ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Salt Industry Crisis: ఉప్పు భూముల లీజులను పునరుద్ధరించాలని

ABN, Publish Date - Jul 15 , 2025 | 01:59 AM

శ్రీకాకుళం జిల్లాలోని నౌపాడ ప్రాంతం ఉప్పు సాగుకు ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఉప్పు ఉత్పత్తికి పేరుగాంచింది

శ్రీకాకుళం జిల్లాలోని నౌపాడ ప్రాంతం ఉప్పు సాగుకు ప్రసిద్ధి. దశాబ్దాలుగా ఉప్పు ఉత్పత్తికి పేరుగాంచింది. స్థానిక ఉప్పు పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది రైతులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఏడేళ్లుగా నౌపాడ ఉప్పు పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పనిపై ఆధారపడ్డ కుటుంబాల జీవితం ప్రశ్నార్థకంగా మారింది.

2018లో నౌపాడలోని సుమారు 2,650 ఎకరాల ఉప్పు భూముల లీజు గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఈ లీజులను పునరుద్ధరించలేదు. ఫలితంగా ఉప్పు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ సహకారం కరువవ్వడంతో ఉప్పును ఉత్పత్తి చేయలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో వీరికి ఆర్థిక సమస్యలు తప్పడం లేదు. గతంలో నౌపాడ ప్రాంతంలో ప్రతి ఏడాది సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అయ్యేది. కానీ ప్రస్తుతం అది 10 వేల నుంచి 15 వేల టన్నులకే పరిమితమైంది. జీవనాధారం కరువవుతుండడంతో 4 వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

గోరు చుట్టుపై రోకటి పోటులా ఉప్పు భూములపై ఇప్పుడు మరో తీవ్రమైన సమస్య వచ్చిపడింది. ఆ ప్రదేశంలో కొన్ని ప్రభుత్వానికి చెందిన భూములు కాగా, మరికొన్ని స్థానికులకు చెందిన భూములు. కొందరు అక్రమార్కులు ఈ భూములపై కన్నేశారు. ఇక్కడి నుంచి మట్టిని తవ్వి, రోజూ వందల ట్రాక్టర్ల ద్వారా ప్రైవేట్‌ లే–అవుట్లు, గృహ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీనివల్ల ఉప్పు భూములు పాడవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఈ భూముల్లో ఉప్పు సాగు చేయడం అసాధ్యం. ఈ విషయమై అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. పర్యావరణ పరిరక్షణ చట్టాలు, భూ సంరక్షణ నిబంధనలన్నింటినీ అక్రమార్కులు ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలో నౌపాడ ప్రజలు ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచుతున్నారు. మొదటిది– ఉప్పు భూముల లీజులను పునరుద్ధరించాలి. తద్వారా ఉప్పు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించవచ్చు. రెండోది– ఆయా భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బాధ్యులపై కేసులు నమోదు చేయాలి. మూడోది– ఉప్పు పరిశ్రమ భూముల లీజులను పునరుద్ధరించలేని పక్షంలో.. ఆ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలి. వారికి ఉద్యోగాలు, పింఛన్లు, స్వయం ఉపాధి పథకాల వంటివి అమలు చేయాలి. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. వందలాది కుటుంబాల జీవన సమస్య. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలకు స్పందించడమే ప్రభుత్వాల కర్తవ్యం.

– అప్పన్న గొనప

Updated Date - Jul 15 , 2025 | 01:59 AM