ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kachchathivu Island: కచ్చాతీవు వలలో భారత జాలరి

ABN, Publish Date - Jul 20 , 2025 | 12:57 AM

తమిళనాట శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పొదిలో దాచిపెట్టిన ఆయుధాల తుప్పు వదిలించి..

Kachchathivu Island

మిళనాట శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పొదిలో దాచిపెట్టిన ఆయుధాల తుప్పు వదిలించి, మళ్లీ పదునుపెట్టే ప్రక్రియ జోరందుకుంది. వాటిలో కీలకమైనది కచ్చాతీవు దీవి వివాదం. ఎప్పుడో శ్రీలంకకు ధారపోసిన ఆ దీవి– భారతీయ, ప్రత్యేకించి తమిళనాడుకు చెందిన మత్స్యకారుల పట్ల మరణశాసనం లిఖిస్తున్న నేపథ్యంలో– ఈ సమస్యకొక తార్కిక పరిష్కారం తప్పదన్న దృఢాభిప్రాయం వేళ్లూనుకుంటోంది. బాధ్యత ఎవరిదైనా, బాధితులు సామాన్య జాలర్లే. వలలో నుంచి వారిని విడిపించవలసిందే. కానీ ప్రతిసారీ ఎన్నికల వేళనే ఈ అంశం తెరమీదకు రావడం. తరువాత మరుగునపడిపోవడం పరిపాటైపోయింది. తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ మరోమారు కచ్చాతీవు అస్త్రాన్ని ప్రయోగించారు. కచ్చాతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఎప్పుడో తీర్మానం ఆమోదించినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటూ బుధవారం విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకుని, సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అంతవరకు బాగానే ఉన్నా, చివరకు వివాదజలాల్లో ఓట్ల వేటగానే ఈ అంశం మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ.

సంబంధిత పార్టీలు పుష్కలంగా రాజకీయ పంట పండించుకుంటున్న కచ్చాతీవు, వాస్తవంలో నిర్మానుష్య బంజరు దీవి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తిష్టవేసి బలోపేతం అయ్యే దిశలో చైనా దూకుడు, మరోవైపు తమ జలాల్లోకి దూసుకొస్తున్నారంటూ సముద్రంలో వేటకు వెళుతున్న తమిళనాడు జాలర్లను శ్రీలంక తీర రక్షక దళాలు అరెస్టులు చేయడం, వారి మర పడవలను స్వాధీనం చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడీ దీవి చుట్టూ అల్లుకున్న వివాదం అగ్నిపర్వతమై పేలుతోంది. ఆ రాష్ట్రంలోని... ముఖ్యంగా రామనాథపురం, నాగపట్టణం, తంజావూరు, పుదుకొట్టాయ్‌లకు చెందిన నాలుగువేల మందికి పైగా జాలర్లను శ్రీలంక నేవీ గత పదేళ్లలో అరెస్టు చేసింది. వారికి చెందిన 600కు పైగా బోట్లను స్వాధీనపరచుకుంది. తమిళనాడు జాలర్ల మీద కాల్పులు జరిపిన సందర్భాలు, ఆ కాల్పుల్లో వారు దుర్మరణం పాలైన ఘటనలు ఎన్నో! అందుకే ఇది చిన్న సమస్య ఏమీ కాదు. కచ్చాతీవు దీవిని అప్పనంగా శ్రీలంకకు అప్పగించి, సముద్ర జలాల్లో సరిహద్దు గీతలు గీయడం ద్వారా ఈ సంక్షోభానికి నాటి కాంగ్రెస్‌–డీఎంకే ప్రభుత్వాలు కారణమయ్యాయని, ఈ అరాచకానికి మొత్తం బాధ్యత వాటిదేనని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆనాటి ఒప్పందాన్ని కాంగ్రెస్‌ సమర్థిస్తుండగా, అందులో భాగస్వామి అయిన డీఎంకే మాత్రం తమకేమీ తెలియదని, తమ పాపమేదీ లేదని అంటోంది. ఇంతకీ తప్పొప్పులు ఎవరివి? భారత్‌, శ్రీలంక మధ్య పాక్‌ జలసంధిలో ఉన్న 285 ఎకరాల చిన్న దీవి ఇది. దీని పొడవు 1.6 కిలోమీటర్లు. వెడల్పు 300 మీటర్లు. ఇది, రామేశ్వరానికి దాదాపు 33 కిలోమీటర్ల ఈశాన్యంలో ఉంది.

