ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Agriculture: అన్నదాతలకు ఆసరాతోనే మంచి ఫలితాలు

ABN, Publish Date - Jul 17 , 2025 | 01:25 AM

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలకు అనుకూలంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలకు అనుకూలంగా ఉంది. కానీ చేయూత కరువవ్వడంతో రైతన్నలు పంట రుణాలు, సాగు, ఉత్పత్తి, పంట నిల్వ, మార్కెటింగ్‌, ఎగుమతులు వంటి అనేక విషయాల్లో వెనుకబడి ఉన్నారు. వారికి ప్రభుత్వం ఆసరానందిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.

రాష్ట్ర వాతావరణం విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంది. సమశీతోష్ణ వాతావరణం ఉండడం వల్ల రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన విత్తనాలు ప్రపంచంలోని ఏ వాతావరణంలోనైనా మొలకెత్తుతాయి. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు అవసరమైన కూరగాయల విత్తనాలు, పశువుల మేత కోసం ఎర్రజొన్నలు మొదట తెలంగాణలోనే ఉత్పత్తి చేశారు. అనంతరం అనేక విత్తన కంపెనీలు స్థానిక రైతులకు ఆడ, మగ విత్తనాలు ఇచ్చి వాణిజ్యపరంగా విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. విత్తన కంపెనీలు, రైతుల మధ్య ఎలాంటి రాతపూర్వక అగ్రిమెంట్‌ లేదు. దీంతో కంపెనీలకు రైతులకు మధ్య ఉండే ప్రమోటర్స్‌ రైతులను మోసగించి కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారు. రాష్ట్రంలో నేటికీ విత్తన చట్టం లేదు. 2004లో విత్తన చట్టం రూపొందించి, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కానీ కార్పొరేట్ల ఒత్తిళ్ల కారణంగా నేటికీ అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. విత్తనచట్టం లేకపోవడం వల్లనే నాసిరకం విత్తనాల వ్యాపారం వ్యవస్థీకృతంగా సాగుతున్నది. ఈ సమస్యలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం విత్తనచట్టం తేవాలి.

రాష్ట్రంలోని 125 లక్షల ఎకరాల సాగుభూమిలో రైతులు ఇప్పటికే 25 శాతం పంటలు వేశారు. కానీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నేటికీ ‘రుణ ప్రణాళిక’ను విడుదల చేయలేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రుణమాఫీలు ప్రకటించడంతో బ్యాంకులు, సహకార సంఘాలు రుణ ప్రణాళికలు రూపొందించడంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు మొత్తం పంట రుణాలల్లో 8.3శాతం ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ అదేశించినా బ్యాంకులు ఆ ఆదేశాలను పాటించడం లేదు. దాంతో రైతులు ప్రైవేట్‌ రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైతు బీమా, పంటల బీమా ప్రీమియంలను ప్రభుత్వం ఇంత వరకూ చెల్లించలేదు. పంటల బీమా, ప్రీమియంను జూలై 30లోపు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అప్పుడే ప్రధాని ఫసల్‌ బీమా పథకం రైతులకు వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని కూలీలు పట్టణాలకు వలస వెళ్లడంతో, వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా... ప్రభుత్వం మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వ్యవసాయానికి అవసరమైన చిన్న చిన్న యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. సబ్సిడీతో పాటు రుణసౌకర్యం కల్పించి యంత్రాల కొనుగోలుకు రైతులను ప్రోత్సహించాలి. ప్రభుత్వం పలు పంటల ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, రైతులను వాటి పర్యటనకు తీసుకెళ్లాలి. మెట్టపంటలతో పాటు ప్రధానంగా హార్టికల్చర్‌ పంటల ప్రదర్శన క్షేత్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి. ఎగుమతి ఆధారిత పంటలను ప్రదర్శించాలి. నర్సరీలను ఏర్పాటు చేసి, రైతులకు అవసరమైన పంటల మొక్కలను అందించాలి.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ముడి ఉత్పత్తులకు బదులు బియ్యం, పప్పులు, నూనెలు, పండ్ల రసాలు, మిరప, పత్తి ఉప ఉత్పత్తులు, పాల ఉప ఉత్పత్తులు తయారు చేయడానికి అవసరమైన ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఈ యూనిట్లకు బ్యాంకులు, కార్పొరేషన్‌లు సహకరించాలి. రాష్ట్ర అవసరాలకు పోగా మిగిలిన ప్రాసెసింగ్‌ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. వ్యవసాయోత్పత్తులు పెరగాలంటే రైతులకు భూములపై హక్కులు చట్టబద్ధంగా ఉండాలి. నేటికి 15 లక్షల మందికి పాస్‌ పుస్తకాలు లేవు. భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.

రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి ఏడాదికి దాదాపు 3.8 కోట్ల టన్నుల పంట ఉత్పత్తి అవుతోంది. ఇందులో కొన్ని పంటలకు శీతల గిడ్డంగులు అవసరం. మార్కెట్‌ మాంద్యంలో ఉన్నప్పుడు పంటను నిల్వ చేసుకుని, ధర పెరిగినప్పుడు అమ్ముకోవడానికి వీలుగా రైతులకు గోదాముల సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర అవసరాలకు మించిన పంట ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్కెటింగ్‌ శాఖను ఏర్పాటు చేయాలి. పంట ఉత్పత్తుల్లో క్రిమి సంహారక మందుల మోతాదు పెరగకుండా శాస్త్రవేత్తలతో రైతులకు సలహాలు ఇప్పించాలి. నాణ్యమైన పంటను ఉత్పత్తి చేసేలా రైతులను చైతన్యవంతం చేయాలి. రైతే రాజు కాబట్టి రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి.

-మూడ్ శోభన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి,

తెలంగాణ రైతు సంఘం

Updated Date - Jul 17 , 2025 | 01:25 AM