Caste Discrimination: అస్తిత్వరాహిత్యంలో ఉపకులాలు, తెగలు
ABN, Publish Date - Aug 07 , 2025 | 05:37 AM
సంక్లిష్టతల్ని గుర్తించి వాటిని తగ్గించడమే మానవ ధర్మం. వాటిని పెంచేవారూ ఉంటారు. తమ కులాలు, సమూహాలు మాత్రమే అధికారం
సంక్లిష్టతల్ని గుర్తించి వాటిని తగ్గించడమే మానవ ధర్మం. వాటిని పెంచేవారూ ఉంటారు. తమ కులాలు, సమూహాలు మాత్రమే అధికారం చెలాయించాలని, ప్రజల స్థాయిని తగ్గించి అణచివేయ జూసే శక్తులు అనేకం. అవి పెరిగిపోతున్న సందర్భంలో మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కింది వర్గాలలోని ఒక సామాజిక వ్యవస్థ అల్లకల్లోలానికి గురవుతున్నది. దానిని పట్టించుకోలేకపోవడం, గుర్తించకపోవడం అప్రజాస్వామికం. అలాంటి ఒక సమస్య ఉప తెగ, ఉప కుల సమస్య. బలమైన కులాలు తెలివిగా తమ పబ్బం గడుపుకుంటాయి. అధికారాన్ని చెలాయిస్తాయి. అధికార వ్యవస్థలో భాగం అవుతాయి. ప్రభుత్వాలతో అంటకాగి ఎదుగుతాయి. అది ముస్లింల పాలనలో, క్రైస్తవుల పాలనలో, హిందూ రాజుల కాలం నుంచి కొనసాగుతున్నది. అయితే సమాజం తనదైన శైలిలో కొన్ని ఆచారాలు, వెనుకబాటుతనం, సంక్లిష్టతలను మానవీయంగా మార్చుకుంటుంది.
ఆ క్రమంలో కొత్త ఉప వ్యవస్థలను, తీరులను నెలకొల్పుకుంటుంది. మరి అది సహజ న్యాయసూత్రాల కనుగుణంగా జరుగుతుంది. అమానవీయత అధికంగా పెరిగినప్పుడు సమాజంలో ఘర్షణ, యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయి. రాజ్యాధికారం, పాలన, సంక్షేమం ఒకేవైపు కేంద్రీకృతమయ్యే కాలంలో మానవ మనుగడ క్లిష్టదశని ఎదుర్కొనేప్పుడు మేధావులు, చైతన్యశీలురు రంగప్రవేశం చేయాలి. కాని ప్రస్తుతం ఈ కోవలోని మనుషులు తమ కళ్లకు తామేవి చూడాలో అవే కనబడే గంతలు కట్టుకోవడం పెచ్చు పెరిగింది. వేలాది ఏళ్లుగా ఈ కులాలకి గుర్తింపు ఇవ్వ నిరాకరించిన కులవ్యవస్థ మనది. డెబ్బై ఏళ్ల స్వాతంత్ర్యం వేలాది వెనుకబడిన, అంటరాని కులాలను, వాటి ఛత్రచ్ఛాయలో బతుకీడుస్తున్న ఉప కులాలను గురించి పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ దేశంలో మూడువేల కులాలు, 25వేల ఉప కులాలు, తెగలు ఉన్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో వారు ఇంకా నిరుపేదలుగానే బతుకుతున్నారు. వీరికి చెందాల్సిన ఫలాలు, ఇతర కులాలు ఆరగిస్తున్నాయి. అంతేకాదు ఉపకులాల్ని సమాజం తొక్కి వేస్తోంది. ఈ వర్గాలకి చెందినవారితో మాట్లాడితే విషాద సముద్రాలు వెక్కి వెక్కి ఏడుస్తాయి. ఉప తెగలు ఆదివాసుల్లోనూ ఉన్నాయి. అనేక ఉప కులాలు వివిధ ప్రాంతాలలో, ప్రతి గ్రామంలో ఉపగ్రహాల్లా సంచరిస్తుంటాయి. కులాలకీ, ఉపకులాలకీ మధ్య ఆనాడున్న మానవీయ పేగుబంధం ఈనాడు ముక్కలు ముక్కలైంది. ఆయా కులాల చరిత్రని, పుట్టుకని, గోత్రాలని, కథలను గానరూపంలో పాడేవారు. విలక్షణ ప్రదర్శనల