న్యాయ నిష్పాక్షికతపై నీడలు !
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:04 AM
దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ, వివిధ హైకోర్టుల్లోనూ పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఏం చేయాలీ ఏం చెయ్యకూడదు అనేదానిపై ఈ మధ్య దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతున్నది. భారత ప్రధాన...
దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ, వివిధ హైకోర్టుల్లోనూ పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ఏం చేయాలీ ఏం చెయ్యకూడదు అనేదానిపై ఈ మధ్య దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతున్నది. భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ సదాశివం 2014లో పదవీ విరమణ తర్వాత నెల రోజుల్లోనే కేరళ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోవటంతో ప్రారంభమైన రచ్చ జస్టిస్ రంజన్ గోగోయ్ 2019లో పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యునిగా మార్చి 2020లో నియమితులు అవ్వటంతో మరింత పెరిగింది. సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ కూడా పదవీ విరమణ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా పదవి స్వీకరించి ఆ పదవిలో 1997 నుండి 2001 వరకు కొనసాగారు. ఆ కాలంలో గవర్నర్‌గా ఆమె నిర్ణయాలు కూడా వివాదస్పదమైనాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వున్న అబ్దుల్ నజీర్ కూడా జనవరి 2023లో పదవీ విరమణ చేసి వెన్వెంటనే అంటే ఫిబ్రవరి 12న గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశారు.
పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం భారత భూభాగంలోని ఏ కోర్టులోనూ న్యాయవాదిగా వ్యవహరించకూడదు. అలాగే ఆర్టికల్ 220 ప్రకారం పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి తాను పని చేసిన హైకోర్టు మినహా మిగిలిన హైకోర్టులలోగాని, సుప్రీంకోర్టులో గాని న్యాయవాదిగా పనిచేయవచ్చు; కానీ మరే ఇతర కిందస్థాయి కోర్టుల్లో న్యాయవాదిగా వ్యవహరించకూడదు. న్యాయవాదులుగా పనిచేయటం విషయంలో స్పష్టత ఇచ్చిన రాజ్యాంగం గాని, ఇతర న్యాయ చట్టాలు గాని అధికార పదవుల విషయంలో మౌనం దాల్చాయి. నిజానికి 2014కి ముందు పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరూ ఏ విధమైన పదవీ స్వీకరించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారు రాజ్యసభ సభ్యత్వానికి, గవర్నర్ పదవికి ఆశపడే రోజులు వస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ప్రస్తావించాలి. భారతదేశంలో అత్యంత విస్తృత జీవితం గడిపి బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా; అంతర్జాతీయ కోర్టులో న్యాయమూర్తిగా; గవర్నర్‌గా; వైస్ ఛాన్సలర్‌గా; అమెరికా, ఇంగ్లాండ్, క్యూబా, స్పెయిన్, ఐర్లండ్ దేశాల్లో భారత రాయబారిగా నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా; ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖా మంత్రిగా; అనేక కమిటీలకు, కమిషన్లకూ చైర్మన్‌గా; లా కమిషన్ సభ్యునిగా; ఐరాసలో భారత ప్రతినిధిగా; స్వతంత్ర భారతదేశంలో ముద్రా కుంభకోణం గుట్టుమట్టులు వెలికితీసిన అత్యంత నిజాయితీపరుడు జస్టిస్ యం.