యుద్ధోన్మాదం
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:58 AM
సత్వరమే ఆగనిపక్షంలో ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ అన్ని హద్దులూ దాటే ప్రమాదం ఉంది. తనకు గొప్పలు చెప్పడం ఇష్టం ఉండదని అంటూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇటీవలి భారత్–పాక్ ఘర్షణ ప్రస్తావన తెచ్చారు. తనమాట వినే ఈ రెండుదేశాలూ...
సత్వరమే ఆగనిపక్షంలో ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ అన్ని హద్దులూ దాటే ప్రమాదం ఉంది. తనకు గొప్పలు చెప్పడం ఇష్టం ఉండదని అంటూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇటీవలి భారత్–పాక్ ఘర్షణ ప్రస్తావన తెచ్చారు. తనమాట వినే ఈ రెండుదేశాలూ తక్షణమే దారికొచ్చాయనీ, అదేమాదిరిగా ఇరాన్–ఇజ్రాయెల్ కూడా ఒప్పందం కుదర్చుకోవాలనీ అన్నారు. అయితే, అది ఇప్పట్లో సాధ్యం కాదన్న సందేశం కూడా ఆయనే ఇచ్చేశారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇజ్రాయెల్ అతి దుర్మార్గంగా ఇరాన్‌లోకి చొరబడి సైనికస్థావరాలతో పాటు యురేనియంశుద్ధి కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తే, ఇరాన్‌కు మంచిశాస్తి జరిగిందని, మరిన్ని దెబ్బలు తినాల్సివస్తుందని ట్రంప్ సమర్థించుకొచ్చారు. అమెరికా ఆశీస్సులూ అండదండలతోనే ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్‌మీద విరుచుకుపడి, మరో కొత్తయుద్ధానికి తెరదీసిందన్నది వాస్తవం. ఇరాన్‌ను గాజా తరహాలో దుంపనాశనం చేసిన తరువాతే ఒప్పందాల సంగతని ట్రంప్ వ్యాఖ్యల్లో మర్మం.
యుద్ధం ఎంతకాలం సాగుతుందన్నది ఇరాన్ సైనికపాటవం మీద ఆధారపడివుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అనేకపక్షాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తూ వచ్చింది. అక్టోబర్ 7ఘటనకు ముందువరకూ ఇరాన్‌కు రక్షణకవచాల్లాగా వ్యవహరిస్తూవచ్చిన హమాస్, హిజ్బోల్లాలు ఇజ్రాయెల్ దెబ్బకు గట్టిగా ఎదురుదెబ్బతీయలేని స్థితికి జారుకున్నాయి. యెమెన్‌లో హౌతీలను బలహీనపరచడంలోనూ ఇజ్రాయెల్‌దే పైచేయి అయింది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్‌లలో ఇరాన్‌మీద జరిపిన దాడి ఇజ్రాయెల్‌కు ఒక ట్రయల్‌రన్‌లాగా ఉపకరించిందని అంటారు. అయితే, అప్పుడూ ఇప్పుడూ కూడా ఇరాన్ జవాబు గమనించినప్పుడు దానిదగ్గర డ్రోన్లు, క్షిపణులు ఇత్యాది ఆయుధాలు దండిగానే ఉన్న విషయం అర్థమవుతోంది. అయితే, అవన్నీ హరించుకుపోయాక ఇరాన్ నిస్సహాయంగా చేతులెత్తేసి శత్రువుల ముందు సాగిలబడుతుందని ఎవరూ నమ్మడం లేదు. అమెరికా–ఇజ్రాయెల్ పరిభాషలో చెప్పాలంటే, నిరంకుశులైన ఇరాన్ పాలకులు అంత సునాయాసంగా దేశాన్ని అప్పచెబుతారనుకోలేం. అమెరికా సైనిక స్థావరాలమీద దాడులు చేసి దానిని యుద్ధబరిలోకి లాగి ఇస్లామిక్ దేశాలను ఇరుకునపెట్టే ప్రయత్నం కూడా పద్ధతి ప్రకారం జరగవచ్చు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ప్రశ్నించనందుకు ఇప్పటికే ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న అమెరికా మిత్రదేశాలకు మరో కొత్త పరీక్ష మొదలవుతోంది.
ఇరాన్‌తో అణుఒప్పందం కోసం ఒకపక్క చర్చలు సాగుతూండగా, ఇజ్రాయెల్‌తో మరోపక్క దాడిచేయించి గొప్ప ఎత్తువేశానని ట్రంప్ అనుకొని ఉండవచ్చు. మెట్టుదిగేది లేదని ఇరాన్ పాలకులు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నా, వారిని గద్దెదించేవరకూ వదిలేది లేదని ఇజ్రాయెల్ కూడా అంటోంది. అనేక అణుబాంబులు సిద్ధంచేయగల స్థితిలో ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్, ఈ ఇజ్రాయెల్ దాడి తరువాత, వీసమెత్తు అవకాశం ఉన్నా అణుబాంబు తయారీని వదులుకోదన్నది వాస్తవం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఇరవైయేళ్ళ తరువాత ఒక్కసారిగా ఇరాన్ అతిభయంకరంగా ఎందుకు కనిపించిందో తెలియదు.
అణుబాంబులున్నాయన్న ఆరోపణతో, బ్రిటన్ వంటి తొత్తులను వెంటేసుకొని ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను కూల్చింది అమెరికా. ఇరాక్‌లో ప్రజారంజకమైన పాలనేమీ జరగడంలేదు కానీ, అమెరికా అనుకూల పాలనతో అమెరికా కంపెనీలు చక్కగా చమురు తోడుకుంటూ అప్పటి యుద్ధం లక్ష్యాన్ని నెరవేర్చుతున్నాయి. సద్దాం మరణానంతర పరిస్థితులు ఐసిస్‌వంటి ఉగ్రసంస్థల ఆవిర్భావానికి దోహదం చేసి, ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించే పేరిట తమకు గిట్టని, తమ మాటవినని వారిని మట్టుబెట్టడం అమెరికాకు అలవాటే. ఖమేనీలను కూల్చి ఇరానియన్లకు అతిత్వరలో విముక్తి ప్రసాదిస్తానని నెతన్యాహూ వీరంగం వేస్తున్నారు. ఇరాన్ పాలకులను కూల్చడమంటూ జరిగితే, తదనంతరకాలంలో మిగతా ప్రపంచం ఏ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే భయం. ఇజ్రాయెల్‌ను ప్రపంచపటం నుంచి చెరిపేస్తారన్న ఆరోపణతో ఇరాన్‌పాలకుల మీద విరుచుకుపడిన నెతన్యాహూ వరుస యుద్ధాలతో తన ఎజెండా కొనసాగిస్తూ ప్రపంచాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. తాను యుద్ధవ్యతిరేకిననీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని యుద్ధాలనూ ముగించేస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, పూర్తిభిన్నంగా కొత్తకుంపట్లు రగిలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 02:58 AM