ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Gavai Boot Attack: ఈ అధర్మదాడికి జవాబుదారీ ఎవరు?

ABN, Publish Date - Oct 10 , 2025 | 03:17 AM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్‌ కిశోర్‌ కాకుండా రహీమ్‌ ఖాన్‌ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది....

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్‌ కిశోర్‌ కాకుండా రహీమ్‌ ఖాన్‌ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది? ఆసక్తికరమైన ప్రశ్న, సందేహం లేదు. పాల్పడిన అపరాధానికి శిక్షించకుండా అతడిని వదిలివేయడం జరిగేది కాదు. జాతీయ భద్రతా చట్టం, (కశ్మీరీ ముస్లిం అయి ఉంటే) ప్రజా భద్రత చట్టం, బహుశా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా అతడు తప్పక అభియోగాలను ఎదుర్కోవలసివచ్చేది. నాగరిక సంస్కారం లోపించిన ప్రజాభిప్రాయం నేర న్యాయ విచారణ ప్రక్రియను ప్రభావితం చేయగల విద్వేషపూరిత, సంకుచిత సంఘర్షణలు ప్రబలంగా ఉన్న సామాజిక పర్యావరణ వ్యవస్థపై దృష్టి పెట్టేలా ప్రజలను పురిగొల్పేందుకే నేను ఆ ప్రశ్నను సంధించాను. సీజేఐపై బూటు దాడికి దారితీసిన ఘటనల క్రమాన్ని నిశితంగా చూద్దాం. ఖజురహోలోని ఒక ఆలయంలో విరిగిన విష్ణుమూర్తి ప్రతిమ నొకదానికి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌ కొట్టివేశారు. ఆ సందర్భంగా ‘ఇది, ప్రచార కండూతితో దాఖలు చేసిన పిటిషన్‌’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘పిటిషనర్‌ విష్ణువుకు భక్తవరేణ్యుడు అయితే ఆయనే దేవుడిని ప్రార్థించాలి, కొంచెం ధ్యానం చేయాలి’ అని కూడా గవాయ్‌ అన్నారు. ఒక విధంగా వెటకారం ధ్వనిస్తున్నట్టుగా ఉన్న ఆయన మాటలు పూర్తిగా అనవసరమైనవి. అయితే అవి విచారణలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఖజురహోలో విష్ణు ప్రతిమ పునఃప్రతిష్ఠాపన కోర్టు పరిధిలోని అంశం కాదని, దానిపై నిర్ణయం తీసుకోవల్సింది భారత పురావస్తు సర్వే అని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

సర్వోన్నత న్యాయస్థానం సహేతుక తీర్పులు చదివే విజ్ఞత, సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతుండే రాజకీయ, సైద్ధాంతిక సేనా శ్రేణులకు దురదృష్టవశాత్తు పూర్తిగా కొరవడింది. ఖజురహో విష్ణుమూర్తి విగ్రహంపై సీజేఐ వ్యాఖ్యలు మితవాద రాజకీయ, సైద్ధాంతిక బృందాల నుంచి అనియంత్రిత ఆగ్రహావేశాల ప్రతిస్పందనలను వెల్లువెత్తించాయి. దేశ పాలకుల అండదండలు ఉన్నందునే ఈ మితవాద శ్రేణులు అలా రెచ్చిపోయాయి. వ్యూహాత్మకంగా వెల్లువెత్తిన ఈ ‘ప్రజాగ్రహం’తో తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం సీజేఐకి అనివార్యమయింది. ‘తాను మతాలను విశ్వసిస్తానని, అన్ని మతాల ఆరాధనా మందిరాలను సమరీతి భక్తి ప్రపత్తులతో సందర్శిస్తుంటానని, ‘నిజమైన లౌకికవాదం’లో తనకు సంపూర్ణ నమ్మకం ఉందని’ గవాయ్‌ అన్నారు. అయితే ఈ వివరణ సామాజిక మాధ్యమాలలో ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్న కరడుగట్టిన మితవాదులను సంతృప్తిపరచలేదు. సరికదా మరింత తెగింపుతో మీమ్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లు, యూట్యూబ్‌ వీడియోలతో సీజేఐ గవాయ్‌పై తమ దాడిని కొనసాగించారు. ఈ ఆవేశపూరిత వాతావరణంలో 71 సంవత్సరాల సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌, సుప్రీంకోర్టులో సీజేఐ గవాయ్‌పై బూటును విసిరివేయడం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయదలుచుకున్నాడు. ‘సనాతన్‌ ధర్మ కా అప్మాన్‌, నహి సహేగా హిందుస్థాన్‌!’ (సనాతన ధర్మానికి అవమానం కలిగితే భారతదేశం సహించదు) అని వ్యాఖ్యానించాడు. తనపై దాడి పట్ల జస్టిస్‌ గవాయ్‌ సంయమనంతో వ్యవహరించి, విచారణ విధులు కొనసాగించారు. బూటు విసిరిన సనాతనవాదిపై కేసు దాఖలు చేసేందుకు తిరస్కరించారు. తన అనాగరిక చర్యపట్ల రాకేశ్‌ కిశోర్‌లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. తనకు లభించిన ‘ప్రఖ్యాతి’కి ఆనందిస్తూ ‘అటువంటి పని మళ్లీ చేస్తాను’ అని కూడా రాకేశ్‌ కిశోర్‌ అన్నాడు. ఈ మహాశయుడిపై స్వయంగా చర్య చేపట్టవలసిన ఢిల్లీ పోలీసులు సీజేఐపై బూటు దాడి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయారు. దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ మరింత నిర్భయంగా ఏవేవో మాట్లాడడం కొనసాగిస్తున్నారు.

