SCO Summit 2025: షాంఘైలో ద్వంద్వ నీతి
ABN, Publish Date - Jun 28 , 2025 | 02:48 AM
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) ఆవిర్భావ ఆశయాల్లో ఉగ్రవాదం మీద ఉమ్మడిపోరు ఒకటిగా ఉన్నప్పుడు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశంమీదే మొన్నటి సదస్సు కూడా జరిగిన తరువాత, సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవడాన్ని విస్మరణగా కాక, కుట్రగానే భావించాలి.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) ఆవిర్భావ ఆశయాల్లో ఉగ్రవాదం మీద ఉమ్మడిపోరు ఒకటిగా ఉన్నప్పుడు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశంమీదే మొన్నటి సదస్సు కూడా జరిగిన తరువాత, సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవడాన్ని విస్మరణగా కాక, కుట్రగానే భావించాలి. రెండురోజుల పాటు రక్షణమంత్రుల స్థాయిలో మేధోమథనం జరిగిన తరువాత, సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేద్దామనుకున్న ఉమ్మడి ప్రకటన భారత్ అభ్యంతరాల నేపథ్యంలో నిలిచిపోయింది. పహల్గాం ఊసులేనందుకు అభ్యంతరం వెలిబుచ్చుతూ సంతకం చేయడానికి మన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిరాకరించారు. ఉగ్రవాదంమీద కలసికట్టుగా పోరాడదామని సంకల్పించి, ఒక భయానకమైన ఉగ్రదాడి జరిగిన తరువాత కూడా, ఒక దేశం అభ్యంతరం వెలిబుచ్చిందనో, దానికి ఆగ్రహం కలుగుతుందనో సంయుక్త ప్రకటనలో సదరు సంఘటన ప్రస్తావన లేకుండా చేయడం ద్వంద్వప్రమాణాలకు నిదర్శనమని రాజ్‌నాథ్ విస్పష్టంగా ప్రకటించారు. శాంతి, భద్రత, పరస్పర విశ్వాసం ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్ళనీ, శాంతి, ఉగ్రవాదం ఒక ఒరలో ఇమడవని ఆయన గుర్తుచేశారు. రాజ్‌నాథ్ తన ప్రసంగంలో ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. లష్కరే తోయిబా జరిపిన గతకాలపు ఉగ్రదాడులు, ఇప్పుడు దాని అనుబంధ సంస్థ చేసిన పహల్గాం ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ఇత్యాది అంశాలతో రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగం ఎంతో లోతుగా సాగింది. భారత్ ప్రతీకారం తీర్చుకుందని, ఉగ్రవాద కేంద్రాలను దుంపనాశనం చేసిందని, ఈ నేపథ్యంలో సభ్యదేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఖండించాలన్నది ఆ ప్రసంగ సారాంశం. పాకిస్థాన్‌పై అంతటి విమర్శ దట్టించిన ఆ ప్రసంగం తరువాత, ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం ఊసెత్తనివ్వకుండా ఏ దేశం అడ్డుపడిందో ఊహించడం కష్టం కాదు.
సదస్సు సవ్యంగా, సయోధ్యతో ముగిసిందని చైనా తేల్చేసింది. సంతకం చేయకపోవడంపై భారత్‌ను వెనకేసుకొస్తున్నవారు ఉన్నట్టే, వ్యతిరేకిస్తున్నవారూ ఉంటారు. పహల్గాం ప్రస్తావన లేకపోవడం కంటే, బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ఈ సహకార సంస్థలోని సభ్యదేశాలన్నీ ఐకమత్యంగా ఖండించడం భారత్‌కు ఆగ్రహం కలిగించిందని, పాకిస్థాన్ సాధించిన ఈ దౌత్యవిజయం భారత్‌ను ఇరకాటంలో పడవేసిందని విశ్లేషకులు అంటున్నారు. పహల్గాం దారుణం, పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదం ప్రస్తావనలు లేకుండా, ఒక అంతర్జాతీయ వేదిక కేవలం బలూచిస్థాన్ గురించి మాట్లాడటమంటే మన దౌత్యవిధానం విఫలమైనట్టేనని విపక్షనేతల విమర్శ. మోదీ ఏలుబడిలో భారత్ ఏకాకి అయిపోయింది, మిగతా ప్రపంచంముందు మనకు అవమానాలు మిగులుతున్నాయి, పాకిస్థాన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు సాయంగా అందుతూంటే, ఉగ్రవాదాన్ని కనీసంగా ఖండించడానికి కూడా మనపక్షాన ఎవరూ నిలవడం లేదని కాంగ్రెస్ దెప్పిపొడుస్తోంది.
ఈ సహకార సంస్థ ఆవిర్భావ లక్ష్యాలను, ఆశయాలను అటుంచితే, ఈ సంస్థలో కీలకపాత్రలు, పాత్రధారులు ఎవరో తెలిసిందే గనుక, ఉమ్మడి ప్రకటనలో మార్చి 11న బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేయడం గురించి మాత్రమే గుండెలు బాదుకొని, మరుసటి నెలలోనే పాతికమంది పర్యాటకులను పహల్గాంలో ఊచకోతకోసిన దారుణాన్ని అలవోకగా విస్మరించడం ఆశ్చర్యం కలిగించదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేదికమీద మనం ఒంటరి కావడంలోనూ విశేషమేమీలేదు. పాకిస్థాన్‌ను నొప్పించడం ఇష్టంలేకపోవచ్చు సరే, దానిని మెప్పించడానికి చైనా ఇంత నిస్సిగ్గుగా సిద్ధపడటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. బలూచ్ ఘటనకూ, పహల్గాం ఘటనకు హస్తిమశ కాంతరం ఉన్న విషయం చైనాకు తెలియనిది కాదు. అక్కడ సాయుధులు ఉన్నారని, ఇక్కడ నిరాయుధులు బలైనారనీ, మతం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలు తీశారనీ, ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రఘాతుకమనీ దానికి తెలుసు. సరిహద్దులు దాటివచ్చి భారత భూభాగాలను ఆక్రమించుకుంటున్న ఒకదేశం, సరిహద్దులు దాటించి ఉగ్రవాదులతో ఊచకోతలు కోయిస్తున్న మరొక దేశానికి వత్తాసు పలకడంలో ఆశ్చర్యమేమీ లేదు.
Updated Date - Jun 28 , 2025 | 02:51 AM