హిందూ మహాసాగరం మధ్యలో ఉందన్నమాటే కానీ, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవు. సెయింట్‌ ఆంటోనీ చర్చిని మినహాయిస్తే, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలూ లేవు. అడపాదడపా పర్యాటకులు వచ్చి పోవడమే తప్ప, ఇది జనావాస ప్రాంతమే కాదు. వార్షికోత్సవం మినహాయిస్తే ఆ చర్చి సైతం ఏడాది పొడవునా దాదాపు మూతపడే ఉంటుంది. 17వ శతాబ్దంలో జాఫ్నా సంస్థానం పరిధిలో ఉన్న ఈ కచ్చాతీవు దీవి, తర్వాతి కాలంలో రామనాథపురంలోని రాజారామనాధ సేతుపతి జమీందార్‌ చేతుల్లోకి చేరింది. బ్రిటిష్‌ వారి పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం జమీందారీల వ్యవస్థ రద్దు తర్వాత, తమిళనాడు ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. ఈ దీవి ప్రాంతంలో చేపల వేట విషయంలో భారత్‌, శ్రీలంక 1921 నుంచి తగాదా పడుతూనే ఉన్నాయి. ఇరుగు–పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకునే ప్రక్రియలో భాగంగా 1974 జూన్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండార నాయకేతో దీనిపై అంగీకారం కుదుర్చుకున్నారు. ఆడమ్స్‌ బ్రిడ్జి వరకు గల సముద్ర జలాల్లో సరిహద్దు రేఖ గీస్తూ, ఈ దీవి మీద సర్వాధికారాలను శ్రీలంకకు కట్టబెడుతూ ఆనాడు నాయకులు ఇద్దరూ ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండేళ్ల తర్వాత, 1976లో అది అమల్లోకి వచ్చింది. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి ఎరుకతోనే ఒప్పందం కుదిరిందని, రాజకీయ కారణాలతో ఆయన దానికి బహిరంగ మద్దతు మాత్రం ప్రకటించలేదని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేసిన ఆర్‌. కన్నన్‌ తన పుస్తకం... ‘డీఎంకే ఇయర్స్‌: అసెంట్‌, డిసెంట్‌, సర్వైవల్‌’లో స్పష్టం చేశారు. అదేమీ తనకు తెలియనట్లే ఇప్పుడు స్టాలిన్‌ వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. ఆనాటి ఒప్పందం ప్రకారం... తమిళనాడుకు చెందిన జాలర్లు చేపల వేట సందర్భంగా విశ్రాంతి తీసుకోవడానికి, వలలను ఆరబెట్టుకోవడానికి మాత్రమే కచ్చాతీవును ఉపయోగించుకోవాలి.

