Manasa Endluri: ముందు తరం నమ్మకాన్నీ ధైర్యాన్నీ ఇచ్చింది
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:35 AM
రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు? కొత్త తరం రచనలు, కొత్త రకం రచనలు ఎన్నో వస్తున్న కాలం ఇది..
రీసెంట్‌గా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్టపడ్డారు? కొత్త తరం రచనలు, కొత్త రకం రచనలు ఎన్నో వస్తున్న కాలం ఇది కాబట్టి ఒక పుస్తకమంటూ చెప్పడం కష్టమే. ఎక్కువ కథలు చదవడానికి ఇష్టపడతాను. స్ఫూర్తి కందివనం కథలు ‘డిమ్కి’, పసునూరి రవీందర్ కథలు ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’, రూబీనా పర్వీన్ కథలు ‘జమిలి పోగు’, కరుణ కుమార్ కథలు ‘సవర్లకొండ’, సురేంద్ర శీలం నవల ‘నడూరి మిద్దె’, మహి బెజవాడ కథలు ‘గన్స్ అండ్ మాన్సూన్స్’, ౠదూరి సుదర్శన్ నవల ‘కెమిస్ట్రీ’, ఉషజ్యోతి బంధం కవిత్వం ‘ఉన్మత్త’... ఇవి ఈ మధ్యకాలంలో నేను పూర్తిగా చదివి ఇష్టపడినవి.
బాల్యంలో/ యవ్వనంలో మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది? నా పదవ ఏట రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో చలం ‘మైదానం’ నవల చదివిన గుర్తు. అప్పుడేం అర్థం కాలేదు గాని ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి మళ్ళీ చలం సాహిత్యమే నన్ను బాగా కట్టిపడేసింది. డిగ్రీ సిలబస్‌లో భాగంగా చదివిన హెన్రీ డేవిడ్ థోరో రాసిన ‘వాల్డెన్’ పుస్తకం నన్ను ఎందుకో కుదిపేసింది. ఆయన ప్రతిపాదించిన జీవన విధానాలు; ప్రకృతిని, జీవితాన్ని గురించి ఆయన చెప్పే తత్వపు విశేషాలతో, ప్రకృతికి దగ్గరగా అతితక్కువలో జీవిస్తూ ఉండడం గురించి రాసిన పుస్తకం ఇది. చదవడంలో ఉండే ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిన పుస్తకం ఇది. ఆ తర్వాత స్కై బాబా రాసిన ‘బేచారే’ కథలు ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు.
మీ పఠనంపై ఇంట్లో తల్లిదండ్రుల ప్రభావం? అమ్మ డా. పుట్ల హేమలత, నాన్న డా. ఎండ్లూరి సుధాకర్‌లు ఇద్దరూ రచయితలు, విరివిగా చదివిన వారిగా ఇంట్లో పుస్తకాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవి. ఫలానాది చదవకూడదు అనే మాటే ఉండేది కాదు. పురాణాల నుండి నేటి ప్రతి పుస్తకం దాకా చదవాలని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. అమ్మ ఎక్కువ అనువాదాలను, వాటి అసలు రచనలను చదవమని చెప్తుండేవారు. భాష మీద, అర్థాల మీద పట్టుని ఇష్టపడేవారు.
మీ నమ్మకాల్ని, దృక్పథాన్ని ప్రభావితం చేసిన రచయిత? నాకంటే ముందు రాసిన ప్రతి రచయిత– అని చెప్తాను. నేను రాస్తున్న క్రైస్తవ, దళిత, స్త్రీ అస్తిత్వ కథల నుంచి ప్రేమ కథల వరకు సంఘటన, సందర్భం బట్టి వాటిని నేను చూసే తీరు మారినా, ప్రతి అస్తిత్వానికి ముందు తరం రచయితలు నిర్దిష్టమైన దారులు వేశారు. ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని తర్వాతి వారికి ఇచ్చారు.
మీరు రాసిన కథల్లో మీకు బాగా నచ్చిన పాత్ర? నేను రాసిన ‘బొట్టు భోజనాలు’ కథ లోని కథా నాయిక పాత్రను గురించి ఇప్పటికీ పాఠకులు గుర్తు చేస్తుంటారు. అప్పటివరకు స్నేహితులుగా కలసిమెలసి ఉండే ఆఫీస్ కలీగ్స్ పండక్కి తన ఆహ్వానాన్ని నిరాకరించినప్పుడు ఆ పాత్ర వండిన ఆ వంటకాలని, ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానాన్ని వివక్షను అర్ధం చేస్కున్న ఏ ఒక్కరూ మర్చిపోలేరు.
రచన విషయంలో మీకు మీరు అర్థం చేసుకున్న ఏదైనా అంశం? నా వరకు ఒక మంచి కథ రాయడమంటే కొన్ని రోజులు మనసు అతలాకుతలం అవుతుంది. మరింక దేనికీ చోటుండదు. కొన్ని సంకలనాల కోసమని నన్ను నేను తొందర పెట్టుకుని రాసిన కథలు పాఠకుల ప్రశంసలు పొందినా నాకు సంతృప్తి లేకుండా చేశాయి. అప్పుడే గాఢంగా అనుకున్నాను– మన దగ్గర బ్రహ్మాండమైన వస్తువు సిద్ధంగా ఉన్నా, బలవంతంగా రాయలేం అనీ, రాయకూడదు అని. ఆలస్యం చేసే నష్టం కంటే, తొందరపాటు తెచ్చిపెట్టే తంటా ఎక్కువ.
ఏ గత కాలం రచయితనైనా కలవగలిగితే ఎవరిని కలుస్తారు? మొట్టమొదటి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మను కలుస్తాను. ఈ ఊహ తల్చుకోడానికే ఆనందంగా ఉంది. ఆమె 1930లలో కథలు రాశారు. నిజానికి ఆమె పెద్దగా దళిత కథలు రాయలేదు. ఆమె అభిరుచి అంతా అంతర్జాతీయ రాజకీయాలు. ఆమె అభివ్యక్తి వేరు. ఆమె రాసిన ‘మొదటి ముద్దు’ కథపై ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో చర్చలు చేస్తుంటారు. ఆమె టీచర్‌గా పని చేస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యం కూడా చేసేవారు. ఆమెను గురించి పూర్తి వివరాలు, కథలతో రచయిత, చరిత్రకారులు సంగిశెట్టి శ్రీనివాస్ పుస్తకం తెచ్చారు. ఆమెను కలిస్తే అప్పటి దళిత స్త్రీ స్థితిగతులు, దళిత కులాలలోని వ్యత్యాసాలు, రాజకీయ అభివృద్ధి గురించి మాట్లాడతాను.
-మానస ఎండ్లూరి
Updated Date - Jul 21 , 2025 | 02:35 AM