ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Legal and Political Twist: ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ వింత ప్రతివాదం

ABN, Publish Date - Oct 23 , 2025 | 04:19 AM

ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు జరుగుతున్న కృష్ణా జలాల పంపిణీ విచారణలో చట్టాల వివరణ, నిరూపణ చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం....

ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు జరుగుతున్న కృష్ణా జలాల పంపిణీ విచారణలో చట్టాల వివరణ, నిరూపణ చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం. ‘చట్టాల యోగ్యత’పై తెలంగాణ వింతయైన అనేక ప్రతివాదనలను ఎంచుకున్నది. వాటిలో... ‘కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో సెక్షన్–3 ప్రకారం ‘బచావత్ ట్రైబ్యునల్ చేసిన మొత్తం 811 టీఎంసీల పంపిణీని రద్దుగా భావించి, ఇరు రాష్ట్రాల మధ్య వాటాలను పునఃపంపిణీ చేయాలి!’ అలాగే బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలను గుంపగుత్తగా కేటాయింపులు చేసిందనీ, అలా కాకుండా ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలంది. అంతేకాదు, ట్రైబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 65 శాతం విశ్వసనీయ జలాలు, మిగులు జలాల మొత్తం కేటాయింపులను బేసిన్ ప్రాంతంలోని తమ ప్రాజెక్టులకు కేటాయించవచ్చని తెలంగాణ తెలిపింది. మిగతా రాష్ట్రాలకంటే లోటు సంవత్సరాల్లో తాము ఎక్కువ నష్టపోతున్నామనీ, ఆంధ్రప్రదేశ్ కడపటి రాష్ట్రం కాదు కనుక మిగులు జలాలు కూడా తమకే చెందాలనీ తెలంగాణ వాదించింది. కృష్ణా బేసిన్‌ లోపలి, బయటి ప్రాజెక్టులతో పాటు పులిచింతల ప్రాజెక్టు, కారీ ఓవర్‌ స్టోరేజ్‌కు సంబంధించిన అనేక అంశాలను ట్రైబ్యునల్‌ ముందు ప్రతిపాదించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సింహభాగం కృష్ణా జలాలను లాగేసుకోవాలనే తెలంగాణ వ్యూహం రచించినట్లుంది. పై వాదనలు ఎంత సమంజసంగా ఉన్నాయో వేరే చెప్పనక్కరలేదు. ప్రస్తుతమున్న చట్టాలు తమకు సంబంధించవని తెలంగాణ చెబుతోంది. చివరకు ఏ విభజన చట్టం ద్వారా తెలంగాణ ఏర్పడిందో ఆ చట్టాన్ని కూడా కృష్ణాజలాల పంపిణీ పరంగా ఒప్పుకోనంటోంది ఆ రాష్ట్రం. ఈ చట్టంలో ఇరు రాష్ట్రాలకు విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న నీటి వాటాల్లో మార్పుండదని స్పష్టంగా ఉంది. ఇదీ వర్తించదని తెలంగాణ చెప్తోంది. అలాగే 1956–2002 సవరణ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని నాలుగో నిబంధనకు కూడా చెల్లుబాటు చేస్తోంది. అంటే విభజన మూలంగా సాగుకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడాలా? ట్రైబ్యునల్ 2016 అక్టోబర్‌ 19న వెలువరించిన ఉత్తర్వుల్లో చాలా రూఢీగా చెప్పింది. 2014 చట్టంలో ‘నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్‌కు తగ్గించి తెలంగాణాకివ్వాలి’ అని లేదనీ, ప్రస్తుత తెలంగాణ‍ జనాభాకు సంబంధించి విభజనకు ముందున్న యథాపూర్వ స్థితి (స్టేటస్‌ కో) మార్చాల్సిన అవసరం లేదనీ అభిప్రాయపడింది. సెక్షన్–3 ప్రకారం విచారించాలని చెబుతూ కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్‌లో ఈ విధంగా ఉంది.

