ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indias Defence Leap: జయ మంగళం

ABN, Publish Date - Aug 27 , 2025 | 12:11 AM

ఇరుగు పొరుగు దేశాలతో వైషమ్యాలు ఉన్నప్పుడు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించుకోవడానికి రెండు మార్గాలున్నాయి: ఒకటి రాజనీతిజ్ఞత, రెండోది సైనిక సంసిద్ధత. దక్షిణాసియాలోను, విశాల ప్రపంచంలోను...

రుగు పొరుగు దేశాలతో వైషమ్యాలు ఉన్నప్పుడు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించుకోవడానికి రెండు మార్గాలున్నాయి: ఒకటి రాజనీతిజ్ఞత, రెండోది సైనిక సంసిద్ధత. దక్షిణాసియాలోను, విశాల ప్రపంచంలోను ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా సైనిక పాటవాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిన్నగాక మొన్న శనివారం నాడు విజయవంతమైన దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష ఆ అవసరాన్ని సమర్థంగా, ప్రభావదాయకంగా తీర్చింది. ‘ఎదుటి పక్షం వారు నీ మాట మన్నించి, నీ మార్గాన్ని అనుసరించేలా చేయడమే దౌత్య కళ’ అని తలపండిన రాజనీతిజ్ఞుడు ఒకరు ఏనాడో సుభాషించారు. గత పదకొండేళ్లుగా మనం అనుసరిస్తున్న దౌత్య విధానాలు ఈ సత్యాన్ని సార్థకం చేశాయా? సర్వోన్నత విధానకర్త వైయక్తిక పోకడలు మన పట్ల సమీప, సుదూర దేశాల సుహృద్భావాన్ని తగ్గించివేశాయి. హరించివేశాయనడమే సబబుగా ఉంటుందేమో? ఆ సర్వోన్నతుడి చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేకపోయినా సునిశ్చిత దౌత్య సూత్రాలను పాటించనప్పుడు ఇటువంటి పరిస్థితి తప్పకపోవచ్చు. మనపై అహేతుక ద్వేషంతో రగిలిపోతున్న ఒక పొరుగుదేశం మారిన అంతర్జాతీయ పరిస్థితులను అదునుగా తీసుకుని అమానుష ఉగ్రవాద ఘాతుకానికి పాల్పడినప్పుడు ప్రతీకార చర్య చేపట్టడం అనివార్యమయింది. అయితే అది చిత్రంగా మనం అంతర్జాతీయ రాజకీయ చాణక్యాలలో ఎంత అవాస్తవికంగా వ్యవహరిస్తున్నామో తెలియజెప్పింది. దేశాన్ని ఏకాకిని చేస్తున్న దుస్తర పరిస్థితులను అధిగమించేందుకు కేవలం రాజనీతిజ్ఞతపైనే ఆధారపడకుండా సైనిక సంసిద్ధతను కూడా ఆలంబన చేసుకోవాలన్న సత్యాన్ని మన విధానకర్తలు గ్రహించారు.

ఆ సత్య గ్రహణతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాడు శత్రు దాడులను తటస్థీకరించడానికి మాత్రమే కాకుండా బలంగా ఎదురుదాడి చేయడానికి కూడా స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధిపరచనున్నట్టు ప్రకటించారు. ‘రాబోయే పదేళ్ల కాలంలో అంటే 2035 సంవత్సరం నాటికి దేశంలోని సమస్త వ్యూహాత్మక, పౌర ప్రదేశాలూ కొత్త సాంకేతిక వేదికల ద్వారా సంపూర్ణ భద్రతా కవచాన్ని పొందుతాయని ఆయన అన్నారు. ప్రతి పౌరుడూ సురక్షితంగా ఉండేంతవరకు ఆ భద్రతాకవచం విస్తరిస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. అధునాతన సాంకేతికత కృత్రిమ మేధ ప్రధాన పాత్ర పోషించే, బహుళ స్థాయిలలో ఉండే ఈ భద్రతా కవచ వ్యవస్థకు శ్రీకృష్ణుని స్ఫూర్తితో ‘సుదర్శన్‌ చక్ర’ అని నామకరణం చేశారు. రక్షణ పరిశోధన సంస్థలు, సాయుధ బలగాల వ్యవస్థలు, ప్రైవేట్‌ సంస్థల సమన్వయ సహకారాలతో ‘సుదర్శన్‌ చక్ర’ను నిర్మిస్తారు. మిషన్‌ సుదర్శన్ చక్ర పరిపూర్తికి తొలి అడుగే శనివారం నాడు ఒడిషా తీరంలో విజయవంతంగా నిర్వహించిన సమీకృత రక్షణ ఆయుధ వ్యవస్థ తొలి పరీక్ష. శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ ఇది. మూడు భిన్న ఆయుధాలు– ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకువెళ్లే క్షిపణి, స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ, లేజర్‌ ఆధారిత డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ ఇందులో అనుసంధానమై ఉండి మూడు భిన్న లక్ష్యాలను ఏకకాలంలో కూల్చివేయగలుగతాయి. ఇటువంటి అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, జర్మనీ, ఇజ్రాయెల్‌కు మాత్రమే ఉన్నాయి. కనుకనే భారత్‌ అభివృద్ధిపరచుకున్న సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమున్న సైనిక పాటవ పురోగతి అని చైనీస్‌ రక్షణ వ్యవహారాల ఉన్నతస్థాయి నిపుణుడు ఒకరు అంగీకరించక తప్పలేదు.

సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ విజయం వినూత్న సైనిక సాంకేతికత సముపార్జనలో అద్భుతమైన ముందుడగు కాగా ఆదివారం నాడు శ్రీహరికోటలో గగన్‌ యాన్‌ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్‌ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్‌ పరీక్ష విజయవంతమవడం భారతీయ వైజ్ఞానిక మేధకు ఒక దివ్యమైన వెలుగుదారి. భారతీయులు త్రివిక్రములు కాగలరనే భరోసాను ఇస్రో తాజా విజయం కల్పిస్తోంది. ఈ విజయాలు రెండూ ఉత్కృష్టమైనవే. మన పురోగతికి విశేషంగా తోడ్పడేవే. అయితే ఇదే సమయంలో మనం విస్మరిస్తున్న ఒక వాస్తవం ఉన్నది. అది మన ప్రాకృతిక వ్యవస్థలను మనమే స్వయంగా ధ్వంసం చేసుకోవడం. మన ఉనికికి ఆలవాలమైన ధరిత్రిని నిర్జీవం చేసుకోవడం విజ్ఞత ఎలా అవుతుంది? మన వైజ్ఞానిక విజయాలు ‘ధరనుచొచ్చి, దివినివిచ్చి/ విరులు తాల్చు తరువు’లా నిత్య హరితంగా వర్థిల్లాలంటే మనం మన ధాత్రిని సంరక్షించుకోవాలి. సజీవంగా ఉంచుకోవాలి. వినాయక చవితి శుభవేళ అటువంటి సంకల్పం వహించడమే ఆ ఆత్మీయ పురాణ పురుషునికి నిజమైన పూజ అవుతుంది.

Updated Date - Aug 27 , 2025 | 12:11 AM