తన చర్యను సమర్థిస్తున్న వారి నుంచి మరింతగా ప్రశంసలు అందుకుంటున్నారు. సమాజ జీవితం నుంచి బహిష్కరణకు గురికావల్సిన అపరాధికి ఇటువంటి వైభవం లభించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సీజేఐపై దాడిపట్ల న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ మౌనంగా ఉండిపోయారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఘటన సంభవించిన ఎనిమిది గంటల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. ‘ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మన సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావులేదు. ఇది పూర్తిగా ఖండించదగినది’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. స్వాగతించాల్సిన మాటలు, సందేహం లేదు. అయితే ఈ సందర్భంలో ఒక పాత విషయాన్ని గుర్తు చేసుకోవల్సిన అవసరమున్నది. 2019లో నాథూరామ్‌ గాడ్సేను బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ కొనియాడారు. దీనిపై మోదీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను పూర్తిగా క్షమించలేనని అన్నారు. అయితే ఆ బీజేపీ ఎంపీపై ప్రభుత్వం గానీ, పార్టీ గానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. మరింత గందరగోళానికి ఆస్కారమివ్వకుండా ప్రగ్యా ఠాకూర్ తన పార్లమెంటు సభ్యత్వ కాలాన్ని పూర్తిచేశారు. ఆమె హిందూత్వ భావజాల అనుయాయి. కనుకనే గాడ్సేను మెచ్చుకోవడానికి వెనుకాడలేదు. ఆ మాటకు వస్తే సంఘ్‌ పరివార్‌ ఇప్పటికీ గాడ్సే ఆరాధన నుంచి తనను తాను దూరం చేసుకోలేదు. తాను సనాతన ధర్మ ‘రక్షకుడు’నని చెప్పుకున్న రాకేశ్‌ కిశోర్‌ కూడా సంఘ్‌ పరివార్‌ భావజాల వ్యవస్థలో భాగమే కదా. మహాత్ముడిని హతమార్చేందుకు గాడ్సే తుపాకీ పేల్చగా రాకేశ్‌ కిశోర్‌ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు సాపేక్షంగా మృదు ఆయుధమైన ఒక బూటును ఉపయోగించుకున్నాడు. ఈ రెండు ఘటనల్లోనూ అసహన మనస్తత్వమే ప్రస్ఫుటమయిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ‘హిందువుల మనోభావాలు’ దెబ్బతిన్నాయన్న వ్యక్తిగత అవగాహనతోనే నాడు గాడ్సే, నేడు రాకేశ్‌ కిశోర్‌ అనుచిత చర్యలకు పాల్పడ్డారు. తమ మనోభావాలకు కలిగిన విఘాతంతో ఇరువురి భావోద్వేగాలు హింసాత్మకంగా పరిణమించాయి.

