ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Regional Identity vs Class Politics: ఒక మత్తుకి ఇంకో మత్తు..మందు కాదు!

ABN, Publish Date - Oct 04 , 2025 | 05:26 AM

ప్రాంతీయ అస్తిత్వం: భ్రమలూ, వాస్తవాలూ అన్న జూలై 29 నాటి నా వ్యాసానికి, తెలంగాణ పరిరక్షణ వేదిక వారి సెప్టెంబరు 11 నాటి ‘పాత సమాధానం’’ చూశాను. దానికి, నా వివరణ ఇదీ....

‘ప్రాంతీయ అస్తిత్వం: భ్రమలూ, వాస్తవాలూ!’ అన్న జూలై 29 నాటి నా వ్యాసానికి, ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ వారి సెప్టెంబరు 11 నాటి ‘పాత సమాధానం’’ చూశాను. దానికి, నా వివరణ ఇదీ: (1) నాది ‘పాచి వాదన’ అనీ, ‘ఆదర్శవాద ముసుగు’ అనీ, ‘ఆధిపత్య భావన’ అనీ, ‘పిడివాదన’ అనీ వేదిక వారు అన్నారు. అసువంటి మాటలతోని, బహెస్ నడ్వది! కాబట్టి, గా ముచ్చట్లు ఇడిసిపెట్టి, అసల్ నేనేమంటీ, మీరేమంటున్రూ, గా సంగతి చెప్పుకోవాలె! (2) ఒక ప్రాంతంలో ఉన్న రకరకాల అసమానతల్నీ వైరుధ్యాల్నీ ప్రాంతీయ అస్తిత్వ స్పృహ అనే మాయ తెర కప్పివేస్తుంది అనే ‘‘ఎరుక మాకు తెలియనిది కాదు’’ అంటున్నరు వేదిక వాండ్లు! మరి, గా ‘ఎరుక’తో నుండాలన్న నాతోని కొట్లాడుడేంది? (3) ‘ఎమ్మార్పీఎస్ ఉద్యమం జేస్తున్నం! బీసీ రిజర్వేషన్ల ఉద్యమం జేస్తున్నం!’ అని గొప్పలు చెప్పుకుంటున్రు! మోస్ట్ బ్యాక్వార్డ్ షెడ్యూల్ కులాల ఉద్యమాన్ని ఒప్పుకుంటున్రా? అసలు వర్గీకరణనే వ్యతిరేకించే మాల అస్తిత్వవాదుల ఉద్యమం సంగతేంది? ‘‘ముస్లింలు, స్త్రీలు, ఆదివాసీలు ఎవరైనా, అందరూ అన్ని పోరాటాలనూ చేయరు’’ అంటున్రు మీరు. అన్ని పోరాటాలు జయ్యమని ఈడ ఎవ్వరూ అడుగుతలేరు! తాము చేసే ఉద్యమాలు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేవి మాత్రమేననీ; భూములూ, గనులూ, ఫ్యాక్టరీలూ, రవాణా లాంటి ఉత్పత్తి సాధనాల్ని స్వాధీనం చేసుకోవాలనే దృష్టి లేకుండా, అసమాన శ్రమ విభజనని పూర్తిగా మార్చుకోవాలనే లక్ష్యం లేకుండా, చేసే యాడ్–హాక్ (తాత్కాలిక) ఉద్యమాలన్నీ, పాలకవర్గాలు ఏర్పాటు చేసిన చట్రంలో ఇరుక్కుపోవడమేననే స్పృహ లేకపోతే జరిగేదేమిటి? ‘‘గా ప్రాంతపోల్ల విగ్రహాలు, తీసెయ్యాలె! ఎన్నో సైన్మలు దీసిన మా ప్రాంతపోని ఫోటో గింత చిన్నగనా పెట్టేడిది? మా కార్మికుల శ్రమని దోచే హక్కు మా ప్రాంతపు కాంట్రాక్టర్లకె వుండాలె, గా ప్రాంతపు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఎందుకీయాలె?’’ అంటే, అది తెలంగాణలోని శ్రామిక ప్రజల ప్రయోజనాలను ఏ రకంగా పరిరక్షిస్తుంది?