ద్వారా వారి దాతృత్వాన్ని వెల్లడి చేసేవారు. అత్యంత గొప్పశైలిలో వాటిని ఆడి, పాడి భారతీయ సాంస్కృతిక సంపదలో భాగం చేశారు. ‘చిందు’ కళాకారులను, కళను భరతుడి ‘నాట్యశాస్త్రం’ గ్రంథం గుర్తించింది. శిష్టకళలకు ఉప కుల కళా సంస్కృతులు ప్రాణవాయువులు అందించాయి. అద్భుతమైన వైవిధ్యత, విలక్షణ, ప్రత్యేకతలకు ఈ కళలు ఆలవాలమైనాయి. చాకలి, మంగలి వంటి వెనుకబడిన కులాలు, మాల, మాదిగ వంటి అస్పృశ్యతకు గురైన కులాలకు అనేక ఉపకులాలు ఉండడం గుర్తించాలి. వారి వద్ద కనబడే, కనిపించని కళా సంస్కృతులు మన నాగరికతకు మూలాలు. అయినా వీటినే ఆధారంగా చేసుకుని వేలాది ఏళ్ళుగా బతుకులీడుస్తున్న వాళ్ల జీవన పరిస్థితుల మీద పెద్దగా కృషి జరగలేదు. వీరి ఆర్థిక, సామాజిక, కళా, సంస్కృతుల విశిష్టత సమగ్రంగా బయటకు రాలేదు. ప్రభుత్వాలు అటువైపుగా దృష్టి సారించలేదు. ప్రజాపాలనలో సైతం వీరిని పక్కనే పెట్టారు. చెదురుమదురు ప్రయత్నాల వల్ల వీరికి ఒరిగిందేమీ లేదు. చదువుకున్న కులాలకి ప్రభుత్వ గుర్తింపు, సహకారం అందితే కానీ ఉప కులాల సమస్య తీరదు.
ఈ కులాలకి చెందినవాళ్లు రవీంద్రభారతులకి ఇంకా అంటరానివాళ్లే. ప్రభుత్వం మారినా పాత ప్రభుత్వం విధానాలే అమలు కావడం విచిత్రం. అద్దం వారు, పటం వారు, గంజికూటి వారు మొదలైన ఉప కులాలలో చదువుకున్నవారు లేరు. నిన్న మొన్నటి వరకు ఈ కులాలకి గుర్తింపు లేదు. ఈనాటి వరకు అలాంటి కళాకారుల సంఖ్య ఎంతో సాంస్కృతిక శాఖ వద్ద ఉందా అనే ప్రశ్నకు బదులు లేదు. వీరికి కదా మొదట గుర్తింపు ఇవ్వాలి. నోరు లేని ఈ కళాకారులకు ప్రదర్శనలు ఇవ్వాలి. కాని జరుగుతున్నది వేరు. మూలవాసీ కళాకారుల కన్నీళ్ళు తుడవని సాంస్కృతిక విభాగాలపై ప్రభుత్వం నజర్ వేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గుర్తింపు పొందని కులాలు చాలా ఉన్నాయి. గుర్తించినా కులం సర్టిఫికెట్లు పొందనివారు వేలకు వేలుగా ఉన్నారు. ఈ కులాలను సాంస్కృతిక కులాలు అని కూడా అంటారు. ఈ కళాకారులలో ఎంత మందికి గుర్తింపు కార్డులు ఉన్నాయి? కార్డులు ఇవ్వడానికి ఎందుకు జాప్యం జరుగుతున్నది? కార్డులు ఇవ్వలేనివారు వారి బతుకులను బాగుపరచగలరా? ఈ ఉపకులాలకు పోషితులుగా ఉన్న కులాలు వీరి బతుకును ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకనాడు వీరి బాగోగులు చూసుకుంటామన్నవారు రాగిరేకులు రాసి ఇచ్చినవారు, కాగితం సనదులపై సంతకాలు చేసినవారు ఏమయ్యారు? గౌడులు, యాదవులు, పద్మశాలీలు, కాపులు, విశ్వబ్రాహ్మణులు, మాలలు, మాదిగలు ఇకనైనా వీరిపై ఆధారపడినవారి స్థితిగతుల పట్ల దృష్టి పెట్టాలి. కులాధారితంగా నిర్మాణమైన దేశంలో కులాల అలసత్వం వల్ల, ప్రభుత్వాల వల్ల, వారి శాఖల వల్ల బతుకులు కునారిల్లకూడదు. వారి మీద రుద్దిన కులం వల్ల బాధలకు గురికాకుండా చూడాలి.