మరి ఈ ప్రచండ హిందూత్వ వాదులు ‘San Tan Se Juda’ (ఇస్లామ్‌ను దూషించినందుకు శిక్ష శరీరం నుంచి తలను నరికివేయడం) అని నినదించే ఇస్లామిస్టుల నుంచి ఎలా భిన్నమైనవారు? మనోభావాలు దెబ్బతినడం అన్నది ఒక మత సమూహానికే పరిమితం కాక, భిన్న మత సమూహాలలో పరివ్యాప్తమై ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో సీజేఐపై బూటు దాడిని మాత్రమే ఖండిస్తే సరిపోదు. మనోభావాల విఘాతానికి హింసాత్మకంగా ప్రతిస్పందించడం సమర్థనీయం కాదు. అది పూర్తిగా గర్హించవలసిన విషయం. సీజేఐపై బూటు దాడి వ్యవహారంలో మరో సమస్యాత్మక కోణం ఉన్నది. భారత ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో దళితుడు జస్టిస్‌ గవాయ్‌. నవ బౌద్ధ సంప్రదాయం, అంబేడ్కర్‌ భావజాలాన్ని విశ్వసించే ఒక రాజకీయ కుటుంబం నుంచి ఆయన ప్రభవించారు. జస్టిస్‌ గవాయ్‌ తండ్రి భారతీయ రిపబ్లికన్‌ పార్టీ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. జస్టిస్‌ గవాయ్‌ భారత ప్రధాన న్యాయమూర్తి కావడం సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు లభించాలన్న అంబేడ్కర్‌ స్వప్నసాకారానికి చిహ్నంగా భావించవచ్చు. దళిత ఉద్యమంలో కుటుంబ మూలాల కారణంగా జస్టిస్‌ గవాయ్‌ మొదటి నుంచి మితవాదుల దాడులకు గురవుతున్నారు. ఏడాది క్రితం ‘బుల్డోజర్‌ న్యాయం’పై ఆయన తన తీర్పు వెలువరించినప్పుడు మితవాద బృందాల నుంచి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ‘బుల్డోజర్‌ న్యాయం’ను అమలుపరచడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అగ్రగామిగా ఉన్నది. దృఢమైన, రాజీపడని హిందూత్వ ప్రభుత్వమది. మరి ‘బుల్డోజర్‌ న్యాయం’కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జస్టిస్ గవాయ్‌పై హిందూత్వవాదులు ధ్వజమెత్తడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ నేపథ్యంలో సీజేఐపై బూటు దాడి వెనుక ఉన్న లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి.

జనసమ్మతంగా ఉన్న రాజ్యాంగబద్ధ పాలనా వ్యవస్థలో ‘సనాతన ధర్మ’ ఆధిక్యతను నెలకొల్పేందుకు జరిగిన ప్రయత్నమే జస్టిస్‌ గవాయ్‌పై బూటు దాడి. న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ తన బూటు దాడిలో కేవలం జస్టిస్‌ గవాయ్‌ని మాత్రమే కాకుండా వివేకవంతమైన, న్యాయ బద్ధంగా, వివక్షారహితంగా పనిచేస్తున్న న్యాయవ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ నిష్పాక్షిక న్యాయవ్యవస్థను బెదిరించేందుకు, బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమే ఆ దాడి. న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ చర్య ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించేందుకై ఒక పథకం ప్రకారం జరిగిన ప్రయత్నమే ఆ బూటు దాడి. తద్వారా అది ఒక రాజకీయ లక్ష్యాన్ని విస్పష్టంగా ప్రకటించింది. ఆ లక్ష్యమేమిటో ప్రజలు అందరూ గ్రహించాలన్న ధ్యేయంతోనే న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ తెంపరితనంతో ఆ చర్యకు పాల్పడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితం అయితే అతడిని మన సమాజంలో అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యంగా లేని ఒక భావజాల అనుయాయిగా పరిగణించి ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. సమాన పౌరసత్వం ప్రాతిపదికన పనిచేస్తున్న రాజ్యాంగబద్ధ పాలనా వ్యవస్థ స్థానంలో హిందూత్వ భావజాలంతో నడిచే పాలనా వ్యవస్థను నెలకొల్పడానికి ఆరాటపడుతున్న మెజారిటేరియన్‌ ప్రపంచ దృక్పథానికి అతడు ప్రతినిధి. అందుకే ఆ బూటు దాడి చాలా ప్రమాదకరమైనది, సమర్థించరానిది. బహుళ మతాలు విలసిల్లుతున్న సమాజంలో పాలనా వ్యవస్థ మత విశ్వాసాలకు అతీతంగా ఉండాలి. మతపరమైన మనోభావాలకు విఘాతం కలిగిందనే నెపంతో పాల్పడే ఎటువంటి హింసాత్మకచర్యలనైనా ప్రతి ఒక్కరూ నిర్ద్వంద్వంగా ఖండించాలి.

-రాజ్‌దీప్‌ సర్దేశాయి

Updated Date - Oct 10 , 2025 | 03:17 AM