ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Glimpse into Ladakh: లద్దాఖ్‌పై చిన్నచూపు

ABN, Publish Date - Sep 20 , 2025 | 05:51 AM

కోట్లాది ప్రజలకు జీవధారను అందిస్తున్న నదులకు జన్మ స్థలంగా ఉన్న లద్దాఖ్‌ మూడో ధ్రువంగా పేరుపొందింది. అటువంటి సున్నిత కీలక ప్రాంతంలో పర్యావరణ పరంగా...

కోట్లాది ప్రజలకు జీవధారను అందిస్తున్న నదులకు జన్మ స్థలంగా ఉన్న లద్దాఖ్‌ ‘మూడో ధ్రువం’గా పేరుపొందింది. అటువంటి సున్నిత కీలక ప్రాంతంలో పర్యావరణ పరంగా, జీవనరీతుల పరంగా తమ ప్రత్యేకతలను కాపాడుకునేందుకు దశాబ్దాలుగా లద్దాఖీలు స్వతంత్ర అస్తిత్వానికి ఆరాటపడుతున్నారు. దేశ సరిహద్దుల్లో, అందునా చైనా, పాకిస్థాన్‌ నడుమ ఉన్న ప్రాంతం కావడంతో పాలకులు వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు సుముఖత చూపలేదు. 2019 అనంతరం మారిన పరిస్థితుల్లో వారి అస్తిత్వ ఆరాటాలు కొత్త శక్తిని సంతరించుకున్నాయి. నిన్న మొన్నటి దాకా జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉండి ఇప్పుడు కేంద్ర ప్రాంతం (యుటి)గా ఉన్న లద్దాఖ్‌ ప్రజలు నాలుగు డిమాండ్లు చేస్తున్నారు: లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి; భారత రాజ్యాంగం ఆరవ షెడ్యూల్‌లో లద్దాఖ్‌ను చేర్చడం; లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు; లద్దాఖ్‌కు రెండు పార్లమెంటరీ సీట్లు (ఒకటి లేహ్‌కు, మరొకటి కార్గిల్‌కు) కోరుతున్నారు. విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ నాయకత్వంలో ఈ డిమాండ్లపై గత రెండు సంవత్సరాలుగా లద్దాఖ్‌ ప్రజలు పోరాడుతున్నారు. అవి న్యాయబద్ధమైన ఆకాంక్షలేనని, వాటిని నెరవేరుస్తామని భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రక, 2020 స్థానిక కౌన్సిల్స్‌ ఎన్నికలకు తన మ్యానిఫెస్టోలలో వాగ్దానం చేసింది. ఆ హామీ ఒట్టి మాటగా మిగిలిపోయింది. రాజ్యాంగ నైతికతకు రాజకీయ అనైతికత గ్రహణం పట్టింది.

వాంగ్‌చుక్‌ ఈ నెల 10 నుంచి లేహ్‌లో 35 రోజుల నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇది ఆయన ఐదవ నిరశన వ్రతం. ప్రతిసారీ తన దీక్షా వ్యవధిని ఒక వారం రోజుల చొప్పున పెంచుతూ వస్తున్నారు. వచ్చే నెలలో లేహ్‌, కార్గిల్‌ అటానమస్‌ హిల్‌ డెవెలప్‌మెంట్‌ కౌన్సిల్స్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లద్దాఖ్‌ ప్రజలు మళ్లీ ఉద్యమిస్తున్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రతిస్పందన వచ్చే అవకాశాలు లేవు. నిజానికి లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే ప్రసక్తే లేదని రెండేళ్ల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెగేసి చెప్పారు. లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చకుండా యుటిగా కొనసాగిస్తే బయటి నుంచి వచ్చిన బ్యూరాక్రాట్లు ఇక్కడి కొండలు, లోయలు, విలక్షణ పర్యావరణ వ్యవస్థను కార్పొరేట్లకు విక్రయిస్తారని, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింలో సంభవించిందే ఇక్కడా వాటిల్లడం ఖాయమని వాంగ్‌చుక్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ న్యాయం కోసం లద్దాఖ్ ప్రజల పోరాటం పూర్తిగా గాంధేయ పద్ధతులలో జరుగుతోంది. అయినా కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి భారత ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందా? శోభనిస్తుందా? విద్యారంగంలో, వాతావరణ మార్పు వైపరీత్యాలను అరికట్టడంలో ప్రశస్త కృషి ద్వారా అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ప్రజా మేధావి సోనం వాంగ్‌చుక్‌ తమకు ప్రత్యర్థి అయిన ఒక ప్రతిపక్ష నాయకుడులా కేంద్ర ప్రభుత్వం ఆయన పట్ల వ్యవహరించడం గర్హనీయం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేయడాన్ని నేరంగా పరిగణించడం ఎలా రాజ్యాంగబద్ధం? దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను జాతీయ భద్రత, పర్యావరణంపరంగా కీలక ప్రాంతమైన లద్దాఖ్‌ వాసులకు ఎందుకు కల్పించరు? రాష్ట్ర ప్రతిపత్తి కల్పించని పక్షంలో లద్దాఖ్‌లో ప్రజాస్వామ్యం ఎలా వర్థిల్లుతుంది? లద్దాఖ్‌ ప్రజల రాజ్యాంగ న్యాయ ఆరాటం పట్ల దేశ పాలకులు తమ ఉదాసీనతను కొనసాగిస్తే అది ఒక మహాతప్పిదమూ మహాపరాధమూ అవుతుంది. లద్దాఖీలకు సహానుభూతి, సంఘీభావం తెలుపడం సమస్త భారతీయుల నైతిక కర్తవ్యం. ఈ కర్తవ్యపాలన సరిగా లేకపోవడం కూడా దేశ పాలకుల ఇష్టారాజ్యం యథేచ్ఛగా కొనసాగడానికి కారణమవుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించడమనేది ప్రతి పౌరుని ఆంతరంగిక ప్రేరణ కావాలి. ఈ నైతిక నియమంతోనే రాజ్యాంగ న్యాయం సమస్త ప్రాంతాలకు, సకల సామాజిక వర్గాలకు సమరీతిలో లభించేందుకు ఆస్కారముంటుంది.

Updated Date - Sep 20 , 2025 | 05:51 AM