సి. చాగ్లా కూడా తాను బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూనే దాన్ని వదులుకొని అమెరికా రాయబారిగా వెళ్లటం స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే వివాదాస్పమైంది. సర్వీసులో ఉన్న ఒక న్యాయమూర్తికి ఇలాంటి నియామకం ఇవ్వటం ద్వారం న్యాయవ్యవస్థ స్వతంత్రత నిజాయితీని ప్రశ్నార్థకం చేశారని నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పార్లమెంటులో విమర్శించాయి. చాగ్లా సమర్థతను, నిజాయితీని ఆనాటి హోంమంత్రి గోవిందవల్లభ్ పంత్ ఎంతగా కొనియాడినా, చివరకు అది చాగ్లా లాంటి గొప్ప వ్యక్తి జీవితంలో మచ్చగానే మిగిలింది. ఆనాటి న్యాయవ్యవస్థలో ప్రఖ్యాతి గాంచి, పదమూడేళ్ళు అటార్నీ జనరల్‌గా ఉన్న యం.సి. సెతల్వాడ్ లాంటి వ్యక్తి చాగ్లాకి అతి సన్నిహితుడైనప్పటికీ తన ఆత్మకథ ‘నా జీవితం’లో ఇలా అన్నాడు: ‘‘చాగ్లాకి రాజకీయ జీవితం పట్ల ఆసక్తి వుంది. లా కమిషన్ నివేదికపైన తాను సంతకం పెట్టిన మరుక్షణమే, సిరా చుక్క తడి ఆరకముందే రాయబారి పదవిలో చేరటానికి న్యాయమూర్తిగా రాజీనామా చేశాడు. ఉన్నత పదవిలో ఉన్నవారి స్వార్థచింతనకు ఇది బలమైన తార్కాణంగా నిలుస్తుంది’’. దానికి బదులుగా చాగ్లా ‘‘సెతల్వాడ్, సహజన్యాయం గురించి నీకు మంచి అవగాహన వుంది. నాతో స్నేహభావం వుంది. నా మీద ఇలా దాడి చేయటం న్యాయంగా ఉందా? నీ సేవలు అవసరమని ప్రధానమంత్రి (నెహ్రూ) కోరితే ఎవరైనా ఎలా తిరస్కరిస్తారు?’’ అంటూ, ప్రథమ ప్రపంచయుద్ధ సమయంలో ఇంగ్లాండు ప్రధాన న్యాయమూర్తిగా వున్న లార్డ్ రీడింగ్‌ను అమెరికాలో రాయబారిగా నియమిస్తే మారు మాట్లాడకుండా ఆ బాధ్యతని అతను స్వీకరించిన విషయాన్ని చాగ్లా ఉదహరించాడు. న్యాయవాదిగా రెండు చేతులా సంపాదిస్తున్న దశలో న్యాయమూర్తిగా బాధ్యత తీసుకోమంటే అది దేశసేవలో భాగమే అని నేను దాన్ని స్వీకరించాను అని చాగ్లా చెప్పుకోవాల్సి వచ్చింది.
ప్రయోజనాల ఘర్షణ, న్యాయవ్యవస్థ గౌరవం నిలబెట్టటం, న్యాయమూర్తిగా ఉన్న కాలంలో తమకున్న అసాధారణ అధికారాలతో లభించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిని నివారించటం తదితర అంశాల కారణంగా న్యాయమూర్తులుగా పనిచేసినవారు తర్వాత ఇతర పదవులు స్వీకరించరాదనే నైతిక సాంప్రదాయం ఒకటి నెలకొన్నది. భవిష్యత్‌లో వారు ఆశించే పదవులకు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఇచ్చే తీర్పులు ప్రాతిపదిక కావటం కూడా గమనార్హం. బాబ్రీ మసీదు తీర్పు చెప్పిన బెంచ్‌లో గోగోయ్, అబ్దుల్ నజీర్ ఇద్దరూ ఉండటం ఇలాంటి వాదనల్ని బలపర్చుతున్నాయి. అయితే కొన్ని మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మొన్న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఖన్నా తర్వాత పదవి చేపట్టిన జస్టిస్ గవాయ్, గత నెల 27న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఓకా – వీరందరూ భవిష్యత్‌లో ఏ పదవీ చేపట్టబోమని ప్రకటించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా ఉండి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన బేలా ఎం. త్రివేది వ్యవహార సరళి న్యాయ నిర్ణయాల్లో ఆమె ధోరణితో పదవీ విరమణ చేసిన ఒక న్యాయమూర్తికి వీడ్కోలు ఇవ్వటమనే సంప్రదాయానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తిరస్కరించడం – ఇవన్నీ శుభ పరిణామాలే.
చెరుకూరి సత్యనారాయణ
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:04 AM