ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy Leadership: ప్రజాస్వామిక వైఖరి, రెండు భిన్నధ్రువాలు

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:01 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధిపత్య ధోరణి పట్ల తెలంగాణ సమాజం 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని నిరసన తెలిపింది.

‘ప్రజాస్వామిక వైఖరి విషయంలో రాజకీయ నాయకులకు రేవంత్‌రెడ్డి మార్గదర్శి’ అని అంటే పెద్ద స్టేట్‌మెంట్‌లా అనిపించవచ్చు. కానీ, రాజకీయంగా ప్రశ్నించినందుకు కన్నబిడ్డల్ని కాదనుకున్నవారు ఉన్న ఈ రోజుల్లో, తమను తిట్టిపోసిన వారి గొప్పతనాన్ని గుర్తించే విశాల హృదయం ఉండటం విశేషమే!

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆధిపత్య ధోరణి పట్ల తెలంగాణ సమాజం 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని నిరసన తెలిపింది. ఏ మాత్రం ఆత్మశోధన చేసుకున్నా ఈ రెండు ఫలితాల తర్వాత ఆ పార్టీ వైఖరిలో మార్పు కనిపించేది. ఆ మార్పు లేదు, ఇక రాదు అనడానికి తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత వ్యవహారమే ఒక సులభమైన ఉదాహరణ. బీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరిని ప్రశ్నించినందుకు కన్నబిడ్డ కవిత పట్ల కేసీఆర్‌ ఎలా ప్రవర్తించారో ప్రపంచమంతా చూసింది. ఆయన ఆధిపత్య వైఖరికి మరో నిదర్శనం– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు పలకడానికి కూడా కేసీఆర్‌కు నోరు సహకరించకపోవటం. ఈ నాయకుడేనా ప్రజాస్వామిక తెలంగాణ గురించి ఊరు వాడా తిరిగి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది! ఆ పునాదుల మీద పదేళ్ల అధికారాన్ని అనుభవించింది!!

