ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Degrees Arent Enough: డిగ్రీలు చాలవు నైపుణ్యాలే కీలకం

ABN, Publish Date - Sep 04 , 2025 | 01:26 AM

ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఉన్నత భవిష్యత్తుకు దారులు వేసుకోవాలని ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు కలలు కంటుంటారు.......

ద్యోగాల్లో స్థిరపడాలని, ఉన్నత భవిష్యత్తుకు దారులు వేసుకోవాలని ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు కలలు కంటుంటారు. అయితే కళాశాలల నుంచి కార్యాలయాల వరకు ప్రస్థానం అంత తేలికగా జరగడం లేదు. వాస్తవం ఏమిటంటే– దేశంలో అటు ఉద్యోగాలూ ఉన్నాయి, ఇటు పట్టభద్రులైన ఆశావహులూ ఉన్నారు. కానీ ఈ రెండింటి మధ్య పొంతనే కుదరడం లేదు. భారతదేశంలో ఉన్నది నిరుద్యోగ సమస్య కాదు; ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేని సమస్య! ఇటీవలే విడుదలైన ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ – 2025’ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2024 నివేదిక ప్రకారం మన పట్టభద్రుల్లో 51శాతం మంది మాత్రమే ఉద్యోగం చేసేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే– 8.25 శాతం మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలినవారంతా విద్యార్హతలతో సంబంధం లేని పనుల్లో స్థిరపడుతున్నారు. లేదా తక్కువ వేతనాలతో రాజీ పడిపోతున్నారు. డిగ్రీలు ఉద్యోగాల దిశగా దారిచూపడం లేదు.

దేశంలో బాగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగాలకు కొదవ లేనేలేదు. 2030 నాటికి దేశీ ఫార్మా రంగం విలువ పది లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. కానీ ఈ రంగం నిత్యం ప్రతిభావంతుల కొరతను కూడా ఎదుర్కొంటున్నది. ప్రొడక్షన్‌, డాక్యుమెంటేషన్‌, రెగ్యులేటరీ, కంప్యూటర్ పరిజ్ఞానం, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ లాంటి అంశాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు లేరని కంపెనీలు చెబుతున్నాయి. ఈ రంగాల్లో లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉన్నా 30శాతం వరకూ ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో మరీ ముఖ్యంగా డిజిటల్‌ బ్యాంకింగ్‌, కస్టమర్‌ అడ్వైజరీ, ఇన్స్యూరెన్స్‌ సేల్స్‌ ఉద్యోగాలకు భారీ ఎత్తున నియామకాలు జరుగుతున్నా 40శాతం మంది ఆశావహుల అర్హతలు ఈ ఉద్యోగ అవసరాలకు సరిపోవడం లేదు. డిగ్రీలు, మంచి అకడెమిక్ రికార్డు ఉన్నప్పటికీ చాలామందికి ఆర్థిక వ్యవహారాలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాల్లో తగినంత అవగాహన ఉండటం లేదు. ఇదేదో కొందరికి ఉద్యోగాలు రాకుండా పోవడం అన్న సమస్య కాదు. ఇది ఒక నిశ్శబ్ద ఆర్థిక సంక్షోభం. ఈనాడు యువత నిరుద్యోగాన్ని ఎదుర్కోవడం అంటే, పరిశ్రమల్లో అవసరానికి తగ్గ ప్రావీణ్యం లేకపోవటంగా అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు మూలాలు ఎక్కడ? దేశంలోని రెండవ మూడవ తరగతి నగరాల్లోని ఉన్నత విద్యాసంస్థలు వాస్తవిక జ్ఞానం కంటే సైద్ధాంతిక జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. పరిశ్రమలకు కావాల్సింది ఏమిటి– కమ్యూనికేషన్‌, అనలిటిక్స్‌ లేదా ఆయా రంగాలకు అవసరమైన అంశాలు. కానీ విద్యాసంస్థలు ఈ అంశాల్లో ఏ మాత్రం శిక్షణ ఇవ్వటం లేదు.

