ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Prof Jayashankar: తెలంగాణ జాతిపిత, ఉద్యమ కెరటం

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:52 AM

తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, నీళ్లు–నిధులు–నియామకాలలో తెలంగాణ నష్టపోయిందంటూ

తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, నీళ్లు–నిధులు–నియామకాలలో తెలంగాణ నష్టపోయిందంటూ పలు సమావేశాలలో తన గొంతుక వినిపించిన తెలంగాణ ఉద్యమ మాష్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1934, ఆగస్ట్ 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూర్ మండలం, అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మీకాంతారావు దంపతులకి జయశంకర్‌ జన్మించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం గల వీరు తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. బెనారస్ యూనివర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసారు. 1975 నుంచి 1979 వరకు సీకేయం కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 1979 నుంచి 91 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా సేవలు అందించారు.

పాఠశాల దశలోనే నాయకుడిగా ఎదిగిన వీరు ‘ఇడ్లీ సాంబర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేసారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనని ఎండగట్టిన ధీశాలి. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తరవాత 1995లో మలి దశ ఉద్యమంలో మార్గనిర్దేశకుడిగా నిలిచారు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటలతో ఉద్యమానికి ఊపిరి ఊదింది. ఊరూరా తెలంగాణ నినాదాన్ని విశ్వవ్యాప్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రజల ముందుంచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. ‘‘మా వనరులు మాకు ఉన్నాయి, మా వనరులపై మాకు పూర్తి అధికారం కావాలి’’ అని నొక్కి వక్కాణించారు. ‘‘యాచక దశ నుంచి శాసన దశకు తెలంగాణ రావాలె, మా రాష్ట్రం మాకు కావాలి’’ అంటూ విన్నవించారు. తెలంగాణలో అభివృద్ధి నత్తనడకన కొనసాగుతూ ఉంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయం పాలనలో శ్వాసిస్తాం, ఇతరుల పాలనలో యాచిస్తూ ఉన్నాం. నిజాం నవాబు కాలంలో ఇక్కడ గొలుసు చెరువులు ఉండేవి. కావాలని వాటిని నాశనం చేసారు. తెలంగాణ వస్తే ఈ చెరువులను పునరుద్ధరించాలి అని పలు సమావేశాల్లో చెప్పారు.

2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటయ్యాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సరి అయిన నాయకుడిగా కేసీఆర్‌ను గుర్తించి, పార్టీలకి అతీతంగా ముందుకు వెళ్ళాలని కోరిన వ్యక్తి జయశంకర్ సార్‌ మాత్రమే. 2009 నవంబరు 29న కేసీఆర్‌ ఆమరణ దీక్ష, 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి ఆత్మాహుతి ఈ ప్రాంత ప్రజలను కలచి వేసింది. ఉద్యమం వైపు పరుగులు పెట్టించింది. 2009 డిసెంబరు 23న శాసనసభ తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తామన్న చిదంబరం ప్రకటనతో తెలంగాణలో ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఆ ప్రకటనతో జయశంకర్ సార్ తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందారు. పల్లె, పట్టణాలను ఉద్యమం వైపు మళ్లించి సామాజిక రాజీనామాలు, ఛలో అసెంబ్లీ ఉద్యమ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. తెలంగాణ మేధావులతో చర్చించి, కవులు, కళాకారులు, రచయితలు, ఉపాధ్యాయ, ఉద్యోగులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకి తీసుకుపోయారు. ‘పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు అంతా దేశానిది’ అని చెప్పిన కాళోజీ మాటను నిజం చేసి, ‘బతుకు అంతా తెలంగాణది’ అని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం రావాలి, అప్పుడే నేను మరణిస్తా’ అని చెప్పిన త్యాగశీలి వీరు. అమరుల త్యాగాలు, బలిదానాలు, ఉద్యమ భావాలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని 2014 మార్చి 4న ప్రకటించింది. తర్వాత భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ సార్ గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ 2011 జూన్ 21న కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్‌ సేవలను గుర్తించి ఆయన పేరు మీద అగ్రికల్చరల్ యూనివర్సిటీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసింది. విద్యారంగంలో ప్రతి ఏటా జూన్‌లో జరిగే బడి పండుగకు ‘జయశంకర్ బడిబాట’ అని నామకరణం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టడం అభినందనీయం. ఆగస్టు ౬న రాష్ట్ర వ్యాప్తంగా వారి జయంతి నిర్వహించుకోవడం మనందరి బాధ్యత. వారి కాంస్య విగ్రహాలని అన్ని జిల్లాల్లో, మండలాల్లో ఏర్పాటు చేయాలి.

-కామిడి సతీష్‌రెడ్డి

(నేడు ప్రొఫెసర్‌ జయశంకర్ జయంతి)

Updated Date - Aug 06 , 2025 | 02:52 AM