(4) ‘‘మేం ప్రాంత అసమానత గురించి చేస్తున్నం. వర్గ ప్రాతిపదికన చేసే పోరాటానికి ఇవేవీ ఆటంకం కాదు’’ అని అంటున్రు వేదిక సాల్రు! నేనన్నదేంది? ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, అది ఆంద్రాగానీ, తెలంగాన గానీ, రాయలసీమ గానీ, గా ప్రాంతం అంతా ఒక్క తీరుగ లేదు. గా ప్రాంతాలల్ల, అమీరులున్నరు, గరీబులున్నరు. దొరలున్నరు, కూలోల్లున్నరు. మురికి అంటని కొలువులు జేసెటోల్లున్నరు, మురికి, సఫాయి పనులు జేసెటోల్లున్నరు. అందర్నీ, ఒక్కతీరుగనే జూస్తే, గది వర్గపోరాటానికి ఆటంకం కాదా? (5) ‘‘బి.ఆర్‌. బాపూజీ బాధ ఏమిటి?... తమ ప్రాంత ఆధిపత్యం మీద దృష్టి తగ్గుతది అనే’’ అంటున్నరు వేదిక సాల్రు! ఇగో సాల్రూ! ఈ బాపూజీ అనేటోనికి ఒక ప్రాంతమంటూ లేదు. వాడు ఆంద్రోడూ కాదూ, తెలంగానోడూ కాదు! వాడు, కమ్యూనిస్టోడు! వాని భావజాలం ‘శ్రామికవర్గ అంతర్జాతీయత’! అంటే, అన్ని దేశాల కార్మికులూ ఒక్కటిగావాలె! (6) ‘‘అంబేడ్కర్ తదితరులు ప్రాంతాలకతీతంగా దేశం మొత్తానికీ ఐకన్స్’’ అని అంటున్నరు వేదిక వాండ్లు. అసలు గీ ‘ఐకాన్స్’ అనే ముచ్చటెక్కడికెల్లొచ్చింది? మనుషుల్ని ‘ఐకన్స్’ అనీ, ‘వైతాళికులు’ అనీ, సమానత్వ సూత్రానికి విరుద్ధంగా, నిలబెట్టడమే అసలైన ‘ఆధిపత్య భావన!’ (7) విగ్రహ తరలింపు ఉద్యమం ద్వారా, తెలంగాణను పరిరక్షించాలనుకుంటున్న వేదిక వారు, ‘‘మీ కాసు బ్రహ్మానందరెడ్డి, మీ ఎన్టీఆర్‌, మీ రాజశేఖరరెడ్డి, మా మర్రి చెన్నారెడ్డి, మా పి.వి. నరసింహారావు, మా అంజయ్య...!’’ అనుకుంట నా మీద కోపమైతాండ్రు. ఓ సాల్రూ! విగ్రహాలనేవీ సమానత్వ సూత్రానికి విరుద్ధమనీ, హేతువిరుద్ధమనీ, ఒక కళా రూపంగా మాత్రమే వాటిని చూడాలనీ, ఎవరి విగ్రహాన్నయినా చేసినా, చేయించినా, దాన్ని ప్రకృతి వైపరీత్యాలనించీ, సామాజిక శతృవులనించీ కాపాడుకోగలిగేలా, ఏర్పాట్లు చేసుకోవాలనీ చెపితే, ‘గది మీ ప్రాంతపోని విగ్రహం! గిది మా ప్రాంతపోనిది!’’– అని, గీ మాటలెందుకు జప్పుండ్రి!

8 రాజశేఖర్‌రెడ్డి పేరెత్తిండ్రుగదా మీరు? మీకు యాదికున్నదో లేదో, ఒక ముచ్చట జప్తా ఇనుండ్రి! 2009లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం అయినంక, రాయలసీమల ప్రచారం మొదలు బెట్టేతప్పుడు, ‘‘ప్రత్యేక తెలంగాణ వస్తే, రాయలసీమ వాళ్ళు, విదేశీయులుగా బతకవలిసి వస్తుందని’’ అన్నడు. అప్పుడు, నేను, గిదే బాపూజీని, ‘ఆధిపత్య భావన’ గలిగినోన్ని, గిట్ల రాసిన: ‘‘తన పాలనలో, సెజ్‌ల యజమానులకు ఆర్థికంగా, రాజకీయంగా, దళారీగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతలలో అగ్రగణ్యుడైన ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ భూతాన్ని చూపడం మాత్రం, ఒక దళారీ దేశభక్తిని ప్రదర్శించడం లాంటిదే!’’ (ఆంధ్రజ్యోతి, 19–4–2009). (9) ‘‘ఆధిపత్య అహంకారానికి ‘అస్తిత్వం మత్తే’ సరైన జవాబు’’ అని వేదిక వాండ్ల ఆత్మ సమర్ధన! కానీ, ఒక మత్తుకి ఇంకో మత్తు.. మందు కాదు! అస్తిత్వాలలో ఉప అస్తిత్వాలూ, ఉప–ఉప అస్తిత్వాలూ ఉన్నాయనీ, వాటి మధ్య అసమానతల్ని ఈ శ్రమ దోపిడీ సమాజం ప్రోత్సహిస్తుందనీ గ్రహింపు లేకపోతే ఎట్ల? (10) ‘‘తెలంగాణ స్ఫూర్తిదాతల విగ్రహాల లిస్ట్‌ కుల మత, లింగ భేదాల్ని బట్టి నిష్పత్తితో సహా సిద్ధంగా ఉంది’’ అని, ఐలాన్ జేసిండ్రు వేదిక సాల్రు! ముందు, వర్గీకరణలోనూ, బీసీ రిజర్వేషన్లలోనూ నిష్పత్తులు తేలాలి గదా? అప్పుడే లిస్టు ఎట్ల సిద్ధంగున్నది? (11) ‘‘తెలంగాణ అస్తిత్వం మత్తు కాదు, అది భౌగోళిక విముక్తి’’ అంటున్నరు వేదిక వాండ్లు! భౌగోళిక శాస్త్రం ప్రకారం, తెలంగాణ ఒక ప్రాంతం కావచ్చు. కానీ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక శాస్త్రాల ప్రకారం, అనేక అసమానతలతో కూడిన జనసమూహం. కావలిసింది, అసమానతలనించీ విముక్తి!

-బి.ఆర్. బాపూజీ

Updated Date - Oct 04 , 2025 | 05:26 AM