ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

From Failure to Revolution: విఫల విధానం నుంచి విప్లవాత్మకం దాకా

ABN, Publish Date - Sep 04 , 2025 | 01:13 AM

విదేశాంగ విధానం ఏ దేశానికైనా బాహ్య ప్రపంచంలో ఆ దేశ ప్రతిష్ఠను ప్రతిబింబించే అద్దం లాంటిది. ఒక దేశం లోపల ఎంత బలంగా ఉన్నా...

విదేశాంగ విధానం ఏ దేశానికైనా బాహ్య ప్రపంచంలో ఆ దేశ ప్రతిష్ఠను ప్రతిబింబించే అద్దం లాంటిది. ఒక దేశం లోపల ఎంత బలంగా ఉన్నా, అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపించుకోలేకపోతే ఆ బలం వృథా అవుతుంది. 2004–2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల కాలం భారత విదేశాంగ చరిత్రలో అనేక విమర్శలకు గురైంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా శాంతమూర్తి, మితభాషి, ఆర్థిక శాస్త్రవేత్త అయినప్పటికీ, దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో ధైర్యం, పట్టుదల, దూరదృష్టి లోపించిందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, సోనియాగాంధీ ప్రభావం ప్రధానమంత్రి కార్యాచరణపై ఎక్కువగా ఉండడంతో, ఆయన ఒక ‘రిమోట్ కంట్రోల్’ చేతిలో ఉన్న మరబొమ్మలా మారిపోయారని అంతర్జాతీయ పత్రికలు కూడా వ్యాఖ్యానించాయి. 2008 ముంబయి ఉగ్రదాడులు భారతదేశాన్ని కుదిపేశాయి. వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడులకు పాక్ ప్రేరేపిత సంస్థలు కారణమని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. 2013లో డెప్సాంగ్ లోయలో చైనా సైన్యం 19 కిలోమీటర్లు చొచ్చుకువచ్చి వారాల తరబడి గుడారాలు వేసి కూర్చుంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని కాపాడటంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. దీనిని ‘చిన్న సంఘటనలు’ అని తేలికగా తీసుకోవడం భారత భద్రతను బలహీనపరచింది. విదేశాంగ విధానం అంటే కేవలం ఒప్పందాలు, సమావేశాలు కాకుండా శత్రువులకు తగిన సమాధానం ఇవ్వడం కూడా.

ఎన్డీయే పాలనలో భారత విదేశాంగం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా అటల్ బిహారీ వాజపేయి కాలంలో ధైర్యం, శాంతి అనే ద్వంద్వ లక్షణాలను ప్రపంచానికి చూపింది. 1998 పోఖ్రాన్–2 అణు పరీక్షలతో భారత్ శాశ్వత అణు శక్తిగా నిలిచింది. ఆంక్షల బెదిరింపులను ఎదుర్కొని, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సంబంధాలను మెరుగుపరచడం ఆయన దౌత్య నైపుణ్యానికి నిదర్శనం. 1999లో పాక్ కార్గిల్ చొరబాటు సమయంలో భారత సైన్యం ధైర్యంగా పోరాడి, అమెరికా, చైనా వంటి దేశాలను కూడా పాక్ తప్పిదాన్ని అంగీకరింపజేయడం వాజపేయి ప్రభుత్వానికి గొప్ప విజయం. అదే సమయంలో లాహోర్ యాత్ర, ఆగ్రా చర్చలు వంటి శాంతి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2014లో మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత విదేశాంగ విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆయన దూకుడు, స్పష్టమైన జాతీయ హితం అనే లక్ష్యంతో ముందుకు సాగారు. 2017లో డోక్లాం ఘర్షణలో చైనా బహిరంగ యుద్ధ బెదిరింపులకు భారత్ వెనక్కి తగ్గకుండా 73 రోజులపాటు నిలబడి, చివరికి చైనాను వెనక్కి తగ్గించగలిగింది. 2020 గాల్వాన్ ఘర్షణ తరువాత మౌనం కాకుండా ఆర్థిక చర్యలు తీసుకుని, వందలాది చైనా యాప్‌లను నిషేధించడం, సైనిక బలం పెంచడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై చైనాను ఎదుర్కొంది. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం చూపిన కఠిన వైఖరి భారత విదేశాంగ విధానాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. యురి దాడి తరువాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి తరువాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అంతర్జాతీయంగా భారత నిర్ణయాత్మకతను నిరూపించాయి. ఈ ఏడాది జమ్ము–కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి తరువాత ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయడం, సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ‘‘భారత్ ఇకపై రాజీ పడదు’’ అని స్పష్టంగా తెలిపింది.

మోదీ విదేశాంగ విధానంలో మరో ప్రధాన బలం ఆర్థిక, సాంకేతిక స్వయం సమృద్ధి. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి కార్యక్రమాలు అంతర్గత అభివృద్ధికే కాక, విదేశాంగంలోనూ భారత్ ప్రతిష్ఠను పెంచాయి. రక్షణ రంగంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ వంటి సొంత ఉత్పత్తులు, యుద్ధ ట్యాంకులు, జెట్లు భారత్ తయారు చేస్తోంది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు యూపీఏ కాలంతో పోలిస్తే ఇరవై రెట్లు పెరిగాయి. ఆర్థిక రంగంలో 2005–2014లో వచ్చిన ఎఫ్‌డీఐ 304 బిలియన్‌ డాలర్లు కాగా, 2014–2024లో అది 667 బిలియన్లకు చేరింది. డిజిటల్ ఇండియా కింద యూపీఐ వ్యవస్థ ఇప్పటికే సింగపూర్, యూఏఈలలో అమలులో ఉంది; మరో 20 దేశాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. 2023లో న్యూఢిల్లీలో నిర్వహించిన జీ–20 సమ్మేళనం విజయవంతంగా సాగింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల విభేదాలు ఉన్నా, భారత్ చొరవతో ఏకగ్రీవ తీర్మానం ఆమోదమైంది. BRICSలో భారత్ కీలక పాత్ర పోషించింది. QUAD వేదికలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండో–పసిఫిక్‌లో చైనా ప్రభావాన్ని తగ్గించడంలో భాగస్వామ్యం అయింది. మోదీ విదేశాంగంపై కొందరు అమెరికా సుంకాలు, ట్రంప్ వ్యాఖ్యలు, పొరుగు దేశాల సమస్యలను చూపిస్తూ విమర్శలు చేశారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోకపోవడం మౌన రాజదౌత్యం. అమెరికా సుంకాల సమస్యకు ప్రతిగా భారత్ కొత్త మార్కెట్ల వైపు దృష్టి పెట్టడం, PLI పథకాల ద్వారా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం దీర్ఘకాలిక వ్యూహం. మొత్తంగా చూస్తే, యూపీఏ కాలంలో కనిపించిన బలహీనతలు, నిస్సహాయతలు ఇప్పుడు గతం. ఎన్డీయే నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక తరచూ వినిపించే పేరుగా కాక, నిర్ణయించే పేరుగా మారింది. ఇది ప్రతి భారత పౌరుడికీ గర్వకారణం.

-నాగోతు రమేశ్‌నాయడు ప్రధాన కార్యదర్శి,

బీజేపీ, ఆంధ్రప్రదేశ్

Updated Date - Sep 04 , 2025 | 01:13 AM