ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెస్సుల తిరకాసు

ABN, Publish Date - Mar 18 , 2025 | 03:04 AM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో సోమవారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అనేకరకాల సెస్సులు, సర్‌చార్జీల పేరిట వసూలు చేసిన సుమారు ఆరులక్షల కోట్ల రూపాయలను...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో సోమవారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అనేకరకాల సెస్సులు, సర్‌చార్జీల పేరిట వసూలు చేసిన సుమారు ఆరులక్షల కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వం వినియోగించకుండా వదిలేసిందన్నది ఆ ప్రకటన సారాంశం. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి వసూలు చేసిన 5.70 లక్షలకోట్లు వచ్చే ఏడాది మార్చి మాసాంతం వరకూ వినియోగం కాకుండాపోతాయని కేంద్రం ప్రకటించింది. వసూళ్ళకూ వినియోగానికీ మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉండటాన్ని ఆర్థికవేత్తలు ఏ పరిభాషలో అభివర్ణిస్తారో తెలియదు కానీ, సామాన్యుడికి మాత్రం కడుపు మండే విషయం ఇది. ముక్కుపిండి వసూలు చేసిన ఇంతటి భారీ మొత్తాన్ని వినియోగించకుండా వదిలివేయడం పన్నువిధానాల్లోనూ, నిర్వహణలోనూ అసమర్థతకు తార్కాణం.

పన్నుల మాదిరిగా కాక, నిర్దేశిత అవసరాలు, ప్రయోజనాల రీత్యా ఈ సెస్సులు, సర్‌చార్జీలు విధిస్తారు కనుక, మరోవిధంగా చెప్పాలంటే, కేంద్రప్రభుత్వం ఈ 5.70లక్షలకోట్ల రూపాయలను అవసరాలకంటే అధికంగా వసూలు చేసినట్టు అనుకోవచ్చు. ప్రత్యేకమైన ప్రయోజనాలకు మాత్రమే సదరు మొత్తాన్ని వాడాల్సి ఉన్నందున, అధికమొత్తాలను వసూలు చేయడమెందుకన్నది ప్రశ్న. ఆర్థికమంత్రి ఈ అంశంమీద అద్భుతమైన వివరణలు ఇవ్వగలరు కానీ, రాష్ట్రాలకు మాత్రం మంచి రాజకీయ ఆయుధం దొరికినట్టే. రాష్ట్రాలకు పన్నుల్లో దక్కే వాటా ఎగ్గొట్టడానికి వీలుగా, ఇలా సెస్సులు, అదనపు సెస్సులు, సర్‌చార్జీల వంటి పేర్లతో కేంద్రం అడ్డతోవలో ఆర్జిస్తోందన్న వాదనలు, విమర్శలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇది వాటికి కొత్త అస్త్రంగా ఉపకరిస్తుంది. రాష్ట్రాలకు వాటా ఇవ్వక్కర్లేదన్న కారణంతోనే కేంద్రం ఈ దారిని ఎంచుకుందనీ, ఆయా మొత్తాలను ఏటా పెంచుతూ, విస్తరిస్తూ పోతున్నదని అవి ఏనాటినుంచో విమర్శిస్తున్నాయి.


సెస్సులు, సర్‌చార్జీల పేరిట వసూలు చేసిన మొత్తంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో వినియోగించని భాగం 83వేల కోట్లు ఉండగా, అది ఏటా అది పెరుగుతూ వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇది ౧.32లక్షలకోట్లు ఉంటుందట. నిర్దిష్టమైన, స్వల్పకాలిక అవసరాలకు ధనాన్ని సమకూర్చుకోవడమే వీటి లక్ష్యమని ఆర్థికమంత్రి చెబుతున్నారు. అవసరాలు అబద్ధం కాకపోవచ్చునేమోగానీ, అవసరాన్ని మించిన ధనాన్ని ఈ పేర్లతో వసూలు చేసినమాట మాత్రం నిజం. 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో 13రకాల సెస్సులు ఉంటే, మరుసటి ఏడాది కేంద్రం ఏడుకు కుదించింది. సర్‌చార్జీలు మాత్రం ఇప్పటికీ నాలుగున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలికసదుపాయాలతో పాటు అనేకరంగాల్లో, చివరకు స్వచ్ఛ ఇంధనం, స్వచ్ఛభారతం పేరిట కూడా సెస్సుల వసూలు కొనసాగుతోంది. వాటి సంఖ్య తగ్గినా వసూలయ్యే మొత్తం తగ్గలేదు, పైగా పెరిగింది. మోదీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో సెస్సులు, సర్‌చార్జీలపేరుతో కేంద్రం వసూలు చేసింది లక్షకోట్లు ఉంటే, ఇప్పుడది నాలుగులక్షలకోట్లు దాటింది. వినియోగం ఎందుకు లేకపోతున్నది, ఏకంగా నాలుగోవంతు మొత్తం ఎందుకు మిగిలిపోతున్నదన్న ప్రశ్నలను అటుంచితే, సదరు సెస్‌లను ఇంకా అంతేస్థాయిలో వసూలు చేస్తుండటం పట్ల ప్రభుత్వం వివరణ ఇవ్వకతప్పదు. పైగా, కాగ్‌ ఇప్పటికే పలుమార్లు వసూలవుతున్న మొత్తాలను నిర్దేశిత రిజర్వ్‌ఫండ్స్‌లోకి బదిలీచేయనందుకు కేంద్రాన్ని తప్పుబట్టింది కూడా. చమురు పరిశ్రమ అభివృద్ధి కోసమంటూ వసూలు చేసిన రెండు లక్షలకోట్ల క్రూడ్‌ ఆయిల్‌ సెస్‌ అందుకు వాడకపోవడం వంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

కేంద్రప్రభుత్వం పన్నురూపేణా వసూలు చేసే ప్రతీ వందరూపాయల్లోనూ 11రూపాయలు సెస్‌, సర్‌చార్జీలే. కేంద్రం ఆదాయంలో సెస్‌ల వాటా పెరుగుతూ, పన్నుల వాటా తగ్గుతూండటంతో రాష్ట్రాలకు దక్కాల్సినదానిలో కోతబడటం మొదలైంది. పన్నుల్లో అరవైశాతం కేంద్రానిది, నలభైశాతం రాష్ట్రాలకు అని ఆర్థికసంఘం హితవు చెబుతూంటే, సర్‌చార్జీలు, సెస్‌ల ఆదాయం తోడై కేంద్రానికి 68శాతం దక్కుతున్నదని, అంతిమంగా రాష్ట్రాలకు 32శాతమే మిగులుతోందని ఆర్థికవేత్తల అంచనా. 15వ ఆర్థికసంఘం రాష్ట్రాలకు 41శాతం అని చెప్పినా 31శాతమే వస్తున్నదని కొందరు లెక్కలు విప్పుతున్నారు. కేంద్రపన్నుల్లో అధికవాటాకోసం పోరాటాలు చేస్తున్న రాష్ట్రాలకు, ఇప్పుడు వసూలు చేస్తున్న సెస్‌లు, సర్‌చార్జీలను కేంద్రం సదరు అవసరాలకు వినియోగించడం లేదన్న వార్త మరింత ఆగ్రహం కలిగించకమానదు.

Updated Date - Mar 18 , 2025 | 04:35 AM