ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Suryapet Incident: సూర్యాపేట ఘటనలు ప్రభుత్వానికో హెచ్చరిక

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:29 AM

సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలతో జరిగిన అమానవీయ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అనుమతులేని ఆసుపత్రులు, అవినీతిలో కూరుకుపోయిన అధికారుల వల్ల ఇద్దరి ప్రాణాలు నష్టపోయాయి.

ఇటీవల సూర్యాపేటలో వెలుగుచూసిన వరుస ఘటనలతో రాష్ట్రం నివ్వెరపోయింది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఓ స్కానింగ్‌ సెంటర్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. మూడోసారీ ఆడపిల్లే పుట్టబోతోందని తెలిసి, నెలల గర్భవతిగా ఉన్న ఓ మహిళ ఆబార్షన్‌కు సిద్ధపడింది. కాసులకు కక్కుర్తిపడిన ఓ ఆర్‌ఎంపీ ఆమెను పట్టణంలో అనుమతుల్లేని ఓ ఆస్పత్రిలో చేర్పించాడు. సదరు ఆస్పత్రి నిర్వాకం వల్ల ఆ గర్భవతి మృతి చెందింది. ఇక్కడి వరకూ ఓ కథ. అంతకు కొద్దిరోజుల ముందు అదే సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ స్కానింగ్‌ సెంటర్‌ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆ కేసు నుంచి తప్పించేందుకు నిందితుడిని స్థానిక డీఎస్పీ, సీఐ రూ.25 లక్షలు డిమాండ్‌ చేసి ఏసీబీకి పట్టుబడ్డారు!

నిబంధనలను పాతరేసిన స్కానింగ్ సెంటర్, అనుమతులు లేని ఆసుపత్రి, సమాజాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారులు అవినీతికి పాల్పడడం, ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు ప్రజల ప్రాణాలను హరించడం లాంటి అమానుష ఘటనలు సభ్య సమాజంలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న స్కానింగ్ సెంటర్లకు, ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయా? ఉంటే అవి నిబంధనలకు లోబడే పని చేస్తున్నాయా? ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు సరైన అర్హతలు ఉన్నాయా? అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోడానికి వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు వెనుకాడుతోంది?


అనుమతి లేని స్కానింగ్ సెంటర్ వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ, సీఐ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ స్పందించి ఉండాల్సింది. అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ అమానవీయ ఘటన జరిగేది కాదు. కేవలం వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు ప్రాణాలు బలయ్యాయి. తల్లిని కోల్పోయిన ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

రాష్ట్రంలోని పలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న కొన్ని స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు గర్భస్థ లింగ నిర్ధారణ, పిండ విచ్ఛిన్న కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి గ్రామస్థాయి వరకు దళారులను నియమించుకొని లింగ నిర్ధారణ పరీక్షలతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ తల్లీ బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మామూళ్లకు అలవాటుపడిన వైద్యాధికారులు సదరు ఆసుపత్రుల జోలికి వెళ్ళడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట ఘటనలను ఓ హెచ్చరికగా తీసుకుని స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులపై వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ నిరంతరం నిఘా పెట్టాలి. భ్రూణ హత్యల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన వైద్యులను కఠినంగా శిక్షించాలి.

– బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి, వరంగల్

Updated Date - Jun 03 , 2025 | 12:32 AM