Super Six Schemes: సూపర్ ఫాస్ట్‌గా సూపర్ సిక్స్
ABN, Publish Date - Aug 16 , 2025 | 05:06 AM
శ్రమించడాన్ని తేనెటీగల నుంచి, ఓర్పును ఫలాలిచ్చే చెట్ల నుంచి, సేవా భావాన్ని తాను కాలుతూ వెలుగునిచ్చే దీపం నుంచి, నిస్వార్థతను ప్రతిఫలం..
శ్రమించడాన్ని తేనెటీగల నుంచి, ఓర్పును ఫలాలిచ్చే చెట్ల నుంచి, సేవా భావాన్ని తాను కాలుతూ వెలుగునిచ్చే దీపం నుంచి, నిస్వార్థతను ప్రతిఫలం ఆశించకుండా వీచే గాలి నుంచి నేర్చుకోవాలని పెద్దలు చెబుతారు. ప్రకృతిలోని ఈ గుణాలే ఒక నాయకుడి పాలనలోనూ ప్రతిఫలించాలి. ఇదే మార్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పాలన కొనసాగుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ‘స్ర్తీ శక్తి’ పథకాన్ని చంద్రన్న ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పరిధిలో, ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన అయిదు రకాల (పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా కూటమి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించేలా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
పాలనకు ప్రణాళిక అమలు చేయడమే చంద్రబాబును ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణం. జూలైతో పోలిస్తే ఆగస్టు జీఎస్టీ 14 శాతం అధికంగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం అధికం. ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం బాగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వ్యవస్థ బాగున్నట్లు. వైసీపీ నేతలు ఖాళీ చేసిన ఖజానాతో 12 జూన్, 2024న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడోది రూ.4వేలకు పెన్షన్లు పెంపుపై, నాలుగోది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, అయిదోది స్కిల్ సెన్సస్‌పై... ఇలా పాలనకు స్పష్టమైన దిశను చూపించారు. సంక్షేమం, సమగ్రాభివృద్ధే ఎజెండాగా కొనసాగుతున్న చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సూపర్ 6 హామీల అమలు శరవేగంగా సాగుతోంది.
ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లోని ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి రూ.15వేలు వారి తల్లిదండ్రుల ఖాతాలో వేశారు. మొత్తం 67.27 లక్షల మందికి లబ్ధి చేకూరింది. లబ్ధి పొందిన వారిలో బీసీలు 29.82 లక్షలు, ఎస్సీలు 11.76 లక్షలు, ఎస్టీలు 4.26 లక్షలు, మైనారిటీలు 67వేలు, ఈబీసీలు 8.44 లక్షల మంది ఉన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గించేందుకు దీపం–2 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఇప్పటివరకు 1.93 కోట్లకు పైగా సిలిండర్లను అందజేసింది. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్న సంక్షేమం కోసం సూపర్ 6 హామీల్లోని ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20వేలు అందించే కార్యక్రమాన్ని సీఎం ఆగస్టు 2న ప్రారంభించారు. కేంద్ర నిధులతో కలిపి రూ.7వేలు జమ చేశారు. గత ప్రభుత్వం రూ.7,500 ఇస్తే– కూటమి ప్రభుత్వం రూ.14,000 ఇస్తోంది. పి–4లో భాగంగా ఆడబిడ్డలకు అండగా ఉండేలా ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. యువతకు 20లక్షల ఉద్యోగాలు, ఉపాధితో పాటు నిరుద్యోగ భృతి రూ.3వేలు అందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గడిచిన 13 నెలల్లో రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు, 9 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల కార్యక్రమం రాష్ట్రంలో నడుస్తోంది. క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ.4వేల పింఛన్ అందిస్తున్నారు. వలంటీర్లు లేకుండా ఎలా పంచుతారని వైసీపీ విమర్శించింది. కానీ అందుబాటులో ఉన్న అధికారులతో ఒక్క రోజులోనే ప్రభుత్వం సమర్థవంతంగా పింఛన్ల పంపిణీ చేస్తోంది. వైసీపీ హయాంలో రూ.1,000 పెంచడానికి అయిదేళ్ల సమయం తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే పింఛన్లను పెంచి 64 లక్షల మందికి అందిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి అవసరాలను కూడా గుర్తించి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. వెనుకబడిన వర్గాలకు మొక్కుబడిగా నామినేటెడ్ పోస్టులు, నిధులు కేటాయిస్తూ గత పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నిధులు, విధులు అన్నింటిలోను అన్ని వర్గాలకూ అగ్రతాంబూలం ఇచ్చింది. కీలక నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో బీసీల కోసం రూ.47,456 కోట్లు, ఎస్సీల కోసం రూ.20,281 కోట్లు, ఎస్టీల కోసం రూ.8,159 కోట్లు, మైనారిటీల కోసం రూ.4,376 కోట్లు కేటాయించడమే గాక శరవేగంతో ఖర్చు చేస్తూ సంక్షేమానికి బాటలు వేశారు. పోలవరం, అమరావతి, హంద్రీ–నీవా వంటి జీవనాధార ప్రాజెక్టుల పనులు మళ్లీ వేగం అందుకోవడం, రాయలసీమకు నీటి సరఫరా కల్పించడం, రైతులకు ధాన్యం ధరను చెల్లించడంలో 48 గంటల్లోగా నగదు ఖాతాల్లో జమ చేయడం వంటి చర్యలు పాలనకు స్పష్టమైన రూపాన్ని ఇస్తున్నాయి.
‘నవరత్నాల’ పేరుతో ఇచ్చిన హామీలను జగన్‌రెడ్డి అమలు చేయలేదు. మద్యపాన నిషేధం, జలయజ్ఞం కింద ప్రాజెక్టుల పూర్తి, పేదలందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల వైద్యం, పీజీ వరకు ప్రతి ఒక్కరికీ విద్య... అంటూ ఇచ్చిన హామీలేమీ అమలుచేయక వంచించారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేక ఆత్మాహుతి చేసుకునే స్థాయికి దిగజారుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే వైసీపీ నాయకులు అసూయతో రప్పా రప్పా కుట్రలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం 180 హామీల్లో 128 హామీలను అంటే 71శాతం హామీలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మరో 52 హామీల అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే ఈ హామీలన్నింటినీ అమలు చేసి, మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోనుంది. ప్రతి క్యాబినెట్‌లోనూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. సంపద సృష్టించడం ద్వారా సంక్షేమాన్ని రెట్టింపు స్థాయిలో అమలు చేస్తూ బడుగు బలహీనవర్గాల భవిష్యత్‌కు ప్రభుత్వం బంగారు బాటలు వేస్తోంది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వినూత్నమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ నవ్యాంధ్రప్రదేశ్‌ను సంక్షేమ ఆంధ్రప్రదేశ్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తున్నారు.
-డా. అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్,
స్టాంపుల శాఖ మంత్రి
Updated Date - Aug 16 , 2025 | 05:06 AM