‘జాంబపురాణం’లో పేర్కొన్న ఈనెలవారు, నేహ సుక్కన్నలవారు, చపలచోరులు, మొండివారు, కాగిత బ్రాహ్మణులు వంటి కులాల చరిత్రపై, మనుషులపై దృష్టి పెట్టాలి. కొన్ని కులాలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటించి, లోకం నుంచి నిష్ర్కమించాయి. కులగణనలో వీరిని గుర్తించే ప్రయత్నాలు జరగలేదు. ఇలాంటి వారున్నారని కులగణన చేసే వారికి తెలియనప్పుడు వారి సంఖ్య ఎలా తెలుస్తుంది? ఇకపోతే, కులం సర్టిఫికెట్ పొందడానికి ఎంతో ప్రయాసపడవలసి ఉంటుంది. కొన్ని కులాలకి ఎమ్మార్వో, కొన్ని కులాలకి ఆర్డీవో కుల సర్టిఫికెట్లు ఇవ్వాలట. ఇదెక్కడి రూలు! పైగా ఇద్దరు గజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు పెట్టించుకునే స్తోమత వీరికి ఉందా? దానిని మార్చలేమా? ఈ దేశంలో తన అస్తిత్వానికి గుర్తింపు పొందడానికి, ఒక పౌరుడిగా గుర్తింపు పొందడానికి, దాని ద్వారా పాఠశాలలో చేరి, హాస్టల్ వసతి పొందడానికి వీలులేకపోవడం ఎంత దౌర్భాగ్యం. అన్నింటికీ అవసరమైన కుల సర్టిఫికెట్ పొందడానికి ఇన్ని కష్టాలా? కింది వర్గాల ప్రజల అవసరాల దృష్ట్యా ఒకసారి ఇలాంటి పాలనా సంస్కరణలు చేపట్టవలసి ఉంది. ఈ కళాకారులు తాగే బీడీలపై, ఇతర వస్తువులపై జీఎస్టీలు, ఇతర పన్నులు వసూలు చేసే పాలకులు వీరిని పట్టించుకొని వారి జీవితాలను పట్టాలపైకి ఎక్కించలేరా? ప్రజల గురించి అనేక ఉద్యమాలు చేసేవారు వారి ఎజెండాలోకి ఇకనైనా వీరికి స్థానం కల్పిస్తారా? మామూలు మనుషుల గురించి, నిత్యం దోపిడీకి గురయ్యే ఇలాంటి ‘చిన్న’ మనుషుల గురించి మాట్లాడడం నామోషీగా భావించవద్దు. ఈ వ్యవస్థకు నిత్యం బలయ్యేవారి గౌరవం, గుర్తింపు, అస్తిత్వం కాపాడడమే సోదర పౌరధర్మం.
-జయధీర్ తిరుమలరావు ‘ఆద్యకళ’ మ్యూజియం
Updated Date - Aug 07 , 2025 | 05:37 AM