ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Agriculture: ఖరీఫ్ ప్రణాళిక ఏదీ

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:10 AM

తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు బహుళ సమస్యలతో పడ్డారు. పంటల బీమా, రైతు ఆత్మహత్యలు, కౌలు రైతుల గుర్తింపు వంటి కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారంకాకుంటున్నాయి.

కోటిన్నర ఎకరాల సాగు భూమి, 60 లక్షల మంది రైతులు ఉన్న ఒక రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానమే ఇప్పటి వరకూ లేదని మీకు తెలుసా? బహుళ పంటలు పండే నేలలున్న ఒక రాష్ట్రం మోనో క్రాపింగ్ వైపు పరుగులు తీస్తుందనీ; రాష్ట్రానికి అవసరమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాల నుండీ, ఇతర రాష్ట్రాల నుండీ దిగుమతి చేసుకుంటున్నదనీ మీకు తెలుసా? దేశం మొత్తంలో గత ఐదేళ్లుగా సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయని ఏకైక రాష్ట్రం, గత నాలుగేళ్లుగా వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక కూడా విడుదల చేయని రాష్ట్రం ఏదో మీకు తెలుసా? మొత్తం సాగుదారులలో 36 శాతం కౌలు రైతులే ఉన్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా? వీటన్నిటికీ ఒకే జవాబు: తెలంగాణ! ఈ సారి నైరుతి ఋతుపవనాలు పది రోజుల ముందుగానే రాష్ట్రానికి వచ్చేశాయి. చాలా జిల్లాలలో వానలు కురుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా వ్యవసాయ రంగంపై దృష్టి సారించాల్సిన సందర్భం ఇది. కానీ జరుగుతున్నది గమనిస్తే ప్రభుత్వం, ముఖ్యంగా వ్యవసాయశాఖ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదు. గత ప్రభుత్వ పాలనా నిర్వాకాల వల్ల రాష్ట్రానికి నిధుల కొరత ఎంతైనా ఉండవచ్చు. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితులు బేరీజు వేయకుండా, ప్రాధాన్యతలు నిర్ణయించుకోకుండా ముందుకు సాగుతున్నది. వృద్ధ, ఒంటరి, వితంతు, బీడీ కార్మిక మహిళలకు, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలకు ఆసరా పెన్షన్‌లు ఇవ్వడానికి నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ అందాల సుందరి ఎంపిక పోటీలను మాత్రం ధూమ్ ధామ్‌గా నిర్వహించింది. ఫలితంగా ఆరోపణలు, విమర్శలు తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమిటి? 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ఈ రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా అందిస్తున్న ఎకరానికి రూ.6వేల సహాయం కూడా ఇప్పటికీ అనేకమంది రైతులకు అందనేలేదు. రైతు భరోసా పెట్టుబడి సహాయం కౌలు రైతులకు కూడా అందిస్తామని ఇచ్చిన హామీ అసలు అమలుకు నోచుకోలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలన్న నిబంధన వల్ల, భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్‌లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నా, రైతులు తెచ్చిన ధాన్యానికి కనీస మద్దతు ధర మాత్రమే చెల్లిస్తున్నది తప్ప, రైతులకు హామీ ఇచ్చిన విధంగా సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇప్పటికీ ఒక్కరికీ వేయలేదు.