సెయింట్‌ ఆంటోనీ చర్చి కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవచ్చు. దీవి వద్ద మత్స్య సంపద మీద వారికి ఎలాంటి హక్కూ లేదు. అదంతా శ్రీలంక సర్కారుకు ధారాదత్తం. ఈ నిబంధనలే తమిళనాడు జాలర్ల పాలిట శాపంగా మారాయి. సముద్రంపై గీత, వారి తలరాతనే తిరగరాసింది. వారి జీవనాధారాన్ని చెరిపివేసింది. వేటలో పడి జాలర్లు ఏ మాత్రం ముందుకు వెళ్లినా.. అంతర్జాతీయ జల సరిహద్దుల అతిక్రమణ పేరిట శ్రీలంకలో జైళ్ల పాలవుతున్నారు. పరిస్థితి తీవ్రతను తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అప్పట్లోనే గ్రహించారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఒక దేశం మరో దేశానికి ఎలాంటి భూభాగాన్నీ బదిలీ చేయడానికి వీలులేదని, అందువల్ల కచ్చాతీవు భారత్‌కే చెందుతుందని ప్రకటించాలని కోరుతూ.. 2008లో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాస్తవంలో, భూబదిలీని అప్పటి కేంద్ర క్యాబినెట్‌ కానీ, పార్లమెంట్‌ కానీ ఆమోదించిన దాఖలాలు సైతం లేవు. తమిళనాడు సర్కారు తరఫున ఆనాడు జయలలిత దాఖలు చేసిన పిటిషన్‌ మీద సెప్టెంబర్‌ 15న సుప్రీంకోర్టు విచారణ జరపనుండటం ఈ సందర్భంగా కీలకాంశం. ఉభయ దేశాల మధ్య ఒప్పందం అంటూ కుదిరాక.. అది అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వచ్చేసినట్టే. అందువల్ల దీనిపైన సుప్రీంకోర్టు కూడా చేసేదేమీ ఉండదు. ఇది ముగిసిన అధ్యాయమని, కచ్చా తీవును తిరిగి పొందాలంటే శ్రీలంకతో యుద్ధం అవసరమవుతుందని 2014 ఆగస్టులో అప్పటి అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టులోనే స్పష్టం చేశారు. అలాగని ఆశలన్నీ వదిలేసుకోవాల్సిన పని కూడా లేదు. సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలు ఇప్పటికీ ఉన్నాయి. కచ్చాతీవును శ్రీలంకకు అప్పగించడానికి ముందు వరకు తమిళనాడు జాలర్లు ఆ ప్రాంతంలో 24 నాటికల్‌ మైళ్ల దూరం వరకు వెళ్లి, చేపలు వేటాడేవారు. ఒప్పందం తర్వాత అది 12 నాటికల్‌ మైళ్లకు కుదించుకు పోయింది. ఏ మాత్రం గీటు దాటినా, వారు శ్రీలంక నేవీ వలకు చిక్కి, చేపల్లా గిలగిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇదివరకటిలాగే 24 నాటికల్‌ మైళ్ల దూరం వరకు చేపల వేటకు అనుమతించాలన్న తమిళనాడు జాలర్ల డిమాండ్‌ సమంజసమైనదే. దీనిపై శ్రీలంక ప్రభుత్వంతో మోదీ సర్కారు చర్చించాలి.

మరో దారి ఉంది... పాక్‌ జలసంధిలో మూడు రోజులపాటు శ్రీలంక జాలర్లకు, మరో మూడు రోజులపాటు భారత జాలర్లకు చేపల వేటకు అనుమతించవచ్చు. ఒకరోజు సెలవు ప్రకటించవచ్చు. ఇంకో దారీ లేకపోలేదు. ఉభయ దేశాల జాలర్లతో సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. సాగర జీవావరణ– పర్యావరణాలకు ఎలాంటి హాని కలగని రీతిలో, ఆధునిక పద్ధతుల్లో, పరస్పర సమన్వయంతో చేపల వేట సాగించే మార్గాలు అన్వేషించాలి. ఇలాంటి చర్యల వల్ల ఏ పక్షమూ కోల్పోయేదేమీ ఉండదు. సాగర జలాల్లో వివాదాల వేటను మాని, రెండు దేశాల ప్రభుత్వాలు ఈ దిశలో చిత్తశుద్ధితో కృషి చేస్తే... దశాబ్దాల సమస్యల వలలో నుంచి జాలర్లు సురక్షితంగా బయటపడతారు.

-పి.దత్తారాం ఖత్రీ సీనియర్‌ జర్నలిస్టు

Updated Date - Jul 20 , 2025 | 01:05 AM