భిన్న వాదనల్ని తనలో ఇముడ్చుకొని వందేళ్లకు పైగా ప్రయాణం సాగించిన రాజకీయ నౌక కాంగ్రెస్. అలాంటి పార్టీలో ఎన్నికలకు ముందు పీసీసీ సారథిగా, ఎన్నికలు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎలా నెట్టుకొస్తారో అన్న సందేహాలు చాలామందిలో ఉండేవి. బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్ని చూసి ఆనందిద్దాం అనుకుంది. కానీ, రాజకీయంగా ఎదురైన ఆటుపోట్లతో, ఎదురుదెబ్బలతో రేవంత్‌రెడ్డి రాటుదేలడమే కాదు, తన భవిష్యత్ గమనం, గమ్యం ప్రజాస్వామ్యమేనని గాఢంగా నమ్మారు. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా ప్రజాస్వామిక విలువల్ని దాటి వ్యవహరించకూడదని రేవంత్‌రెడ్డి పెట్టుకున్న నమ్మకమే నేడు ఆయనకు సర్వరక్షగా నిలుస్తోంది. ఒకప్పుడు ఆయనను ప్రత్యర్థిగా భావించిన చాలామంది నేడు ఆయనలో ఒక శ్రేయోభిలాషిని చూస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల భారాన్ని భుజస్కంధాలపై మోసిన రేవంత్‌రెడ్డికి గెలుపు తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా ప్రజాస్వామిక పద్ధతిలోనే దక్కింది. అంతా తానే అయినప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ ఏమిటని ఆయన అనుకోలేదు. ఎంతో పరిణతితో ఆ పోటీలో తనను తాను నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ నాయకుల్ని మంత్రులుగా పెట్టుకుని పాలనా పగ్గాలు అందుకోవాలంటే అంతులేని ధైర్యం లేదా అసమాన ప్రజాస్వామిక నైజం ఉండాలి. ఆ రెండూ కలబోసిన నేత రేవంత్‌రెడ్డి అని గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆయన తెలంగాణ సమాజాన్ని నడిపిన తీరు చెబుతుంది. తనను నమ్మి ఓటేసిన ప్రజలకు ఆయన భ్రమలు కల్పించలేదు. కఠినమైన ఆర్థిక పరిస్థితుల గురించి ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఆ కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హమీల్ని– ముఖ్యంగా రైతు రుణమాఫీ సహా ఎన్నో క్లిష్టమైన హామీలను నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగినపుడు కార్మిక నాయకుల పట్ల కేసీఆర్‌ ఎంత దూకుడుగా వ్యవహరించారో, ఏ స్థాయిలో బెదిరించారో చూశాం. అదే సందర్భం రేవంత్‌రెడ్డికి ఎదురైనప్పుడు– ఆర్థిక పరిస్థితి బాగా లేనందున సర్దుకుపోవాలని ఆయన కార్మికులకు నచ్చచెప్పారు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడో తప్ప నేతల వైఖరిని అంతగా సమర్థించని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ సైతం ప్రజలకు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వాస్తవాలు చెప్తున్న రేవంత్‌రెడ్డిని మెచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని ఎంత ఇబ్బందిపెట్టారో చూశాం. కన్నబిడ్డ పెళ్లికి బెయిల్ మీద రావడం, చంచల్‌గూడ జైల్లో తీవ్రవాదులను ఉంచే సెల్‌లో ఆయన్ను ఉంచడం లాంటివి మర్చిపోలేని ఘట్టాలు. అధికారాన్ని అందుకున్న రేవంత్ కచ్చితంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి, ఒత్తిడి కూడా తెచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం చేతికి అందివచ్చింది కూడా. అయినా రేవంత్ తొందరపడలేదు. న్యాయపరంగా కేసులు నడిపించారే గాని దుందుడుకు ధోరణి ప్రదర్శించలేదు. పైగా ఏ సమస్య ప్రస్తావన వచ్చినా కేసీఆర్‌ అనుభవంతో పరిష్కారం చూపిస్తే అనుసరిస్తామని కూడా అసెంబ్లీ సాక్షిగా చెబుతూ వచ్చారు. తన పేరు ఉచ్చరించడానికి ఇష్టపడని నేతకు సైతం తాను ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం ప్రజాస్వామిక విధానానికి ప్రాథమిక మెట్టు. బీఆర్‌ఎస్‌ విషయంలో రేవంత్ సంయమన వ్యవహారశైలితో ఇప్పటికే ఇలాంటి ఎన్నో మెట్లు ఎక్కేశారు.

పాలనాపరంగానే గాక పార్టీ అంతర్గత వేదికల్లోనూ అదే సంయమనాన్ని, ప్రజాస్వామ్య వైఖరిని రేవంత్‌రెడ్డి ప్రతి అడుగులోనూ పాటిస్తున్నారు. ఇటీవల సొంత పార్టీ నేతలు కొందరు వివిధ అంశాల్లో అసంతృప్తి చెందారు. రేవంత్‌రెడ్డి వారి ఆగ్రహం వెనుక కారణాలను కనుక్కొని సమస్యను పరిష్కరించారు. గద్దర్ అవార్డుల సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ను రేవంత్‌రెడ్డి అభినందించిన తీరుకూ, మరోపక్క గతంలో ఆయన్ని అరెస్ట్ సందర్భంలో ప్రదర్శించిన కఠిన వైఖరికీ మధ్య ఎంత వైరుధ్యం కనిపించినా, వీటన్నిటి వెనుకా రేవంత్‌రెడ్డి ప్రజాస్వామిక వైఖరి వెల్లడవుతున్నది. ఈ విషయంలో ‘సమకాలీన, భవిష్యత్తు రాజకీయ నాయకులకు రేవంత్‌రెడ్డి మార్గదర్శి’ అని అంటే అది పెద్ద స్టేట్‌మెంట్‌లా అనిపించవచ్చు. కానీ రాజకీయంగా ప్రశ్నించినందుకు కన్నబిడ్డల్ని కాదనుకున్నవారు ఉన్న ఈ రోజుల్లో, తమను తిట్టిపోసిన వారి గొప్పతనాన్ని గుర్తించే విశాల హృదయం ఉండటం విశేషమే! తెలంగాణలో ప్రజాస్వామిక విలువల మీద పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టినందుకు రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గౌరవభావంతో చూస్తారు.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ్యులు,

మహబూబ్‌నగర్

Updated Date - Jul 11 , 2025 | 02:01 AM