తెలంగాణ జరూర్ ఆనా కుచ్ సీఖ్ నా
ABN, Publish Date - May 23 , 2025 | 06:03 AM
ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా 72వ మిస్‌వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని 109 దేశాల సుందరీమణులు వీటీల్లో పాల్గొంటున్నారు. మే 10న అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 31న జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా 72వ మిస్‌వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని 109 దేశాల సుందరీమణులు వీటీల్లో పాల్గొంటున్నారు. మే 10న అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 31న జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజ్‌భవన్‌లో జరగబోయే తేనీటి విందులో మిస్‌వరల్డ్ విజేతతో పాటు ఇతర కంటెస్టెంట్లు ఆతిథ్యం స్వీకరించి, అనంతరం వారి దేశాలకు వెళ్లిపోతారు.
‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నది. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను ప్రపంచ సుందరీమణులు సందర్శించేలా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుద్ధ వనం, చౌమల్లా ప్యాలెస్, చార్మినార్, యాదగిరిగుట్ట, రామప్ప గుడి, భద్రకాళి గుడి, వేయి స్తంభాల గుడి, ఫలక్‌నుమా ప్యాలెస్, పోచంపల్లి, సచివాలయం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలను ఈ అందగత్తెలు సందర్శించారు. కానీ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహ సందర్శనకు ఆ అతిథులను ప్రభుత్వం తీసుకువెళ్లకపోవడం శోచనీయం.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కూడా. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే జరిగింది. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మహనీయుడికి నివాళిగా, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా హుస్సేన్‌సాగర్ తీరాన, హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ పరిసరాలను అంబేడ్కర్ స్మృతివనంగా తీర్చిదిద్దారు. విగ్రహ పీఠం లోపల స్మారక భవనంలో అంబేడ్కర్‌కు సంబంధించిన అరుదైన ఫొటో గ్యాలరీ ఉంది. అక్కడ అంబేడ్కర్ రచనలు, జీవిత విశేషాలు, రాజ్యాంగ ప్రతులు, ఆయన గురించి పలువురు రాసిన పుస్తకాలు.. ఎన్నో ఉన్నాయి.
మన దేశ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య ఘనతను విశ్వవ్యాప్తం చేసే అరుదైన అవకాశం ఇప్పుడు తెలంగాణకు దక్కింది. మిస్‌వరల్డ్ పోటీదారులను అంబేడ్కర్ స్మృతి భవనానికి ఆహ్వానించడం, వారికి మన రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించడం వంటివి చేస్తే చాలా బాగుంటుంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి అలాంటి ఆలోచనేమీ లేనట్టుగా కన్పిస్తోంది. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. మరికొన్ని రోజుల్లో ఈ అందాల పోటీలు ముగుస్తున్నందున మిస్‌వరల్డ్ పోటీదారులు అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించేలా రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అలా చేయని పక్షంలో ప్రపంచ నలుదిశలా వ్యాపించబోయే తెలంగాణ ఖ్యాతిని అడ్డుకున్న పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో మిగిలిపోతుంది.
బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 23 , 2025 | 06:03 AM