Ravi Narayan Reddy: తెలంగాణ పోరాట ఖ్యాతి.. మసకబారొద్దు
ABN, Publish Date - Jun 04 , 2025 | 06:01 AM
రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటాలు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాయి. కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దశాబ్దం గడిచినా, సమాన అభివృద్ధి లక్ష్యం ఇంకా నెరవేరలేదు.
‘చరిత్ర మనకు బోధిస్తుంది, సంస్కృతి మనలను ఏకం చేస్తుంది, పోరాటమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది, అందుకే పోరాటం ఒక్క రోజు ఫలితం కోసం కారాదు, శాశ్వత స్వేచ్ఛ కోసమై ఉండాలి’ అన్న నినాదంతో దోపిడీ, పీడనలపై ఎనభై ఏళ్ల క్రితమే తెలంగాణ రైతాంగాన్ని ఐక్యం చేసి విముక్తి మార్గాన్ని చూపిన సేనాని రావి నారాయణరెడ్డి. ఆయన పోరాట స్ఫూర్తితో సాదాసీదా కూలి జనం ఒక్కటై నిజాం రాజుపై చేసిన పోరాటంతో భూస్వాములు పట్టణాలకు పోయారు, జాగిర్దారీ విధానం రద్దయ్యింది, భూస్వాముల భూకేంద్రీకరణ రద్దయింది. అన్నింటికీ మించి తెలంగాణ రైతుబిడ్డలకు ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛ లభించింది. బక్క రైతుల సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో ప్రజారాజ్యం ఏర్పాటుకు దారి చూపింది. అనేక రక్షణలు, హామీలు అమల్లోకి వచ్చాయి. కానీ భారత యూనియన్‌లో విలీనమైన ఇరవై ఏళ్లలోనే మళ్లీ వివక్ష రూపం మారింది, దోపిడీ విధానం మారింది. దీంతో కడుపు మండిన విద్యార్థి, యువజనులు మా ఉద్యోగాలు మాకే కావాలంటూ మళ్లీ తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచారు. అనేక వందల ప్రాణాలు పోయాయి. ఉద్యమం తర్వాత రాష్ట్రం రాలేదు కానీ, మళ్లీ అనేక హామీలు, నిధులు, రక్షణలు వచ్చాయి. ఇరవై ఏళ్లు గడిచే సరికి మళ్లీ తెలంగాణలో అసంతృప్తి, ఆందోళనలే. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రమే ఈ మారు ఎజెండా అయింది.
ఎట్టకేలకు 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం అన్నట్లుగా తెలంగాణ శకం ప్రారంభమై అప్పుడే ఒక దశాబ్దం గడిచిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇంకా జనం ఆశించిన లక్ష్యాలు సాకారం కాలేదు. పలు చోట్ల లక్ష్యాలు దారితప్పిపోయాయి. అందుకు కారణం అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం, తెలంగాణకు ఏం కావాలన్న దిశా నిర్దేశంలో నెలకొన్న అయోమయం. అందుకే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా బలమైన భవిష్యత్తు నిర్మితం కాబోదన్న అంశం మరోసారి రుజువు అయింది. అందుకే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి నినాదంతో ఏర్పడ రాష్ట్రంలో ఇంకా వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబడుతుంటే, రాజకీయ బలం ఉన్న నాయకుల ప్రాంతాలకే నీళ్లు, నిధులు పరుగులు పెడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి అనే అంశం నినాదంగానే మారిపోతున్నది. ఈ రకమైన విధానం తెలంగాణకు ఏ విధంగానూ మంచిది కాదు. నాడు నిజాం హయాంలో డెమాక్రటిక్‌గా కనిపించేందుకు ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నా, అందులో సభ్యులంతా జాగిర్దార్ల ప్రతినిధుల నుంచే వచ్చేవారు. పేరుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నా, నిర్ణయాధికారమంతా నిజాందే. ఆయన నిర్ణయాలను ప్రధానమంత్రి తూ.చ తప్పకుండా అమలు చేసేవారు. ఎలాంటి ప్రజాభిప్రాయం, మేధోమథనం లేకుండానే నిజాం నోటి నుంచి ఆ క్షణానికి ఏం మాట వస్తే అదే ఫర్మానాగా వచ్చేది. అవి రాజ్య అభివృద్ధి, సంక్షేమం కంటే, నిజాం సంపదను, హోదాను పెంచేవిగానే ఉండేవి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తెలంగాణ ప్రజలు ఆకలి, అవసరాల కంటే ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తారు. ఆత్మగౌరవానికి భిన్నంగా పాలన మారితే, ఎదురుగా ఎవరున్నారని చూడకుండా పిడికిలెత్తి పోరాట పంథాను ఎంచుకోవటం కొత్తేమీ కాదు. అలా ఎంచుకున్నవే 1946 రైతాంగ పోరాటం, 1968 తొలిదశ తెలంగాణ ఉద్యమం, 1997 తెలంగాణ మలి దశ ఉద్యమాలు.
ఈ మూడు పోరాటాల్లో తెలంగాణ రైతులు, యువకుల ఆత్మబలిదానాలే కొత్త చరిత్రకు మైలురాయిగా నిలిచాయి. తెలంగాణను దోపిడీ, పీడనలు కమ్ముకున్న ప్రతి సమయంలోనూ రైతాంగ, విద్యార్థి, యువజన ఉద్యమాలు, విముక్తి ఉద్యమాలు వేగుచుక్కలై నిలిచాయి. అందుకే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. అమరుల త్యాగ స్ఫూర్తిని రేపటి తరానికి అందించేలా పోరాట వీరుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి. వారి పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా సాయుధ పోరాటంతో పాటు పార్లమెంటరీ పోరాటంలోనూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆరిపోని వెలుగు కిరణం రావి నారాయణరెడ్డి సహా మూడు దశల పోరాటాల్లో పాల్గొన్న వీరుల ఖ్యాతి, లక్ష్యాలు మసకబారకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం, ప్రజా ఉద్యమ సంస్థలు, రాజకీయ పక్షాలపై ఉంది.
- రావి ప్రతిభారెడ్డి తెలంగాణ రైతాంగ అమరువీరుల ట్రస్ట్ సభ్యులు (నేడు రావి నారాయణరెడ్డి జయంతి)
Updated Date - Jun 04 , 2025 | 06:03 AM