Teachers: జ్ఞానప్రదాతలు
ABN, Publish Date - Sep 05 , 2025 | 12:29 AM
దేశ అభివృద్ధి, సమాజ నిర్మాణం, విద్యార్థుల భవిష్యత్, మానవ విలువలు, మూర్తిమత్వం, మానవత్వం, సామాజిక స్పృహ, ఓర్పు, నేర్పు, అన్నిటికీ మూలం గురువు....
దేశ అభివృద్ధి, సమాజ నిర్మాణం, విద్యార్థుల భవిష్యత్, మానవ విలువలు, మూర్తిమత్వం, మానవత్వం, సామాజిక స్పృహ, ఓర్పు, నేర్పు, అన్నిటికీ మూలం గురువు. ఏ దేశమైనా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఆర్థికరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు, నీటిపారుదల రంగం, రక్షణశాఖ, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు... ఇలా ప్రతి రంగంలోని వ్యక్తులూ విద్యావంతులు కావల్సిందే. వీరిని తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయుడే, అంటే దేశాభివృద్ధికి కారకుడు గురువే. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా నేడు జరుపుకొనే ఉపాధ్యాయ దినోత్సవం ఒక ఉపాధ్యాయుని జ్ఞానానికి, త్యాగానికి ప్రతిఫలం. డా. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సన్మానాలు, అవార్డులు పొందారు. 27సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ అయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న పొందారు. ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం, ఆయన సాధించిన అవార్డులు, పేరు ప్రఖ్యాతులు, విద్యా రంగానికి చేసిన సేవలే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇస్తారు. బాధ్యతలను, కర్తవ్యాలను, తెలివితేటలను, శక్తిని, యుక్తిని, శాంతిని, ధర్మాన్ని, తన దగ్గరున్న అపార అనుభవాన్ని నరనరాన నింపి, శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు విద్యార్థులలో జ్ఞానాన్ని చెక్కేది ఉపాధ్యాయుడే. సాంకేతికత ఎంత పెరిగినా, అర చేతిలో ప్రపంచం మొత్తం కనపడేలా ఫోన్లు, నెట్‌వర్క్‌లు ఉన్నా కూడా, కొన్ని విషయాలను ఆయనే నేర్పగలడు. సమాజంలో మంచి పౌరులు తయారవ్వాలన్నా, యువత స్వావలంబన వైపు నడవాలన్నా, ప్రగతి సాధించాలన్నా, శాంతియుతంగా, ఐకమత్యంగా ఉండాలన్నా, దేశభక్తి పెంపొందాలన్నా, మానవత్వం అలవర్చుకోవాలన్నా గురువు బోధనే ముఖ్యం. కొన్ని దేశాలలో గురువుల స్థానం ఆ దేశంలోని వీఐపీలతో సమానంగా ఉంది. మన దేశంలో కూడా వారికి సమున్నత స్థానం కల్పించాలి.
– సయ్యద్ జబీ, టీజీవో సెక్రటరీ, సిరిసిల్ల
Updated Date - Sep 05 , 2025 | 12:29 AM