Street Dog Verdict Sparks: వీధికుక్కల వివాదం
ABN, Publish Date - Aug 26 , 2025 | 04:45 AM
ఎనిమిది వారాల్లోగా ఒక్క వీధికుక్క దేశరాజధాని రోడ్లమీద కనబడకూడదంటూ సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ జారీచేసిన ఆదేశాలు కఠినంగా ఉండటంతో పాటు, ఆచరణలో అసాధ్యమని కూడా గ్రహించినందున అనంతరం సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరిగాయి....
ఎనిమిది వారాల్లోగా ఒక్క వీధికుక్క దేశరాజధాని రోడ్లమీద కనబడకూడదంటూ సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ జారీచేసిన ఆదేశాలు కఠినంగా ఉండటంతో పాటు, ఆచరణలో అసాధ్యమని కూడా గ్రహించినందున అనంతరం సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరిగాయి. అత్యంత వివాదాస్పదమైన ఓ అంశంమీద తీర్పు కూడా వివాదాస్పదమైన రీతిలో ఉన్నందున, మరుసటి తీర్పు జంతుప్రేమికులకు నచ్చింది. ఢిల్లీ, సబర్బన్‌ప్రాంతాల్లో పదిలక్షలవరకూ వీధికుక్కలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో, రెండునెలల్లోనే ఈ వీధికుక్కలన్నింటినీ పట్టుకొని, జంతు సంరక్షణాకేంద్రాలకు తరలించాలనడమే కాదు, మళ్ళీ వాటిని వీధుల్లోకి వదలకుండా అక్కడే నిర్బంధించాలన్న తొలి తీర్పు ఆచరణలో ఎంతో అమానవీయంగా అమలు జరుగుతుందని జంతుప్రేమికులు బాగా భయపడ్డారు. మూగజీవులమీద కేవలం ప్రేమతో ఆ ఆదేశాలను వ్యతిరేకించినవారిని అటుంచితే, సదరు తీర్పు పలుకారణాల రీత్యా ఆశించినదానికి పూర్తి విరుద్ధమైన ఫలితాన్నిస్తుందని కూడా కొందరు విశ్లేషించారు. టీకాలువేసి, డీవార్మింగ్ చేసి, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, వీధికుక్కలను మళ్ళీ అవి ఉంటున్న ప్రాంతాల్లోనే వదిలేయాలని సుప్రీంకోర్టు తన సవరణ తీర్పులో ప్రకటించింది. రాబిస్ ఉన్నవాటినీ, భయానకంగా ప్రవర్తిస్తున్నవాటినీ మినహాయించినప్పటికీ, తొలి, మలి తీర్పులమీద ఇంకా చర్చ సాగుతూనే ఉంది, వివాదం నడుస్తూనే ఉంది.
సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఇలా తీర్పు సరిదిద్దుకొనేట్టుగా చేసిన జంతుప్రేమికులకూ, సెలబ్రిటీలకు కుక్కలమీదమాత్రమే అంత ప్రేమ ఎందుకుంటుందని కొందరి ప్రశ్న. శునకాల పట్ల కరుణచూపమంటూ సామాజిక మాధ్యమాల్లో నిజానికి ఒక యుద్ధమే సాగింది. పేరొందిన ప్రముఖులు కోర్టుకు తమ వాదనను, వేదనను నివేదించారు, అభ్యర్థించారు, కొందరు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇదంతా న్యాయస్థానాన్ని ప్రభావితం చేసినందునే, వెంటనే తీర్పును సవరించుకున్నదని అనలేం కానీ, తొలి తీర్పు మరీ కఠినంగా ఉన్నదని న్యాయమూర్తులే ఒప్పుకున్నారు. లక్షలాది వీధికుక్కలను నిర్బంధించి, నిర్వహించగలిగే షెల్టర్ల నిర్మాణం, నిర్వహణ అత్యత కష్టమైన పని. ఎకరాలకొద్దీభూమి, శునకసేవలకు సరిపడా సిబ్బంది, వాటి ఆహారం, మందులు తడిసిమోపెడవుతాయి. ఆర్భాటంగా ఆరంభమైనా, నిర్వహణ అనతికాలంలోనే భ్రష్టుపడుతుందన్నది వాస్తవం. స్టెరిలైజ్ చేసిన తరువాత, ఎక్కడి కుక్కలను అక్కడే విడిచిపెట్టాలన్న నియమం చాలా అధ్యయనాల అనంతరం రూపొందినందువల్ల అనంతర తీర్పులో సుప్రీంకోర్టు దానిని ఆమోదించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 37లక్షల కుక్కకాట్లు నమోదైతే, రేబిస్‌తో సంభవించిన మరణాల సంఖ్య అధికారికంగా 55మాత్రమే. సామాజిక మాధ్యమాల కారణంగా దేశంలో ఏ మూల కుక్కదాడిచేసినా ఇప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రేబిస్ సోకినవారి వేదనను తెలియచేసే ఆ కొద్ది వీడియోలు కూడా ఒకటికి పదిసార్లు తిరుగుతూ వీధికుక్కలంటేనే వొణికిపోయేట్టు చేస్తున్నాయి. రేబిస్‌తో ఏటా 20వేల మరణాలు సంభవిస్తున్నాయన్న అనధికారిక లెక్కలను అటుంచితే, కుక్కకాటు తీవ్రమైన సమస్య. సకాలంలో ఇంజక్షన్లు తీసుకొని జాగ్రత్త పడినప్పటికీ, భౌతికంగానూ, మానసికంగానూ ఆ ఘటన మిగల్చే గాయం చిన్నది కాదు. కొందరిని జీవితాంతం అది వెంటాడుతూ ఉంటుంది.
వీధికుక్కలకు సామూహిక సంరక్షణ కేంద్రాల ఏర్పాటుతో సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందనుకొని ఇచ్చిన తొలితీర్పు వివాదాస్పదమై, మళ్ళీ పాతపద్ధతులకే మలితీర్పు ప్రాధాన్యం ఇచ్చింది. వీధికుక్కల సమస్య, వివాదం ఈనాటిది కాదు. భవిష్యత్తులోనూ న్యాయస్థానాల జోక్యం అవసరం రాకుండా ప్రజలు, మరీముఖ్యంగా జంతుప్రేమికులు చొరవ చూపాలి. వీధికుక్కల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి చట్టంలో నిర్దేశించిన అంశాల్లో సగభాగం కూడా మునిసిపాలిటీలు అమలుచేయడం లేదని, తగినన్ని నిధుల కేటాయింపు, వినియోగం జరగడం లేదని, అబద్ధపు లెక్కలతో అధికారగణమే అత్యధిక భాగాన్ని తినేస్తున్నదని జంతుప్రేమికుల విమర్శ. సుప్రీంకోర్టు మలితీర్పు ఈ అంశాలను విస్తృతంగా చర్చించి, పరిష్కారాలను అన్వేషించేందుకు ఉపకరిస్తుంది. స్థానిక సంస్థల నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని జంతుప్రేమికులు ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. ఏటా నిర్దేశించిన లక్ష్యాన్ని అధికారులు పరిపూర్తిచేసేట్టుగా నిరవధిక ఒత్తిడి ఉంచాలి. వాక్సినేషన్, స్టెరిలైజేషన్ ప్రక్రియలు నిక్కచ్చిగా, నిర్దిష్టంగా జరిగేట్టు చేస్తే వీధికుక్కలు పరిమితంగా ఉంటాయి, వివాదాలూ హద్దులు దాటవు.
Updated Date - Aug 26 , 2025 | 04:45 AM