‘గుంపగుత్తగా ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంచేందుకు పరిగణనలోకి తీసుకోవాలి. అదే ట్రైబ్యునల్ ప్రస్తావించిన అదనపు జలాలను (811కు పైబడి) కేటాయించినట్లయితే వాటిని కూడా పంచాలి. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి ట్రైబ్యునల్ కృష్ణాబేసిన్‌కు అనుమతించిన పరిమాణం కంటే అదనంగా గోదావరి జలాల తరలింపు ప్రతిపాదనలున్నా, ఆ జలాలనూ ఇరు రాష్ట్రాల మధ్య పంచాలని కూడా నోటిఫికేషన్‌లో ఉంది. ఈ నోటిఫికేషన్‌లో ట్రైబ్యునల్–2 ప్రస్తావన లేదు. ట్రైబ్యునల్–1 కేటాయింపుల గురించే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పంపిణీ చేయాలని చెప్పింది కానీ, ‘పునః పంపిణీ’ అనలేదు. 2002 సవరణ చట్టానికి, 2014 విభజన చట్టానికి అతీతంగా పునఃపంపిణీ చేయాలని కూడా లేదు. ‘811 టీఎంసీలకు అదనంగా అవిభక్త రాష్ట్రానికి ట్రైబ్యునల్ ఏమి కేటాయింపులు చేసింది?’ అంటే ఇక్కడ రెండు అంశాలు కన్పిస్తాయి. ఒకటి 811 టీఎంసీలకు అదనంగా 150 టీఎంసీలను కారీఓవర్ స్టోరేజ్‌గా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేయడానికి అనుమతించింది. కృష్ణానదిలో 75 శాతం విశ్వసనీయ లభ్యతగా నిర్ణయించబడిన 2,130 టీఎంసీల కంటే అదనంగా లభ్యమయ్యే మిగులు జలాలను హక్కులేని జలాలుగా వినియోగించుకోవచ్చని కూడా చెప్పింది. రెండు ట్రైబ్యునల్స్ కూడా బేసిన్ లోపల, బేసిన్ బయట ప్రాజెక్టుల మధ్య వివక్ష చూపలేదు. తెలంగాణ‍ చెబుతున్నట్లు బేసిన్ బయట ప్రాజెక్టులకు నీటి సరఫరాను ఆరుతడి పంటలకు మాత్రమే పరిమితం చేయకూడదని ఏపీ వాదించాలి. నాగార్జునసాగర్ ఆయకట్టులో మాగాణి మెట్ట పంటల విస్తీర్ణాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భవించించి కాబట్టి, అయిదు దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానాన్ని తమ రైతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ తేల్చిచెప్పాలి. పోలవరం నుంచి మళ్లించిన 80 టీఎంసీల్లో కర్ణాటక, మహారాష్ట్రకు భాగాలు కేటాయించగా మిగిలిన 45 టీఎంసీలను తమ రాష్ట్రానికి చెందాలని తెలంగాణ అంటోంది.

కానీ ‘గోదావరి ట్రైబ్యునల్ అనుమతించిన 80 టీఎంసీల కంటే అదనంగా తరలింపు ప్రతిపాదనలుంటే వాటిని కూడా పంచాలి’ అని కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ఉంది. అంతేకానీ 80టీఎంసీల్లో మిగిలిన 45 టీఎంసీల గురించిన ప్రస్తావనే లేదు. ట్రైబ్యునల్–1 అనుమతించిన అదనపు జలాల వినియోగంలో కారీఓవర్ స్టోరేజ్‌కు నిర్దిష్ట కేటాయింపు లేదు. ఇది రిజర్వాయర్ నిర్వహణకు సంబంధించినది. ఉమ్మడి రాష్ట్ర రిజర్వాయర్లయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణ ప్రస్తుతం కృష్ణా మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిలో ఉంది. కాబట్టి కేఎంబీ స్వాధీనంలోనే ఆ స్టోరేజ్‌ను ఉంచాలి. అంతేగానీ రాష్ట్రాలకు పంచకూడదు. పంచితే రిజర్వాయర్ల నిర్వహణ పాక్షికంగా బోర్డు పరిధి నుంచి తొలగించినట్లవుతుంది. కృష్ణా డెల్టాలోని పంటలకు పులిచింతల నుంచి నీటి విడుదల అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్ కృష్ణా డెల్టా అవసరాల కోసమే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించారు. అంతేగానీ సాగర్ ఆయకట్టుకు పంపింగ్ కోసం కాదు. పులిచింతల దిగువ లభ్యమయ్యే నీటిని డెల్టాకు ఉపయోగించడంలో అనిశ్చితి ఉంటుంది. మున్నేరు, పాలేరుల్లో నీటి ప్రవాహం వాటి పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం మూలానే సంభవిస్తుంది. కానీ అప్పుడు వర్షాలు కురవడం వల్ల పంటలకు నీటి అవసరాలు తగ్గుతాయి. దాంతో ఆ రెండు పాయల నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదలాల్సి వస్తున్నది. ఈ అనిశ్చితి గమనించే ట్రైబ్యునల్–1 నాగార్జునసాగర్ నుంచి డెల్టాకు నీటి విడుదలను అనుమతించింది. ఆ రిజర్వాయర్‌లో కారీఓవర్ స్టోరేజ్ కూడా కృష్ణా డెల్టాను దృష్టిలో ఉంచుకుని చేసినదని ట్రైబ్యునల్‌కు నొక్కి చెప్పాలి. నాగార్జునసాగర్ కుడికాలువకు అధిక ఖర్చుతో నీటిపారుదల సౌకర్యం ఏర్పరుచుకొని, దానికి బదులుగా ఇంకా ఎక్కువ ఖర్చుతో పులిచింతల నుంచి పంపింగ్ ఏర్పరచవలసిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్‌ తేల్చి చెప్పాలి. చట్టాలకు తెలంగాణ అతీతం కాదనీ, ఆ రాష్ట్రం కోసం తాము నష్టపోవాల్సిన అవసరం లేదని ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదించాలి.

-కురుమద్దాలి వెంకటసుబ్బారావు విశ్రాంత చీఫ్ ఇంజనీర్

Updated Date - Oct 23 , 2025 | 04:19 AM