ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రక్తమోడిన గాజా

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:58 AM

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి చర్చించుకోబోతున్న తరుణంలో, ఇజ్రాయెల్‌ మంగళవారం తెల్లవారుజామున గాజామీద విరుచుకుపడి నాలుగువందలమందిని ఊచకోతకోసింది..

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి చర్చించుకోబోతున్న తరుణంలో, ఇజ్రాయెల్‌ మంగళవారం తెల్లవారుజామున గాజామీద విరుచుకుపడి నాలుగువందలమందిని ఊచకోతకోసింది. కనీసం ఆరేడువందలమంది తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య మరింత హెచ్చడం ఖాయం. ఖాన్‌యూనిస్‌, రఫా, ఉత్తరగాజా, గాజాసిటీ ఇత్యాది గాజాపట్టీలోని పలుప్రాంతాలమీద ఇజ్రాయెల్‌ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇంతటి దుర్మార్గాన్ని కలలో కూడా ఊహించని కారణంగా పెద్దసంఖ్యలో స్త్రీలు, పిల్లలతో సహా వందలాదిమంది ఇజ్రాయెల్‌ చేతికి ఇలా సునాయాసంగా చిక్కి బలైపోయారు. పదిహేడు నెలల యుద్ధంలో ఒకేరోజున అత్యధికసంఖ్యలో జనహననం జరిగిన సందర్భం బహుశా ఇదే కావచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు వేరు. పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోగల అవకాశమైనా జనానికి మిగిలివుంటుంది. కానీ, యుద్ధం ఆగి, కాల్పుల విరమణ అమలు జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్‌ ఈ పాపానికి ఒడిగట్టింది. ఇంతకుముందు సురక్షితప్రాంతాలకు తరలిపోయిన పాలస్తీనియన్లు సైతం ఎంతో నమ్మకంగా తిరిగివచ్చినందున, పెద్దసంఖ్యలో ఈ మారణకాండకు బలైపోయారు. కాల్పుల విరమణ కాలంలో గాజాకు తిరిగివచ్చిన పాలస్తీనియన్ల సంఖ్య ఓ ఐదులక్షలవరకూ ఉంటుంది. తమ ఇళ్ళు నేలమట్టమైన చోటే టెంట్లు వేసుకొని వారంతా ఉంటున్నారు.


రాత్రివేళ దాడికావడంతో నిద్రలో ఉన్నవారు సులువుగా దొరికిపోయారు, శిథిలాల్లోనే నిక్షిప్తమైపోయారు. ఒకేమారు గాజా నలుదిక్కుల్లోనూ ఈ దాడి జరిగింది. ఎఫ్‌–16, ఎఫ్‌–35వంటి యుద్ధవిమానాలతో పాటు, హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఆకాశంనుంచి నిప్పులు కురిపిస్తుంటే, నేలమీద ట్యాంకులు విరుచుకుపడ్డాయి. పరుగులు తీస్తున్నవారిని కూడా ఇజ్రాయెల్‌ సైనికులు కాల్చిపారేశారు. ఇప్పటికే, ఆస్పత్రులన్నీ ధ్వంసమై, మిగిలిన ఆ ఒకటీరెండూ ఆస్పత్రుల్లో కూడా మందులూ, వైద్యులు లేని స్థితిలో ఇప్పుడు జరిగిన భయానకమైన దాడి మరింత తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించింది. గాయపడిన ప్రతీవ్యక్తీ చికిత్స అందక కచ్చితంగా కన్నుమూయాల్సిన పరిస్థితులున్నాయి. బందీలుగా ఉన్నవారందరినీ వదిలేయమని అమెరికా అధ్యక్షుడు హమాస్‌ను ఆదేశిస్తే, సదరు సంస్థ ఆ మాట విననందుకు శిక్షగా ఈ ఊచకోత జరిగిందట. ట్రంప్‌కు చెప్పే చేశామనో, ఇలా చేయమని ఆయనే చెప్పారనో ఇజ్రాయెల్‌ అధినేతలు అంటున్నారు. అవును ఈ మారణకాండకు మేమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాం అని అమెరికా గర్వంగా చెప్పుకుంటోంది. కాల్పుల విరమణ కాలంలోనూ ఇజ్రాయెల్‌ చిన్నాచితకాదాడులు కొనసాగిస్తూనే ఉంది, మందులూ ఆహారసరఫరాలను అడ్డుతూనే ఉంది.


అయినా, హమాస్‌ మెత్తబడిన కారణంగా బందీల పరస్పర అప్పగింతలు సజావుగానే సాగుతున్నాయి. ఒప్పందాన్ని ఏ క్షణాన్నయినా కాలదన్ని, మళ్లీ యుద్ధానికి కాలుదువ్వే హక్కు తనకు ఉన్నదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆదినుంచీ వాదిస్తున్నారు. ఆరువారాల క్రితం బలహీనంగా ఉన్న నెతన్యాహూ ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆయుధాలను పోగేసుకొని బలపడ్డాడని, అస్త్రాలకు పదునుపెట్టడం, సైనికులకు విశ్రాంతినివ్వడం, యుద్ధవిమానాలకు రిపేర్లు చేసుకోవడం వంటివి పూర్తికావడంతోనే విరుచుపడ్డారని అంటారు. కాల్పులు నిలిచినకాలంలో ఎంతోమంది హమాస్‌ కీలకనాయకులను ఇజ్రాయెల్‌ గుర్తించడంతో, ఇప్పుడు పెద్దసంఖ్యలో వారిని మట్టుబెట్టగలిగింది. ఒప్పందం రెండోదశలోకి ప్రవేశిస్తే, గాజానుంచి ఇజ్రాయెల్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. అంటే, గాజాను ఏలుకోమని మళ్ళీ హమాస్‌కు ఇచ్చేయడమే. అటువంటి సూచనలు ఏ మాత్రం కనిపించినా, నెతన్యాహూ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటాయి. ఇప్పటికే ఆయనకు దూరం జరిగినవారు ఉన్నందున రాబోయేరోజుల్లో ఆయన అవిశ్వాసపరీక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు కూడా. కోర్టులో అవినీతికేసులు కొలిక్కివచ్చాయనీ, తప్పించుకోవడానికే మళ్ళీ ఈ యుద్ధం రాజేశాడని కొందరు అంటారు. మొత్తానికి మంగళవారం ఊచకోతతో పరిస్థితి మొదటికివచ్చింది. హమాస్‌–ఇజ్రాయెల్‌ మధ్య రెండునెలల కాల్పుల విరమణ ఒప్పందం స్థానంలో మరింత ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. హమాస్‌ దగ్గర ఇంకా 59మంది ఇజ్రాయెలీ పౌరులు బందీలుగా ఉన్నారని లెక్క. కానీ, వారిలో అత్యధికం ఇప్పటికే మరణించారన్న సమాచారం ఉండటంతో ఇజ్రాయెల్‌ ఈ దూకుడు నిర్ణయం తీసుకుందని అంటారు. కానీ, తమవారిని రక్షించుకొనే పేరిట గాజాలో అది మున్ముందు సాగించబోయే విధ్వంసం ఊహకు అందనిది. హమాస్‌ను నిర్మూలించడమనే ముసుగులో తిరిగి తమ ఇళ్ళకు చేరుకుంటున్న పాలస్తీనియన్లను తరిమికొట్టే స్వామికార్యాన్ని కూడా నెతన్యాహూ నెరవేర్చబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 12:58 AM