శోచనీయమైన అంశం ఏమిటంటే ఇక్కడ తెలివికి కొరత లేదు, కానీ మార్గదర్శనం మాత్రం తక్కువ. ఏ రంగాల్లో డిమాండ్‌ ఉంది, అవసరమైన నైపుణ్యాలు ఏమిటి, వేతనాలు ఎలా ఉన్నాయి... తదితర విషయాల పట్ల చాలా మంది పట్టభద్రులకు కూడా అవగాహన ఉండటం లేదు. ఇంకోలా చెప్పాలంటే ఏ నైపుణ్యాలు సమకూర్చుకుంటే తమకు ఉద్యోగం వస్తుందన్నది తెలియటం లేదన్నమాట. నైపుణ్యలేమి సమస్యపై దేశంలోని పలు రాష్ట్రాలు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్న తరుణంలో తెలంగాణ ఈ సమస్యకు అసలైన పరిష్కారాన్ని అమలు చేస్తోంది. తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధను ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే. ఫలితంగా పాఠశాల, ఇంటర్మీయట్ దశల్లోనే విద్యార్థులు కృత్రిమ మేధకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, తర్కం నేర్చుకునే వీలు ఏర్పడింది. టెక్‌ ఆధారిత ప్రపంచంలో ముందడుగు వేసే మార్గం ఇదే. టీ–ఫైబర్ ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీ’ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నైపుణ్యాల శిక్షణకు ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన మొట్టమొదటి యూనివర్శిటీ ఇదే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇదొక కలల ప్రాజెక్టు. సీఎం కోరిక మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఒక ఘన విజయంగా చెప్పుకోవాలి. పారిశ్రామిక రంగం సాయంతో విద్యుత్తు వాహనాలు, ఏవియేషన్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, జ్యుయెలరీ డిజైన్, రోబోటిక్స్‌, ఫార్మా, లాజిస్టిక్స్‌ వంటి వేర్వేరు అంశాల్లో ఇక్కడ శిక్షణ దొరుకుతోంది. ఇక్కడ ట్రెయినింగ్ ఇచ్చేది కూడా పరిశ్రమకు చెందినవారే. టీసీఎస్ ఐయాన్ సంస్థ 20 వారాల ‘ప్లేస్‌మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్’ను జూలైలో ప్రారంభించింది. కోర్సు పూర్తి కాకముందే తొలి బ్యాచ్‌ విద్యార్థుల్లో 82 శాతం మందికి ఉద్యోగావకాశాలు ఖాయమయ్యాయి. సాంకేతిక అంశాల్లో క్షేత్రస్థాయి శిక్షణ అవసరమన్న అంచనాతో తెలంగాణ ప్రభుత్వం ‘టాటా టెక్నాలజీస్’ సాయంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్‌ సెంటర్లు (ఏటీసీ)గా అభివృద్ధి చేస్తున్నది. వీటిల్లో ఇప్పుడు మెకాట్రానిక్స్‌, ప్రిసిషన్‌ ఇంజినీరింగ్‌, సోలార్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ వంటి ఇవ్వాల్టి ఇండస్ట్రీ అవసరాలకు తగిన అంశాల్లో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనశాలల్లో కాకుండా పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలన్నమాట.

టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) ద్వారా ప్రభుత్వం సాంకేతిక అంశాలతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ఎలా అన్న విషయాలపై ఆన్‌లైన్, ప్రత్యక్ష శిక్షణను ఇస్తోంది. రాష్ట్రంలోని 147 ఇంజనీరింగ్ కాలేజీలు, 447 డిగ్రీ, పీజీ కళాశాలలు, 96 పాలిటెక్నిక్‌లు, 56 ఫార్మసీ, 25 బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీలు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ సేవలను అందిస్తోంది. ఫార్మా, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లోని అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధమవ్వాలి. ఎందుకంటే వారు డిగ్రీలున్న వారి కోసం చూడటం లేదు. నైపుణ్యాలున్న వారి కోసం చూస్తున్నారు. నేడు విద్యార్థులకు డిగ్రీ ఒక పునాది మాత్రమే. ఇంకా పైకి ఎదగాలంటే నైపుణ్యాలు అనే నిచ్చెన వాడాల్సిందే. దేశంలోనే మొదటిసారి బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం (BFSI) ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బీకాం, బీఏ, బీబీఏ కళాశాలల్లో బీఎఫ్ఎస్‌ఐ పాఠ్యాంశాలను రెండో సంవత్సరంలో ప్రవేశపెట్టాం. ఇంజనీరింగ్‌లో మూడో సంవత్సరం కరిక్యులమ్ మొదలవుతుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఇంటర్న్‌షిప్ దొరుకుతుంది. ఆయా సంస్థలు వారిని తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఈ ప్రక్రియ మొత్తంలో సీఎం రేవంత్‌రెడ్డి చొరవను ప్రత్యేకంగా ప్రశంసించాలి. దేశంలో 2030 నాటికి ఈ రంగంలో 2.5 లక్షలమంది ప్రతిభావంతుల అవసరం ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐలో ఉద్యోగ ఖాళీల సంఖ్య ఏటా 10శాతం చొప్పున పెరుగుతున్నది. సైబర్ సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్‌లెన్స్, లేదా ఇంకో ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌ కావచ్చు. విధానపరమైన మద్దతు ఉంటే నైపుణ్యాల వృద్ధిని విస్తృత స్థాయిలో చేపట్టవచ్చునని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రుజువు చేసింది. అయితే ఇప్పుడు చొరవ కావాల్సింది యువ పట్టభద్రుల వైపు నుంచే. ఉద్యోగాల అన్వేషణతోపాటు, వాటికి తగ్గ నైపుణ్యాలు తమలో ఉన్నాయా అని కూడా వారు ఆలోచించడం మొదలుపెట్టాలి.

-దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలంగాణ ఐటీ,

పరిశ్రమలు, శా.వ్యవహారాల మంత్రి

Updated Date - Sep 04 , 2025 | 01:26 AM