రబీ సీజన్‌లో వరిని ప్రోత్సహించడం మంచిది కాదని రైతు స్వరాజ్య వేదిక, ఇంకా ఇతర నిపుణులు స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. ఫలితంగా ఈ సీజన్‌లో సన్న ధాన్యం సాగు భారీగా పెరిగిపోయింది. ఈ సీజన్‌లోనూ ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తుంది కానీ, బోనస్ చెల్లించడం లేదు. ఇందుకు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడమే. ఈ విషయం కూడా మేము ఆ రోజే స్పష్టంగా ప్రకటించాం. వరికి బదులుగా ఇతర పంటలకు బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము హెచ్చరించిన విధంగానే ఇప్పుడు జరిగింది. వరి సాగు చేసిన రైతులు, భూగర్భ జలాలు ఎండిపోయి, పంటలు ఎండిపోయి నష్టపోయారు. ఇప్పుడు అకాల వర్షాలతో పంటలు తడిచి నష్టపోతున్నారు. బోనస్ కూడా అందడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుండీ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), కొన్ని పంటలకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (WBCIS) అమలును నిలిపి వేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న భరోసా లేకుండా పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన అభయ హస్తం మేనిఫెస్టోలో రాష్ట్రంలో అన్ని పంటలు కవర్ అయ్యేలా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పైగా రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం కూడా తానే చెల్లిస్తానని హామీ ఇచ్చింది.


కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఖరీఫ్, 2024–2025 రబీ సీజన్‌లలో పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. ఈ సీజన్‌లో పంటల బీమా పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి గానీ, పంటల బీమా పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర వ్యవసాయశాఖ ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ వెంటనే పంటల బీమా పథకం నోటిఫికేషన్ విడుదల చేయాలి. కౌలు రైతులకు కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతులు జులై 31 వరకూ పంటల బీమా పథకంలో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు, పోడు రైతులు, అసైన్డ్ రైతులతో సహా, వాస్తవ సాగుదారుల పేర్లు ఈ ఖరీఫ్ సీజన్‌లో నమోదు చేసి, వారికి పంటల బీమా పథకం వర్తించేలా చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదహారు నెలల్లో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మూడు సందర్భాలలో ఎకరానికి రూ.10వేల పరిహారం చెల్లించినా, ఆ పరిహారం కూడా వ్యవసాయం చేయని భూ యజమానులకు అందింది తప్ప, సాగు చేసి నష్టపోయిన కౌలు రైతులకు అందలేదు. ఈ అన్యాయాన్ని సరిచేయాలి. కౌలు రైతుల గుర్తింపుపై ప్రభుత్వంలోనూ బయటా చాలా చర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మంత్రులు నిర్వహించిన జిల్లాల ప్రజాభిప్రాయ సేకరణలో కూడా కౌలు రైతులను గుర్తించి వారికి సహాయం చేయాలని ఎక్కువమంది భావించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపుపై తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ మే 12వ తేదీన ప్రత్యేక చర్చా సమావేశం ఏర్పాటు చేసింది. కౌలు రైతులను గుర్తించి, వారికి ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించనంత వరకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగవు. ప్రభుత్వం వ్యవసాయం కోసం ఖర్చు పెడుతున్న వేలకోట్ల రూపాయలకు సరైన ఫలితం రావాలంటే ఆ పథకాలు వాస్తవంగా సాగు చేస్తున్నవారికి అందాలి. ఈ ఖరీఫ్ సీజన్ నుండే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ తప్పక మొదలుపెట్టాలి. 2011 చట్టంలో కొన్ని మార్పులు చేసి మెరుగుపరిచే అవకాశం ఉంది కానీ, దానికి కొన్ని నెలల సమయం కనీసంగా అవసరం అవుతుంది. అప్పటి వరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే, 2025–26 సంవత్సరం కూడా కౌలు రైతులకు ఎటువంటి మేలు జరగదు. ఉన్న చట్టాన్ని అమలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం వెంటనే పూనుకోవాలి. గుర్తింపు కార్డు పొందిన కౌలు రైతులను, భూమి లేని వ్యవసాయ కూలీలను కూడా రైతు బీమా పథకంలో నమోదు చేసి, 2025 ఆగస్టు 15 నుండి వారిని కూడా రైతు బీమా పరిధిలోకి తేవాలి.

- కన్నెగంటి రవి రైతు స్వరాజ్య వేదిక

Updated Date - Jun 04 , 2025 | 06:11 AM