్న చిన్నారుల సంఖ్య లక్షల్లో ఉందనేది కొట్టివేయలేని సత్యం. ఏది ఏమైనా ది లాన్సెట్‌ వెల్లడించిన విషయాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇమ్యూనైజేషన్‌ ఎజెండా–2030ను పరిపూర్తి చేయడంలో తమ కృషి లోపానికి ఆక్షేపణగా మన పాలకులు భావించనవసరం లేదు. అలాగే పాలకులను తప్పుపట్టేందుకు ది లాన్సెట్‌ నివేదికను ఆధారం చేసుకోవడమూ సహేతుకం కాదు. కొత్త వైరస్‌లు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజారోగ్యానికి ముంచుకొస్తున్న కోవిడ్‌ తరహా ముప్పును ది లాన్సెట్‌ నివేదిక వెలుగులో అర్థం చేసుకోవాలి. వ్యక్తులకు, ప్రజా సమూహాలకు ఆరోగ్యప్రదమైన భవిష్యత్తును నిర్మించేందుకు సంపూర్ణ శ్రద్ధ చూపని పక్షంలో రోగగ్రస్త భవిష్యత్తే మనకు దాపురిస్తుంది.

Updated Date - Jul 01 , 2025 | 12:26 AM