Deepavali Festival of Lights: విజయ దీపావళి
ABN, Publish Date - Oct 19 , 2025 | 01:01 AM
వెలిగించుడు దీపాలను, మమతల మతాబులు, స్వర్ణ ధర్మ విజయ దీపావళి, వెలుగుదారి, విశ్వమంతా ప్రేమ రంగులు...
వెలిగించుడు దీపాలను!
వెలిగించుడొక దీప కళిక స్వార్థధ్వాంత
పటలమంతయు పటాపంచలవగ
వెలిగించుడొక దీప కళిక ఘోర జిఘాంస
మానసమ్ములనుండి మలిగిపోవ
వెలిగించుడొక దీప కళిక కామాది షట్
శత్రువర్గంబెల్ల సమసిపోవ
వెలిగించుడొక దీప కళిక మానవజాతి
బురుషార్థములవెల్గు పొనరజేయ
మానవత్వపు మనికికి మరొక దివ్వె
జీవకారుణ్యమును పెంపు చేయనొకటి
విశ్వశాంతిని వెలయింప వేరుదివ్వె
ఆ పరంజ్యోతి రూపును చూపు దివ్వె
వెలిగించుడు దీపాలను
తొలగింపగ ఇరుల తెరలు దురితము దొరగన్
ఖలుడా నరకుని నీడయె
ఇలలో లేకుండ వెలుగులింపెసలారన్
వేదాంతం శరచ్చంద్రబాబు
మమతల మతాబులు
చీకటిలో చిరుదివ్వెలు వెలిగించుటే పండుగోయి
అజ్ఞానపు అంధకారం విడుచుటనే పండుగోయి
నరకాసుర సంహారం జన జీవన సంతోషం
సత్యభామ వీరోచితం జగతి శాంతి కేతనం
అసుర గణ వధపర్వం ప్రగతి కాంతి పతాకం
అబల కాదు ఏ వనితా తెలుపుతోంది ఈ చరిత
చిచ్చుబుడ్లు కాకర్లు హృది వెలుగుల ఆనవాళ్లు
మదిలోపల కాలుష్యం మసై పోవుటే పండుగోయి
మనసు మనసు కలిసి మెలిసి పురివిప్పితేనే
మమతల మతాబులే ముదముగ విరజిమ్మునోయి
తిమిరంతో సమరమే వెలుగు పూల నిచ్చునోయి
సాంప్రదాయ సందళ్లే వసంతమై వచ్చునోయి...!
కటుకోఝ్వల రమేష్
స్వర్ణ ధర్మ విజయ దీపావళి
స్వర్ణభారత ప్రాంగణద్వారములకు
పచ్చ మావి తోరణముల్ రెపరెపలాడ,
దీపములు గుండె గుమ్మాల తేజరిల్ల–
‘దీపలక్ష్మి’ భువికి వచ్చె– దివ్యగతిని!
సకల మానవకోటిని– జ్ఞానధర్మ
పథముల నడపు ‘దీపాల పండుగ’ ఇది!
ప్రతి గృహము ‘అష్టలక్ష్మి’ నివాసమవగ–
‘స్వర్ణ దివ్య దీపావళి’ పండుగ ఇది!
సకల దేవతాకోటికి సవినయముగ
మానవాళి కావించెడి– మంగళకర
భవ్య ‘దీప పుష్పార్చనా’ పర్వమిదియె!
‘స్వర్ణ ధర్మదీపావళి’ పర్వమిదియె!
అన్నదాతల మోముల – ఆశల చిరు
నవ్వుదివ్వెలు వెలిగించి, నవ్య అఖిల
భారతావని– భాగ్యాల పరిఢవిల్ల
‘స్వర్ణ దీపలక్ష్మీ’ మము సాకుమమ్మ!
– కళ్యాణశ్రీ
ఇంటింటా ఆనందరవళి
ముదితల కన్నుల్లో మతాబులు
చిరుతల చేతులలో కాకర పూలు
తమ్ముళ్లు వెలిగించిరి భూచక్రాలు
పెద్దన్న మోగించే పేటేరు టపాసులు!
దీపావళీ రవళుల కాంతులు
టపాసుల చిటపట మోతలకు
అమావాస్య జడలతో తిష్ట వేసిన
కారుచీకటి ఊరి పొలిమేరలనుంచి
పారిపోయే
ఇంటింటా దీపావళి..
కంటికి ఇంపైన రూపావళి..!
జి. సూర్యనారాయణ
వెలుగుదారి
తిమిరానవెల్గె జ్యోతులు
కమనీయ టపాసులెల్ల గంభీరగతిన్
క్షమనలరారెను ఋజు ధ
ర్మము నడయాడ
భరతోర్వరయు రాజిల్లెన్
చైతన్యపతాక యిదియె
జాతికి నవదీప్తి యిదియె
సత్యంబిదియే
నీతివిధానంబిదె వి
ఖ్యాతంబిదె దీపలక్ష్మికాభరణమిదే
వెలుగే మనసంకేతము
వెలుగే మనబాంధవుండు
వెలుగే హితుడున్
వెలుగుల ఛత్రంబెత్తుచు
వెలుగుల దారిపయనింప
విజయము మనదే
మంకుశ్రీను
విశ్వమంతా ప్రేమ రంగులు
ఆశావాదపు రాకెట్ల సాక్షిగా
ఓటమి జ్వాలలను చిమ్ముతూ
గెలుపు అంతరిక్షంలోకి
చిచ్చుబుడ్లు స్వేచ్ఛగా దూసుకెళ్లేలా
సుర సుర బాణాల ఆత్మవిశ్వాస దీపావళి
ఆనంద డోలికల ఇంద్రధనస్సు కావాలి
చెడుపై రావణ సంహారం
మంచిపై రాముని సందేశం
మనలోని విద్వేషాల బాంబుల
నరకాసురుడు అస్తమించి
విశ్వమంతా ప్రేమ రంగుల
నవోదయ దీపావళి వికసించాలి
శాంతి మంత్రం జీవనదిలా ప్రవహించాలి
– ఫిజిక్స్ అరుణ్ కుమార్
Updated Date - Oct 19 , 2025 | 01:01 AM